Share News

Lalit Jha: పార్లమెంటులో దాడి వెనక ‘ట్యూషన్ టీచర్’.. కోల్‌కతాలో ఏడాదిన్నర పాటు..

ABN , Publish Date - Dec 14 , 2023 | 08:42 PM

పార్లమెంటులో పొగబాంబు దాడికి సూత్రధారి అయిన లలిత్ ఝా కోల్‌కతాలో కొంతకాలం పాటు ఉన్నాడట. తాను ట్యూషన్ టీచర్ అని అతడు చెప్పుకునేవాడని స్థానికులు తెలిపారు.

Lalit Jha: పార్లమెంటులో దాడి వెనక ‘ట్యూషన్ టీచర్’.. కోల్‌కతాలో ఏడాదిన్నర పాటు..

ఇంటర్నెట్ డెస్క్: పార్లమెంట్‌లో పొగబాంబుతో దాడి ఘటన (Parliament security breach).. నిన్న యావత్ దేశాన్ని కుదిపేసింది. 2001లో పార్లమెంటు‌పై ఉగ్రవాదుల దాడి జరిగిన 22 ఏళ్లకు మరో దాడి జరగడంతో కలకలానికి దారి తీసింది. వెంటనే రంగంలోకి దిగిన దర్యాప్తు సంస్థలు ఇప్పటికి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నాయి. కానీ, దాడి వెనుక మాస్టర్‌మైండ్ లలిత్ ఝా (Master Mind Lalit Jha) మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు. అయితే, అతడి చరిత్రకు సంబంధించి ఇప్పుడిప్పుడే పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, లలిత్ ఝా కోల్‌కతాలో (Kolkata) దాదాపు ఏడాదిన్నర పాటు ఓ ఇంట్లో అద్దెకు ఉన్నాడట (Rented Accomodation). బారాబజార్ ప్రాంతంలో అతడు ఉండేవాడని తెలుస్తోంది. మీడియాలో అతడి ఫొటో చూసి అక్కడి స్థానికులు ఆశ్చర్యపోయారు. తను టీచర్ అని లలిత్ చెప్పుకుతిరిగేవాడని పేర్కొన్నారు. ఇరుగుపొరుగు పిల్లలందరూ అతడిని ట్యూషన్ సర్‌గా (Tution Sir) పిలిచేవారని తెలిపారు.


మరో విషయం ఏంటంటే..ఆ ఇంటి ఓనర్‌తో లలిత్ ఝా నేరుగా అద్దె ఒప్పందం కుదుర్చుకోలేదని స్థానికులు చెబుతున్నారు. మరో వ్యక్తి ద్వారా లలిత్ ఆ ఇంట్లో చేరినట్టు తెలుస్తోంది. కానీ ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇక లలిత్ ఇంటి బాగోగులు రవి అగర్వాల్ అనే మరో వ్యక్తి చూసుకునేవాడని ఇరుగుపొరుగు చెబుతున్నారు. అతడితో మాట్లాడుకున్నాక లలిత్ ఆ ఇంట్లో దిగాడట. ఆ ఇంటి ఓనర్ విదేశాల్లో ఉంటున్నాడు. మరోవైపు, రవి అగర్వాల్ ఆచూకీ కూడా లభ్యం కాలేదు.

అయితే, లలిత్‌ను ఆ ఇంట్లో చూసి ఏడాదికి పైనే అయ్యిందని స్థానికులు చెబుతున్నారు. స్థానికంగా ఉన్న ఓ స్వచ్ఛంద సంస్థతో కూడా లలిత్‌కు సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లలిత్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.

Updated Date - Dec 14 , 2023 | 08:45 PM