Paid verification :ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా ఖాతాలకూ పెయిడ్‌ వెరిఫికేషన్‌ ఫీచర్‌

ABN , First Publish Date - 2023-02-21T03:36:21+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్‌ మీడియా వేదికలు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ కూడా ట్విటర్‌ మాదిరిగా బాదుడు మొదలుపెట్టాయి.

Paid verification :ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా ఖాతాలకూ పెయిడ్‌ వెరిఫికేషన్‌ ఫీచర్‌

న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాల్లో టెస్టింగ్‌

మెన్లో పార్క్‌, ఫిబ్రవరి 20 : ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్‌ మీడియా వేదికలు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ కూడా ట్విటర్‌ మాదిరిగా బాదుడు మొదలుపెట్టాయి. ఆయా మాధ్యమాల్లో ఖాతాలకు పెయిడ్‌ వెరిఫికేషన్‌ పేరుతో కొత్త విధానాన్ని తెరమీదకు తెచ్చాయి. ఈ ఫీచర్‌ను సబ్‌స్ర్కైబ్‌ చేసుకున్న యూజర్లు నెలకు కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈ పెయిడ్‌ వెరిఫికేషన్‌కు సంబంధించిన టెస్టింగ్‌ ప్రక్రియ ఈ వారంలో న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాల్లో ప్రారంభమవుతుందని.. అనంతరం ఇతర దేశాల్లో కొనసాగుతుందని మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ తెలిపారు. తమ సేవల్లో విశ్వసనీయత, సెక్యూరిటీని పెంచేందుకు ఈ కొత్త ఫీచర్‌ ఉపయోగపడుతుందని వెల్లడించారు. వెరిఫికేషన్‌ కోసం వెబ్‌ యూజర్లు నెలకు 11.99 డాలర్లు(రూ.992).. యాపిల్‌, ఆండ్రాయిడ్‌ యూజర్లు 14.99డాలర్లు(రూ.1,240) చెల్లించాల్సి ఉంటుంది.

ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును తీసుకుని యూజర్‌ అకౌంట్‌ను మెటా వెరిఫై చేస్తుంది. అలా వెరిఫై చేసిన ఖాతాలకు బ్లూ బ్యాడ్జ్‌ ఇస్తుంది. గతంలో ఈ బ్లూ బ్యాడ్జ్‌ను ఉచితంగా ఇచ్చేవారు. ప్రముఖులు లేదా వ్యాపార సంస్థల కోసం ఈ బ్యాడ్జ్‌లను రిజర్వ్‌లో ఉంచేవారు. ప్రస్తుతం జరుగుతున్న టెస్టింగ్‌తో గతంలో వెరిఫైడ్‌గా ఉన్న అకౌంట్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని మెటా వెల్లడించింది. కాగా, అకౌంట్ల వెరిఫికేషన్‌ విధానంలో మెటా.. ట్విటర్‌ను అనుసరిస్తోంది. గత ఏడాది ట్విటర్‌ బ్లూ టిక్‌ కోసం డబ్బులు వసూలు చేయడం ప్రారంభించింది. నెలకు రూ.8 డాలర్లను (రూ.661) చెల్లించిన అకౌంట్లకే బ్లూ టిక్‌ సదుపాయాన్ని ఇస్తోంది. ఆన్‌లైన్‌లో ప్రకటనలు తగ్గిపోవడంతో సోషల్‌ మీడియా కంపెనీలు కొత్త కొత్త ఆదాయ మార్గాలపై దృష్టి పెడుతున్నాయి.

Updated Date - 2023-02-21T03:36:22+05:30 IST