ఉదయనిధి వ్యాఖ్యలు కుల వివక్ష వ్యతిరేక పోరులో భాగమే
ABN , First Publish Date - 2023-09-07T01:24:13+05:30 IST
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు మంత్రి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న నేపథ్యంలో కోలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు ఆయనకు అండగా నిలిచారు.
ప్రఖ్యాత సినీ దర్శకుడు పా.రంజిత్
ఉదయనిధికి కోలీవుడ్ అండ
చెన్నై, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు మంత్రి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న నేపథ్యంలో కోలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు ఆయనకు అండగా నిలిచారు. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో వరుసగా పలుచిత్రాలు తీసిన ప్రముఖ సినీ దర్శకుడు పా.రంజిత్ కూడా ఉదయనిధికి మద్దతుగా నిలిచారు. ఈ వ్యవహారంపై ఆయన స్పందిస్తూ.. ‘‘కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతున్న కుల వివక్ష వ్యతిరేక పోరాట సిద్ధాంతంలో ఉదయనిధి వ్యాఖ్యలు కూడా భాగమే. కులం, లింగభేదం పేరుతో జరిగే అవమానకర చర్యలు సనాతన ధర్మంలో వేళ్ళూనుకుని వున్నాయి. అంబేద్కర్, అయోద్య పండితర్, పెరియార్ వంటి సంఘ సంస్కర్తలు దీన్నే నొక్కి వక్కాణించారు. మంత్రి వ్యాఖ్యల్లోని సారాంశాన్ని అర్థం చేసుకోకుండా, ఆయనపై వ్యతిరేక భావం పెంచుకోవడం ఆందోళన కలిగిస్తోంది’’ అని పేర్కొన్నారు. అలాగే జాతీయ అవార్డు గ్రహీత శీను రామస్వామి ఉదయనిధికి మద్దతుగా ఒక పాట రాయగా, ఎన్‌ఆర్ రఘునాథన్ స్వరకల్పనలో ప్రముఖ గాయకుడు సెంథిల్ దాస్ ఆలపించారు. అలాగే, మరికొందరు కోలీవుడ్ ప్రముఖులు కూడా ఉదయనిధికి మద్దతు తెలుపుతున్నారు. కాగా, ఉదయనిధిపై ఢిల్లీ, ముంబై, బీహార్, ఉత్తరప్రదేశ్‌లో కేసులు నమోదయ్యాయి.