RRR Natu Song Oscar : భూమి దద్దరిల్లేలా.. తెలుగు పాట.. వీర నాటు

ABN , First Publish Date - 2023-03-14T03:31:56+05:30 IST

అంతా కలిసి అద్భుతం చేశారు! తెలుగు పాట కిరీటాన కోహినూరు తొడిగినట్టు.. భారత సినిమా ఖ్యాతి ఎవరెస్టును మించినట్టు.. మనోళ్లు ‘ఆస్కార్‌’ కుంభస్థలాన్ని బద్దలుగొట్టారు!

RRR Natu Song Oscar : భూమి దద్దరిల్లేలా.. తెలుగు పాట.. వీర నాటు

ఆస్కార్‌ ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ ‘నాటు నాటు’

సత్తా చాటిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం

రెండు ఆస్కార్లతో భారతీయులకు డబుల్‌ ధమాకా

ఆస్కార్‌ వేదికపై కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ ప్రదర్శన

వారి పాటకు కాలు కదిపిన హాలీవుడ్‌ నృత్యకళాకారులు

‘నాటు నాటు’కు అవార్డు ప్రకటించగానే పెద్దగా అరుపులు

పాటయ్యాక లేచి నిలబడి కరతాళధ్వనులతో అభినందన

‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’ చిత్రానికి ఆస్కార్ల పంట

ఉత్తమ దర్శకుడు, ఒరిజినల్‌ స్ర్కీన్‌ప్లేసహా 7 పురస్కారాలు

ఉత్తమ నటుడు బ్రెండన్‌ ఫ్రేజర్‌.. ఉత్తమ నటి మిషెల్‌ యో

1rrr.jpg

నా పాట సూడు.. అంటూ పోట్ల గిత్తలాగ అవార్డుల రేసులో దుమికిన ‘నాటు నాటు’కు ఆస్కారు ప్రతిమ.. కాలు సిందు తొక్కింది.

ఏలు సిటకలేసింది! పోలేరమ్మ జాతరలో పోతరాజులా ఊగిపోతూ ఒల్లు సెమట పట్టేలా వీరంగం సేసింది! పాటలోని ప్రతి మాటా ఎర్రజొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు టేస్టూ అంటూ లొట్టలేసింది.

తెలుగు అభిమానులు సహా ఆసేతుహిమాచలం ఊపిరి బిగపట్టుకొని చూస్తుండగా గుండెలదిరేలా డండనకర మోగినట్టు.. సెవులు సిల్లు పడేలా కీసుపిట్ట కూసినట్టు ‘నాటు నాటు’ పాటకు ఫిదా అయిపోయానంటూ గర్వంగా ప్రకటించుకుంది.

పచ్చి మిరపలాగ పిచ్చ నాటు..

గడ్డపారలాగ చెడ్డ నాటు..

అంటూ గీత రచయిత చంద్రబోస్‌,

సంగీత దర్శకుడు కీరవాణి చేతుల్లో ఒదిగిపోయింది!!

అద్భుతం. ఈ ప్రతిష్ఠాత్మకమైన గౌరవం ప్రతి భారతీయుడికి గర్వకారణం. ఈ విజయంతో భారతదేశం ఉప్పొంగింది. గర్విస్తోంది. నాటు నాటు పాటకు ప్రజాదరణ విశ్వవ్యాప్తం. ఇది దేశం గర్వించే రోజు. ఇంత గొప్ప గౌరవాన్ని అందుకున్న కీరవాణి, చంద్రబోస్‌, సిప్లిగంజ్‌, కాలభైరవకు నా ప్రశంసలు. ‘ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌’ బృందానికి నా అభినందనలు.

- ప్రధాని మోదీ

తెలుగు సినిమా రేంజ్‌ పెంచిన విక్రమార్కుడు

పాన్‌ ఇండియా వసూళ్ల వర్షం కురిపించిన మగధీరుడు

తెలుగు సినిమాని ఆస్కార్‌కు తీసుకెళ్లిన బాహుబలి

అతడే.. దర్శక ధీరుడు రాజమౌళి

మనసు - మమతతో అరంగేట్రం

అన్నమయ్యతో జాతీయ పురస్కారం

ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌తో అంతర్జాతీయ కీర్తి కిరీటం

అతడే.. మరకతమణిని పేరులోనే పెట్టుకున్న కీరవాణి

చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని అనే స్ఫూర్తి

మౌనంగానే ఎదగమని అని చెప్పిన జీవిత సత్యాన్వేషి

నాటు నాటుతో ప్రపంచ సినిమాను ఏలిన రచయిత

అతడే.. ఇప్పుడు తెలుగు పాటల బాస్‌.. చంద్రబోస్‌

మంగళ్‌హాట్‌, ధూల్‌పేట గల్లీల కుర్రాడు

వినాయక ఉత్సవ మండపాల్లో పాటగాడు

కోరస్‌తో మొదలుపెట్టి ఆస్కార్‌లో మెరిసిన బిగ్‌బాస్‌

అతడే.. హైదరాబాదీ యాసలో మైమరపించే సిప్లిగంజ్‌

మత్తు వదలరా అంటూ సినిమాల్లోకొచ్చాడు

దండాలయ్యా అంటూ ప్రేక్షకుల మనసు దోచాడు

నాటు నాటుతో ఆస్కార్‌ వేదికపై వీరంగం వేశాడు

అతడే.. కీరవాణి తనయుడు కాలభైరవ

2rajamouli.jpg

అంతా కలిసి అద్భుతం చేశారు! తెలుగు పాట కిరీటాన కోహినూరు తొడిగినట్టు.. భారత సినిమా ఖ్యాతి ఎవరెస్టును మించినట్టు.. మనోళ్లు ‘ఆస్కార్‌’ కుంభస్థలాన్ని బద్దలుగొట్టారు! ఊర మాసు తెలుగు ‘నాటు’ పాటతో డండనకర మోగించారు!! సగర్వంగా ఆస్కార్‌ ప్రతిమను అందుకుని.. తెలుగోడి సత్తా చాటారు! ఆస్కార్‌ వేదికపైకి వెళ్లి.. అకాడమీ అవార్డులను అందుకున్న ఆ క్షణం.. యావద్దేశం పులకించిపోయింది! ప్రతి భారతీయుడి హృదయం.. ముఖ్యంగా తెలుగువారందరి మనసులూ.. సంతోషంతో ఎగిరిగంతులేశాయి!! అదే వేదికపై రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ ఆ పాట పాడుతుంటే.. హాలీవుడ్‌ డాన్సర్లు ఆడుతుంటే.. ఆస్కార్‌ ఆహూతులంతా చెవులు చిల్లుపడేటట్టు గట్టిగా అరిచారు. గొంతు అరిగిపోయేలా కేకలు పెట్టారు. చేతులు కందిపోయేట్లు చప్పట్లు కొట్టారు. కీసుపిట్ట కూసినట్టు ఈలలేసి గోల చేశారు! ఆ నాలుగైదు నిమిషాలూ అది లాస్‌ఏంజెలెస్‌లో ‘95వ అకాడమీ అవార్డుల’ వేడుక జరుగుతున్న డాల్బీ థియేటర్‌లా అనిపించలేదు!! ఊర మాసు హీరో వేసే స్టెప్పులకు ఊగిపోయిన టూరింగ్‌ టాకీసును తలపించింది! పాట అయిపోయాక మనోళ్లు కిందికి దిగి వస్తుంటే.. థియేటర్‌ మొత్తం లేచి నిలబడి స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చింది. ఆ క్షణం అపురూపం. తెలుగువారు దేశానికి సగర్వంగా ఇచ్చిన బహుమానం!!

లాస్‌ ఏంజెలెస్‌, మార్చి 13: నర్గీస్‌, సునీల్‌దత్‌, రాజేంద్రకుమార్‌, రాజ్‌కుమార్‌లాంటి హేమాహేమీలు నటించిన ‘మదర్‌ఇండియా’ చిత్రం వల్ల కానిదాన్ని.. పాన్‌ ఇండియా సూపర్‌ హిట్టయిన ‘లగాన్‌’ సినిమా సాధించలేకపోయినదాన్ని.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సాధించింది! ప్రపంచ సినిమా ప్రేమికులంతా ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఆస్కార్‌’ అవార్డుకు.. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో నామినేట్‌ అయున ‘నాటు నాటు’ పాట ఆ పురస్కారాన్ని సాధించింది. సోమవారం ఉదయాన్నే నిద్రలేచేసరికి భారతీయులందరికీ డబుల్‌ ధమాకాలాగా ఆస్కార్‌ వేదిక నుంచి రెండు శుభవార్తలు. ఒకటి.. ‘నాటు నాటు’ పాటకు వచ్చిన అవార్డు కాగా, మరొకటి మనదేశానికి చెందిన కార్తీకి గొన్‌సాల్వెజ్‌, గునీత్‌ మోంగా తీసిన ‘ద ఎలిఫెంట్‌ విష్పరర్స్‌’కు ఉత్తమ డాక్యుమెంటరీ లఘుచిత్రం విభాగంలో అవార్డు రావడం. ఈ రెండింటితోపాటు.. ‘బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫీచర్‌’ విభాగంలో భారత్‌ నుంచి ఆస్కార్‌కు నామినేట్‌ అయిన ‘ఆల్‌ దట్‌ బ్రీత్స్‌ లాస్ట్‌’కు మాత్రం అవార్డు రాకపోవడం ఒక్కటే లోటు. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం.. లాస్‌ఏంజెలె్‌సలో జరిగిన 95వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవంలో ‘నాటు నాటు’ పాటకు అవార్డు వచ్చినట్టు తెలియగానే యావద్దేశం సంతోషంతో ఉప్పొంగిపోయింది. ఈ పాటకు స్వరకల్పన చేసిన సంగీత దర్శకుడు కీరవాణి, పాట రాసిన రచయిత చంద్రబోస్‌.. సగర్వంగా వేదికమీదకు వెళ్లి, అవార్డులు అందుకున్న దృశ్యం.. ‘పుట్‌ మి ఆన్‌ ద టాప్‌ ఆఫ్‌ ద వరల్డ్‌’ అంటూ కీరవాణి పాడిన పాట..

సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. నూట పది సంవత్సరాల భారతీయ సినిమా చరిత్ర కీర్తికిరీటంలో ఇప్పటికే నాలుగు ఆస్కార్‌ పురస్కారాలనే మణులు ఉన్నా.. అవి మన సినిమాలకు వచ్చినవి కావని, ఆంగ్లేయుల సినిమాలకు పనిచేసిన మనోళ్లకు వచ్చాయన్న బాధ కొద్దిగా ఉండేది! ఆ కించిత్తు కించనూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తొలగించినట్లయింది. ఎందుకంటే.. మనదేశానికి చెందిన భాను అథయ్యా, ఏఆర్‌ రెహమాన్‌, గుల్జార్‌, రెసూల్‌ పోకుట్టి ఈ పురస్కారాన్ని సాధించినప్పటికీ.. వారు పనిచేసింది భారతీయ చిత్రాలకు కాదు. ఉదాహరణకు.. బ్రిటన్‌కు చెందిన నటుడు, దర్శకనిర్మాత రిచర్డ్‌ అటెన్‌బరో తీసిన ‘గాంధీ’ చిత్రానికిగాను ఉత్తమ ‘కాస్ట్యూమ్‌ డిజైనర్‌’గా భాను అథయ్యా.. ‘జాన్‌ మొల్లో’తో కలిసి సంయుక్తంగా ఆస్కార్‌ను అందుకున్నారు. ఆ సినిమా నేపథ్యం మన గాంధీ మహాత్ముడిదే అయినా.. నిర్మాత, దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుణులు అత్యధికులు ఆంగ్లేయులే! మిగతా మూడు ‘ఆస్కార్‌’ అవార్డులూ ‘స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌’ చిత్రానికి పనిచేసిన ఏఆర్‌ రెహమాన్‌, గుల్జార్‌, రెసూల్‌ పోకుట్టికి వచ్చాయి. అయితే.. ఆ సినిమా కూడా పూర్తిగా బ్రిటిష్‌ సంస్థ తీసినదే! ఇక దర్శక దిగ్గజం ‘సత్యజిత్‌ రే’కు కూడా ఆస్కార్‌ వచ్చినప్పటికీ అది గౌరవ పురస్కారం మాత్రమే. ఆ లెక్కన చూసుకుంటే.. ఇప్పటిదాకా పూర్తిగా భారతీయ చిత్రానికి ఆస్కార్‌ రావడం ఇదే.

‘ఎవ్రీథింగ్‌’.. ఆ సినిమాకే!

ఈ ఏడాది మొత్తం 11 విభాగాల్లో నామినేషన్లు దక్కించుకున్న ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’ సినిమా.. ఏడు విభాగాల్లో పురస్కారాలు సాధించి సంచలనం సృష్టించింది. ఈ సినిమాలో నటించిన మిషెల్‌ యో (ఈవిడ మలేషియన్‌ నటి) ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఒక ఆసియన్‌ నటికి ఆస్కార్‌ ఉత్తమనటి పురస్కారం రావడం ఆ అవార్డుల చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం. అంతేకాదు.. గడిచిన 20 ఏళ్లలో ఒక శ్వేతజాతేతర మహిళకు ఈ అవార్డు రావడం కూడా ఇదే. ఉత్తమ సహాయనటుడు, సహాయ నటి అవార్డులు కూడా ఆ చిత్రంలో నటించినవారికే వచ్చాయి. ఇక.. ‘మమ్మీ’ సినిమాలో హీరోగా భారతీయులకు చిరపరిచితుడైన బ్రెండన్‌ ఫ్రేజర్‌ గుర్తున్నాడా? ‘ద వేల్‌’ సినిమాలో ఉత్తమ నటన కనబరిచినందుకుగాను ఈ ఏటి ఉత్తమ నటుడు విభాగంలో ఆయనకు ఆస్కార్‌ వచ్చింది. ఇక.. ‘ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ద వెస్ట్రన్‌ ఫ్రంట్‌’ చిత్రం నాలుగు విభాగాల్లో ఆస్కార్లు సాధించడం విశేషం.

rrr.jpg

పాట రూపంలో.. కీరవాణి సంతోషం

ఆస్కార్‌ పురస్కారాన్ని అందుకున్నాక కీరవాణి తన సంతోషాన్ని పాట రూపంలో వ్యక్తం చేయడం విశేషం. ‘‘థాంక్యూ అకాడమీ. నేను ‘కార్పెంటర్స్‌’ను (అమెరికాకు చెందిన మ్యూజిక్‌బ్యాండ్‌ పేరు ఇది) వింటూ పెరిగాను. ఇప్పుడు.. ఈ వేదిక మీద ఆస్కార్‌తో ఉన్నాను.’’ అని తొలుత చెప్పారాయన. ఆ మరుక్షణమే.. ‘కార్పెంటర్స్‌’ గ్రేటెస్ట్‌ హిట్‌ సాంగ్స్‌లో ఒకటైన ‘టాప్‌ ఆఫ్‌ ద వరల్డ్‌’ బాణీలో.. ‘దేర్‌ వజ్‌ ఓన్లీ వన్‌ విష్‌ ఆన్‌ మై మైండ్‌..’ అంటూ పాటందుకున్నారు. ‘‘ఒకప్పుడు నా మనసులో ఒకే ఒక కోరిక ఉండేది. రాజమౌళిది, మా కుటుంబసభ్యులందరిదీ అదే కోరిక. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అందరి అభిమానాన్ని అందుకోవాలని.. నన్ను ప్రపంచ శిఖరాగ్రాన నిలపాలని’’ ..అని ఆ పాట అర్థం. ఈ పాట పాడాక ఆయన రమారాజమౌళి కుమారుడు కార్తికేయకు కృతజ్ఞతలు చెప్పారు. కాగా.. కీరవాణి తన ప్రసంగంలో ‘కార్పెంటర్స్‌’ అని చెప్పగానే మనదేశంలోని చాలా మీడియా సంస్థలు.. ‘వడ్రంగి పని చేసేటప్పుడు వచ్చే శబ్దాలను వింటూ ఈ స్థాయికి ఎదిగాను’ అని కీరవాణి చెప్పినట్టు కథనాలు ప్రసారం చేశాయి! ఆ తర్వాత తప్పు తెలుసుకుని దిద్దుకున్నాయి.

ఆస్కార్‌ పురస్కారం దక్కడం చెప్పలేనంత ఆనందాన్ని కలిగించింది. అకాడమీకి నా కృతజ్ఞతలు

-చంద్రబోస్‌

ఇది నేను మర్చిపోలేని రోజు. దేశం గర్వించేలా చేసిన మా గురువు కీరవాణికి నా అభినందనలు

-రాహుల్‌ సిప్లిగంజ్‌

2ntr-raja-ram.jpg

56 అక్షరాల సంగీత భాష తెలుగు!

తెలుగు భాష శబ్ద సౌందర్యం గురించి అమెరికన్‌ మీడియాకు చెప్పిన చంద్రబోస్‌ ఆస్కార్‌ అవార్డు అందుకున్నాక.. కీరవాణి, చంద్రబోస్‌ కార్యక్రమ నిర్వాహకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ సమయంలో ఒక విలేకరి.. ‘56 అక్షరాలు ఉన్న తెలుగు భాషలో ఈ పాట ఎలా రాయగలిగారు? మీరెదుర్కొన్న సవాల్‌ ఏంటి?’ అని అడిగారు. దీనికి చంద్రబోస్‌.. ‘‘యాభై ఆరు అక్షరాలున్న తెలుగు భాషలో ఎన్నో గొప్ప పదాలు, భావాలు, అనుభూతులు ఉన్నాయి. తెలుగు భాష చాలా గొప్పది. సాహిత్య, సంగీత విలువలున్న భాష. తెలుగు భాషలో ప్రతి సాధారణ పదమూ సంగీతంలాగానే ధ్వనిస్తుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు రాసిన ఈ పాటలోని భావం తెలుగు ప్రజలందరికీ అర్థమైంది. నచ్చింది. కానీ.. తెలుగు భాష తెలియని మీలాంటివారికి కూడా నచ్చడానికి కారణం.. తెలుగుభాషకున్న ఆ సంగీత సౌందర్యమే. అదే ఈ అవార్డును సాధించిపెట్టింది’’ అని సమాధానమిచ్చారు.

‘ఆస్కార్‌’ గ్రహీతలు వీరే..

ఉత్తమ చిత్రం : ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌

ఉత్తమ దర్శకుడు, స్ర్కీన్‌ ప్లే : డేనియల్‌ క్వాన్‌, డేనియల్‌ షైనెర్ట్‌

ఉత్తమ నటుడు : బ్రెండన్‌ ఫ్రేజర్‌ (ద వేల్‌)

ఉత్తమ నటి : మిషెల్‌ యో (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)

ఉత్తమ సహాయనటుడు : కే హుయ్‌ క్వాన్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)

ఉత్తమ సహాయనటి : జేమీ లీ కర్టిస్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)

ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌ : జో లెట్టెరి, రిచర్డ్‌ బానెహామ్‌, ఎరిక్‌ సెయిన్‌డన్‌,

డేనియల్‌ బారెట్‌ (అవతార్‌: ద వే ఆఫ్‌ వాటర్‌)

ఉత్తమ సినిమాటోగ్రఫీ : జేమ్స్‌ ఫ్రెండ్‌ (ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ద వెస్ట్రన్‌ ఫ్రంట్‌)

ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ : నాటు నాటు (కీరవాణి, చంద్రబోస్‌-ఆర్‌ఆర్‌ఆర్‌)

ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిలిం : గిలెర్మో డెల్‌ టోరోస్‌ పినోచియో

ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిలిం : నవానీ

ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ ఫిలిం : ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ద వెస్ట్రన్‌ ఫ్రంట్‌

ఉత్తమ లైవ్‌ యాక్షన్‌ లఘు చిత్రం : యాన్‌ ఐరిష్‌ గుడ్‌ బై

ఉత్తమ డాక్యుమెంటరీ లఘు చిత్రం : ద ఎలిఫెంట్‌ విష్పరర్స్‌ (కార్తీకి, గునీత్‌ మోంగా)

ఉత్తమ యానిమేటెడ్‌ లఘు చిత్రం : ద బాయ్‌, ద మోల్‌, ద ఫాక్స్‌ అండ్‌ ద హార్స్‌

Updated Date - 2023-03-14T04:21:37+05:30 IST