Share News

One Nation One Election: 'ఒక దేశం ఒకే ఎన్నికల'పై ఈనెల 25న కమిటీ సమావేశం

ABN , First Publish Date - 2023-10-20T14:28:52+05:30 IST

'ఒక దేశం ఒకే ఎన్నికలు' నిర్వహణపై విధివిధానాలను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ తదుపరి సమావేశం ఈనెల 25న జరుగనుంది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన తొలి అధికారిక సమావేశం ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీలోని ఆయన నివాసంలో జరిగింది.

One Nation One Election: 'ఒక దేశం ఒకే ఎన్నికల'పై ఈనెల 25న కమిటీ సమావేశం

న్యూఢిల్లీ: 'ఒక దేశం ఒకే ఎన్నికలు' (One Nation One Election)పై విధివిధానాలను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ తదుపరి సమావేశం ఈనెల 25న జరుగనుంది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన తొలి అధికారిక సమావేశం ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీలోని ఆయన నివాసంలో జరిగింది. హోం మంత్రి అమిత్‌షా, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ పాల్ కూడా పాల్గొన్నారు.


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014 నుంచి ఏకకాలంలో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలను సమర్ధిస్తూ వస్తున్నారు. ఏకకాలంలో అటు పార్లమెంటు, ఇటు రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు జరగడం వల్ల ఆర్థిక భారం తగ్గుతుందని, పథకాల అమలు సమర్ధవంతంగా నిర్వహించేందుకు వీలవుతుందని చెబుతున్నారు. ఒకదేశం ఒకే ఎన్నికల విధానంపై అధ్యయనానికి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి గత సెప్టెంబర్ 1న ప్రకటించారు. కమిటీ అధ్యక్షుడిగా రామ్‌నాథ్ కోవింద్ నియమితులయ్యారు. హోం మంత్రి అమిత్‌షా, కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి రాజ్యసభ మాజీ ఎంపీ గులాం నబీ ఆడాద్, మాజీ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్‌కే సింగ్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ సి.కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషర్ సంజయ్ కొఠారీ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరవుతారు. గతంలో ఏకకాలంలో ఎన్నికలకు సాధ్యాసాధ్యాలను లా కమిషన్, నీతి ఆయోగ్, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చర్చించాయి. కాగా, కమిటీ నివేదిక వచ్చాక పబ్లిక్ డొమైన్‌లో ఉంచుతామని, చర్చ జరుగుతుందని, నివేదిక పార్లమెంటుకు రాగానే దానిపై చర్చిస్తామని, అందువల్ల భయపడాల్సిన పనిలేదని ప్లహ్లాద్ జోషి వివరణ ఇచ్చారు.

Updated Date - 2023-10-20T14:28:52+05:30 IST