NIA : ఖలిస్థానీ-గ్యాంగ్‌స్టర్ నెట్‌వర్క్‌పై.. ఎన్‌ఐఏ ఉక్కుపాదం
ABN , First Publish Date - 2023-09-28T03:12:10+05:30 IST
ఖలిస్థానీ ఉగ్రవాదులతో సంబంధాలున్న గ్యాంగ్‌స్టర్లు, ఉగ్రవాదులు, డ్రగ్స్ ముఠాల నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఉక్కుపాదం మోపింది. బుధవారం ఉదయం నుంచి ఆరు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 53 చోట్ల ఏకకాలంలో దాడులు జరిపింది. కడపటి వార్తలందేసరికి పలు చోట్ల దాడులు
6 రాష్ట్రాల్లో 53 చోట్ల ఏకకాలంలో దాడులు
పలువురు అనుమానితుల అరెస్టు
తుపాకులు, మందుగుండు సామగ్రి సీజ్
కెనడా, ఇతర దేశాల్లోని ఖలిస్థానీ
నెట్‌వర్క్‌తో సంబంధాలున్న వారిపై కొరడా!
వారిలో డ్రగ్స్ డీలర్లు, ఉగ్రవాదులు కూడా
ఐరాసలో కేంద్ర మంత్రి జైశంకర్ ఖలిస్థానీ
ఉగ్రవాదంపై మాట్లాడిన మర్నాడే దాడులు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 27: ఖలిస్థానీ ఉగ్రవాదులతో సంబంధాలున్న గ్యాంగ్‌స్టర్లు, ఉగ్రవాదులు, డ్రగ్స్ ముఠాల నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఉక్కుపాదం మోపింది. బుధవారం ఉదయం నుంచి ఆరు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 53 చోట్ల ఏకకాలంలో దాడులు జరిపింది. కడపటి వార్తలందేసరికి పలు చోట్ల దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో పలువురిని అరెస్టు చేసి.. పిస్టళ్లు, మందుగుండు సామగ్రి, ఇతర ఆయుధాలు, ఎలకా్ట్రనిక్ పరికరాలు, వేర్పాటువాద సాహిత్యాన్ని సీజ్ చేసినట్లు ఎన్‌ఐఏ తెలిపింది. విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఐరాసలో ఖలిస్థానీ ఉగ్రవాదంపై మాట్లాడిన మర్నాడే ఈ దాడులు జరగడం గమనార్హం..! పాకిస్థాన్, కెనడా, మలేసియా, పోర్చుగల్, ఆస్ట్రేలియా దేశాల్లో తలదాచుకుంటున్న ఖలిస్థానీ వేర్పాటువాదులకు సంబంధించిన ముఠాలు, గ్యాంగ్‌స్టర్లు, డ్రగ్స్ మూకలపై ఈ దాడులు జరిపినట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది. ‘‘విదేశాల్లో ఉన్న ఖలిస్థానీ వేర్పాటువాదులు భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో గ్యాంగ్‌స్టర్లు, ఉగ్రవాదులు, డ్రగ్స్ ముఠాల్లో తమ అనుచరులను నియమించుకున్నారు. వారి ప్రోద్బలంతో నేరాలకు పాల్పడుతున్నారు. సుపారీ/టార్గెట్ కిల్లింగ్ దందాలు చేస్తున్నారు. వీరికి ఆయుధాలు, ఆర్థిక సాయం అందజేయడానికి ఓ సిండికేట్ ఉన్నట్లు గుర్తించాం. ఈ నెట్‌వర్క్‌ను కూకటివేళ్లతో తీసివేసే క్రమంలో ఆరు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో-- రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, చండీగఢ్‌లోని 53 చోట్ల దాడులు చేశాం’’ అని వివరించింది. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసిన ఖలిస్థానీ ఉగ్రవాది అర్ష్‌దల్లాతో సంబంధాలున్న వారి ఇళ్లపై దాడులు చేసినట్లు.. వీరిలో గ్యాంగ్‌స్టర్లు లారెన్స్ బిష్ణోయ్ తదితరులు ఉన్నట్లు తెలిపింది. పంజాబ్‌లో మహారాష్ట్రకు చెందిన బిల్డర్ సంజయ్ బియానీ, మైనింగ్ ట్రేడర్ మెహల్ సింగ్, అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు సందీప్ నాగల్ అంబియా హత్యలకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరిపినట్లు వివరించింది.
పక్కా వ్యూహంతో.. కట్టడిముట్టడి..!
ఖలిస్థానీ ఉగ్రవాదుల నెట్‌వర్క్‌ను సమూలంగా అణచివేసే లక్ష్యంతో ఎన్‌ఐఏ పక్కా వ్యూహంతో బుధవారం దాడులకు దిగినట్లు తెలుస్తోంది. ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని స్థానిక పోలీసులను సమన్వయం చేసుకుంటూ కార్డాన్-అండ్-సెర్చ్(కట్టడిముట్టడి) మాదిరిగా 53 చోట్ల దాడులు నిర్వహించినట్లు సమాచారం. అంటే.. దాడుల నుంచి అనుమానితులు ఏమాత్రం తప్పించుకునే వీలు లేకుండా.. వారి ఇళ్లను, కాలనీలను చుట్టుముట్టి.. వారి ఇళ్లలో చోటుచేసుకుంది. ఉదాహరణకు.. ఉత్తరాఖండ్‌లోని ఉదమ్‌సింగ్‌నగర్‌లోని బాజ్‌పూర్ గ్రామాన్ని కంటైన్‌మెంట్ జోన్ మాదిరిగా మార్చిన తర్వాతే.. ఎన్‌ఐఏ బలగాలు అక్కడి గన్‌హౌ్‌స నిర్వాహకుడు షకీల్ ఇంటిపై దాడులు జరిపింది. షకీల్‌తోపాటు.. అతని కుమారుడు ఆసిమ్ ఖలిస్థానీ ఉగ్రవాదులకు ఆయుధాలను అందజేయడంలో సహకరించినట్లు సమాచారం.