OPS movement : ఓపీఎస్‌ ఉద్యమంపై కేంద్రం కొరడా

ABN , First Publish Date - 2023-03-22T02:20:52+05:30 IST

పాత పింఛను పథకాన్ని(ఓపీఎస్‌) పునరుద్ధరించాలని ఉద్యోగులు ఆందోళన బాట పడుతున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం అప్రమత్తమైంది.

OPS movement : ఓపీఎస్‌ ఉద్యమంపై   కేంద్రం కొరడా

బైఠాయింపు, సామూహిక సెలవు

నిరసనలు, ర్యాలీలపై నిషేధం

సమ్మెకు దిగితే జీతంలో కోత

తీవ్ర పరిణామాలూ ఉంటాయ్‌

వేతన జీవులకు హెచ్చరికలు

దేశవ్యాప్తంగా ర్యాలీలకు ఓపీఎస్‌

పునరుద్ధరణ ఫోరం పిలుపు

న్యూఢిల్లీ, మార్చి 21: పాత పింఛను పథకాన్ని(ఓపీఎస్‌) పునరుద్ధరించాలని ఉద్యోగులు ఆందోళన బాట పడుతున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం అప్రమత్తమైంది. సమ్మె, నిరసన, ర్యాలీల్లో ఎట్టిపరిస్థితిలోనూ పాల్గొనడానికి వీల్లేదని ఉద్యోగులకు తేల్చి చెప్పింది. ఎవరైనా తమ ఆదేశాలను ధిక్కరించి ఉద్యమాల్లో పాల్గొంటే వేతనంలో కోత పెట్టడంతోపాటు క్రమ శిక్షణచర్యలూ తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు ఉద్యోగుల శిక్షణ, వ్యక్తిగత వ్యవహారాల విభాగం అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యదర్శకులకు సూచనలు జారీ చేసింది. ‘‘నిరసనల్లో పాల్గొన్నవారెందరు? వారి హోదా, సంబంధిత విభాగంలో నేతృత్వం వహించిన వారు ఎవరు? వంటి వివరాలు సేకరించి అదే రోజు సాయంత్రానికి పంపాలి’’ అని ఆదేశించింది. జాతీయ సంయుక్త కార్యాచరణ మండలి(ఎన్‌జేఏసీ) నేతృత్వంలో ఓపీఎస్‌ పునరుద్ధరణ జాయింట్‌ ఫోరం ఏర్పడింది. ఈ ఫోరం మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా జిల్లాల స్థాయిలో ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించింది. కాగా, ఉద్యోగుల ఉద్యమాలకు సంబంధించి గతంలో అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు పలు కీలక ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వం గుర్తు చేసింది. ఉద్యోగులు సమ్మె చేసేందుకు అధికారం కల్పించే చట్టబద్ధమైన నిబంధన ఏదీ లేదని, ఉద్యోగుల ప్రవర్తనా నిబంధనల మేరకు సమ్మె తీవ్రమైన దుష్ప్రవర్తనగా గతంలో స్పష్టం చేసింది.

Updated Date - 2023-03-22T02:20:52+05:30 IST