నే(మే)టి భారతం!

ABN , First Publish Date - 2023-06-01T01:09:08+05:30 IST

ప్రధాని మోదీ సారథ్యంలో భారత్‌ అద్భుతంగా రూపాంతరం చెంది, ప్రపంచ వరుసలో నిలిచింది. ప్రపంచ వృద్ధిలో ఆసియా నుంచి కీలక దేశంగా కొనసాగుతోంది! కేవలం గత పదేళ్లలోనే....

నే(మే)టి భారతం!

2013తో పోల్చితే విభిన్న దేశం.. మోదీ వచ్చాక 10 భారీ మార్పులు

జీఎస్టీతో ఒకేపన్ను విధానం.. పంపిణీ రంగంలో సంస్కరణలు

మౌలికరంగ పెట్టుబడుల్లో ఊపు.. కార్పొరేట్‌ కంపెనీలకు ప్రోత్సాహం

డిజిటల్‌ లావాదేవీల్లో ‘గ్లోబల్‌ లీడర్‌’గా.. మోర్గాన్‌ స్టాన్లీ నివేదిక

న్యూఢిల్లీ, మే 31: ప్రధాని మోదీ సారథ్యంలో భారత్‌ అద్భుతంగా రూపాంతరం చెంది, ప్రపంచ వరుసలో నిలిచింది. ప్రపంచ వృద్ధిలో ఆసియా నుంచి కీలక దేశంగా కొనసాగుతోంది! కేవలం గత పదేళ్లలోనే.. అంటే 2013 నుంచి భారత్‌లో స్థూల, మార్కెట్‌ అంచనాల పరంగా చెప్పుకోదగ్గ సానుకూల పరిణామాలు సంభవించాయి. ఇవన్నీ కూడా మన దేశం గురించి మోర్గాన్‌ స్టాన్లీ సంస్థ తమ ‘ట్రాన్స్‌ఫార్మారేషన్‌’ నివేదికలో పేర్కొన్న అంశాలు! 2013లో ఇచ్చిన నివేదికతో పోల్చితే ఇవాళ దేశం పూర్తి భిన్నంగా ఉందని నివేదిక స్పష్టం చేసింది. గతంలో భారత్‌లో పెట్టుబడుల గురించి విదేశీ కంపెనీలకు అనుమానాలు ఉండేవని, ఇవన్నీ పదేళ్ల క్రితమే పటాపంచలయ్యాయని నివేదికలో రాసింది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, స్టాక్‌ మార్కెట్‌లో అద్భుతాలు సృష్టిస్తున్న దేశాల్లో ఒకటిగా వెలుగొందుతున్న భారత్‌.. తన స్థాయికి తగ్గరీతిలో అభివృద్ధి పథంలో దూసుకెళ్లడం లేదని ఎవరు అనగలరు? అని నివేదికలో ప్రశ్నించింది. 2014లో ప్రధానిగా మోదీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఇప్పటిదాకా భారత్‌లో పది భారీ మార్పులు సంభవించాయని నివేదికలో పేర్కొంది.

ఇందులో కార్పొరేట్‌ ట్యాక్స్‌, మౌలిక రంగ పెట్టుబడుల్లో ఊపు రావడం, పంపిణీ రంగంలో సంస్కరణలు కీలకం అని పేర్కొంది. గతంలో పన్నెండు రకాలకు పైగా ఉన్న వివిధ పన్నులను తొలగించి ఆ స్థానంలో జీఎస్టీ రూపంలో ఒకే పన్ను విఽధానాన్ని తెచ్చారని, డిజిటల్‌ లావాదేవీలు పెరిగాయాని, దేశ ఆర్థిక స్థిరీకరణకు జీడీపీనే సింబల్‌ అని నివేదికలో వివరించింది. తయారీ రంగంలో వృద్ధి, పెట్టుబడుల కారణంగా జీడీపీ శాతం నిరంతరాయంగా పెరుగుతోందని విశ్లేషించింది. 4.5 శాతంగా ఉన్న ఎగుమతుల మార్కెట్‌ 2031 నాటికి రెండింతలకు పైగా పెరుగుతుందని పేర్కొంది. ప్రస్తుతం దేశ తలసరి ఆదాయం రూ.1.82 లక్షలుగా ఉందని, ఇది 2032 నాటికి రూ.4.30 లక్షలకు చేరుతుందని అంచనా వేసింది. కొన్నేళ్లలోనే భారత్‌ డిజిటల్‌ లావాదేవీలు, తక్షణ చెల్లింపుల్లో ‘గ్లోబల్‌ లీడర్‌’ అవుతుందని స్పష్టం చేసింది.

Updated Date - 2023-06-01T01:09:08+05:30 IST