Nagaland: నాగాలాండ్ సీఎంగా నెఫియూ రియో ప్రమాణస్వీకారం

ABN , First Publish Date - 2023-03-07T15:03:19+05:30 IST

నాగాలాండ్ ముఖ్యమంత్రిగా ఎన్‌డీపీపీ నేత నెఫియు రియా మంగళవారంనాడు ప్రమాణస్వీకారం..

Nagaland: నాగాలాండ్ సీఎంగా నెఫియూ రియో ప్రమాణస్వీకారం

కోహిమా: నాగాలాండ్ (Nagaland) ముఖ్యమంత్రిగా ఎన్‌డీపీపీ (NDPP) నేత నెఫియు రియా (Neiphiu Rio) మంగళవారంనాడు ప్రమాణస్వీకారం చేశారు. సీఎంగా ఆయన ప్రమాణస్వీకారం చేయడం ఇది ఐదోసారి. ముఖ్యమంత్రి నెఫియు రియాతో పాటు ఉప ముఖ్యమంత్రులుగా టి.ఆర్.జెలియాంగ్, యాన్‌యుంగో పైటన్ ప్రమాణస్వీకారం చేశారు. కోహిమాలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, నాగాలాండ్ గవర్నర్ ల గణేషన్ (La Ganesan), బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తదితరులు పాల్గొన్నారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్‌డీపీపీ-బీజేపీ కూటమి తిరిగి అధికారం నిలుపుకొంది. 60 మంది సభ్యుల అసెంబ్లీలో ఎన్డీపీపీ-బీజేపీ కూటమి 37 స్థానాలు గెలుచుకుంది. రియో సారథ్యంలోని ప్రభుత్వానికి అన్ని ఇతర పార్టీలు మద్దతు ప్రకటించడం విశేషం.

మేఘాలయలోనూ...

కాగా, మేఘాలయలోనూ కొత్త క్యాబినెట్ మంగళవారంనాడు ప్రమాణస్వీకార చేసింది. ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఎన్‌పీపీ చీఫ్ కాన్రాడ్ సంగ్మా ప్రమాణస్వీకారం చేశారు. షిల్లాంగ్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి జేపీ నడ్డా తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఎన్‌సీపీ చీఫ్ కాన్రాడ్ సంగ్మా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం వరుసగా ఇది రెండోసారి. సంగ్మా మంత్రివర్గంలో ప్రెస్టోన్ త్సాంసాంగ్, ఎస్.ధర్‌లు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల జరిగిన మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌పీపీ కూటమి 45 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుకు ముందుగు వచ్చింది. కాన్రాడ్ కె సంగ్మా సారథ్యంలోని ఎన్‌పీపీ 26 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 2 సీట్లు గెలుచుకుంది.

Updated Date - 2023-03-07T15:09:05+05:30 IST