పార్లమెంటు ప్రారంభోత్సవంపై సుప్రీంలో పిల్‌

ABN , First Publish Date - 2023-05-26T04:19:21+05:30 IST

పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవంపై రాజకీయ రగడ కొనసాగుతుండగానే..

పార్లమెంటు ప్రారంభోత్సవంపై సుప్రీంలో పిల్‌

రాష్ట్రపతితో ప్రారంభింపజేసేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి

ప్రారంభోత్సవానికి వచ్చి మీ విశాల హృదయాన్ని చాటుకోండి

ప్రతిపక్ష నేతలకు కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అభ్యర్థన

న్యూఢిల్లీ, మే 25: పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవంపై రాజకీయ రగడ కొనసాగుతుండగానే.. దానిపై సుప్రీంకోర్టులో ఒక ప్రజ్చాహిత వ్యాజ్యం దాఖలైంది. ఆ భవనాన్ని ప్రధానికి బదులుగా రాష్ట్రపతి ప్రారంభించేలా లోక్‌సభ సచివాలయానికి ఆదేశాలివ్వాలని కోరుతూ సుప్రీం కోర్టు న్యాయవాది జయా సుకిన్‌ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిల్‌ వేశారు. రాష్ట్రపతిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించకపోవడం ద్వారా.. లోక్‌సభ సెక్రటేరియట్‌ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని పిటిషనర్‌ తన పిల్‌లో పేర్కొన్నారు. ప్రధానిని, ఇతర మంత్రులను నియమించేది రాష్ట్రపతేనని.. కార్యనిర్వహణకు సంబంధించి వారు తీసుకునే నిర్ణయాలన్నీ రాష్ట్రపతి పేరు మీదే తీసుకుంటారని గుర్తుచేశారు. అలాంటి రాష్ట్రపతిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించకపోవడమంటే అత్యున్నత రాజ్యాంగ పదవిని అవమానించడమేనని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాజ్యాన్ని శుక్రవారం విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. కాగా.. నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి వచ్చేదే లేదంటూ సంయుక్త ప్రకటన విడుదల చేసిన విపక్ష నేతలు తమ వాగ్దాడిని కొనసాగించారు. ప్రభుత్వం అహంకార ధోరణితో వ్యవహరిస్తోందంటూ ధ్వజమెత్తారు. ‘‘మిస్టర్‌ మోదీ.. పార్లమెంటు ప్రజలు నిర్మించిన ప్రజాస్వామ్య దేవాలయం. మీ ప్రభుత్వ అహంకారపూరిత ధోరణి పార్లమెంటరీ వ్యవస్థనే నాశనం చేసింది. పార్లమెంటు భవనాన్ని ప్రారంభించే హక్కును రాష్ట్రపతి నుంచి లాక్కోవడం ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో తెలుసుకోవాలని 140 కోట్ల మంది భారతీయులు కోరుకుంటున్నారు’’ అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే ట్వీట్‌ చేశారు. ఇక.. పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలన్న విపక్షాల నిర్ణయం మన దేశ బహుళత్వానికి, భిన్నత్వానికి నిదర్శనమని.. పార్లమెంటరీ సాంప్రదాయాలకు తిలోదకాలిస్తున్న ఒక నియంతృత్వ ప్రభుత్వ వైఖరికి ప్రతిస్పందన అని టీఎంసీ ఎంపీ డెరెక్‌ ఒబ్రెయిన్‌ వ్యాఖ్యానించారు. ‘‘వందేభారత్‌ రైళ్ల నుంచి పార్లమెంటు భవనం దాకా.. అన్నింటినీ ప్రధానే ప్రారంభించాలి. కొవిడ్‌ టీకాల సర్టిఫికెట్ల మీద కూడా ఆయన ఫొటోనే వేయాలి. ఏ శాఖ నిర్వహించిన పనికైనా క్రెడిట్‌ ఆయనకే ఇవ్వాలి. ఈ తరహా మెగెలోమేనియా (తనను తాను అందరికన్నా అధికుడుగా భావించుకునే తత్వం).. అభద్రతాభావంతో కొట్టుమిట్టాడే నియంతల తీరుకు బండగుర్తు’’ అని టీఎంసీ అధికార ప్రతినిధి సాకేత్‌ గోఖలే నిప్పులు చెరిగారు. వారి వ్యాఖ్యలకు బీజేపీ సీనియర్‌ నేత, కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ స్పందించారు. మే 28న పార్లమెంటు ప్రారంభోత్సవానికి విచ్చేసి విపక్షాలు తమ విశాల హృదయాన్ని చాటుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రపతి ముర్ము అంటే తమకు గౌరవం ఉందని.. రాష్ట్రపతి పదవిని తాము రాజకీయాల్లోకి లాగదల్చుకోలేదని స్పష్టం చేశారు.

ప్రారంభోత్సవానికి వెళ్తా: దేవెగౌడ

పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంలో పాల్గొంటానని మాజీ ప్రధాని దేవెగౌడ స్పష్టం చేశారు. పార్లమెంటు భవనం ఎవరి వ్యక్తిగతం కాదని, దాన్ని ప్రజల పన్నులతోనే నిర్మించారని అన్నారు. ‘‘అదేమీ బీజేపీ లేదా ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయం కాదు కదా’’ అని ప్రశ్నించారు. బీజేపీని రాజకీయంగా విమర్శించేందుకు తన వద్ద అనేక అంశాలున్నాయని, కానీ పార్లమెంటు విషయంలో రాజకీయం చేయడం ఇష్టం లేదని అన్నారు. రాజ్యాంగ విలువల్లోకి రాజకీయాలు తీసుకురానని వ్యాఖ్యానించారు.

ఆస్ట్రేలియాలో అందరూ వచ్చారు: మోదీ

నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి వచ్చేదే లేదంటూ సంయుక్త ప్రకటన చేసిన ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. జపాన్‌, పపువాన్యూగినియా, ఆస్ట్రేలియా దేశాల పర్యటన ముగించుకుని వచ్చిన ప్రధాని.. సిడ్నీలో తాను పాల్గొన్న సభ గురించి ప్రస్తావించారు. ‘‘ఆ సభకు ఆస్ట్రేలియా ప్రధానితోపాటు మాజీ ప్రధాని, అధికార పక్ష ఎంపీలతో పాటు ప్రతిపక్షాల ఎంపీలు కూడా హాజరయ్యారు’’ అంటూ మనదేశంలోని ప్రతిపక్షాల తీరును నర్మగర్భంగా విమర్శించారు. గతంలో కరోనా మహమ్మారి దేశంలో పతాకస్థాయిలో ఉన్నప్పుడు కొవిడ్‌ వ్యాక్సిన్‌ను విదేశాలకు సరఫరా చేయడాన్ని కూడా విపక్షాలు ప్రశ్నించాయంటూ ఆయన గుర్తుచేశారు. ‘‘సంక్షోభ సమయంలో మోదీ ప్రపంచానికి వ్యాక్సిన్లు ఎందుకు ఇస్తున్నారని వారంతా అడిగారు. కానీ, ఇది బుద్ధుడు, గాంధీ నడయాడిన నేల. మనం కరుణతో ప్రేరేపితమైన వ్యక్తులం. శత్రువుల గురించి కూడా ఆలోచిస్తాం.’’ అని మోదీ వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-05-26T04:19:21+05:30 IST