రాజదండం.. నెహ్రూ చేతికర్ర!

ABN , First Publish Date - 2023-05-26T04:21:44+05:30 IST

దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు అధికారమార్పిడికి గుర్తుగా ఒక రాజదండాన్ని బ్రిటిషర్ల నుంచి నెహ్రూ స్వీకరించారని..

రాజదండం.. నెహ్రూ చేతికర్ర!

75 ఏళ్లుగా అలహాబాద్‌ మ్యూజియంలో ఆ పేరుతోనే

న్యూఢిల్లీ, మే 25: దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు అధికారమార్పిడికి గుర్తుగా ఒక రాజదండాన్ని బ్రిటిషర్ల నుంచి నెహ్రూ స్వీకరించారని.. ఆ దండం పేరు సెంగోల్‌ అని.. దాన్ని 28న ప్రధాని మోదీ పార్లమెంటులో స్పీకర్‌ పోడియం వద్ద ప్రతిష్ఠిస్తారని విస్తృతంగా కథనాలు వెలువడుతున్నాయి. ఇన్నాళ్లుగా ఆ సెంగోల్‌ అలహాబాద్‌ మ్యూజియంలో ఉందని కూడా ఆ కథనాల్లో వస్తోందిగానీ.. అసలు ఆ దండం ప్రభుత్వం దృష్టికి ఎలా వచ్చింది? అంటే.. ప్రఖ్యాత నర్తకి డాక్టర్‌ పద్మాసుబ్రమణ్యం ద్వారా ప్రభుత్వానికి తెలిసింది. తమిళనాడుకు చెందిన తుగ్లక్‌ మ్యాగజైన్‌ 2021లో ఈ సెంగోల్‌ గురించి ఒక కథనాన్ని ప్రచురించింది. 1978లో.. కంచి పరమాచార్యులవారైన చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి తన శిష్యుడైన డాక్టర్‌ సుబ్రమణియానికి సెంగోల్‌ గురించి చెప్పగా, ఆయన దాని గురించి తన పుస్తకాల్లో ప్రస్తావించారు. ఆ విషయాలను తుగ్లక్‌ మ్యాగజైన్‌ తన కథనంలో పేర్కొంది. ఆ కథనాన్ని చదివిన డాక్టర్‌ పద్మా సుబ్రమణ్యం.. ఇంగ్లి్‌షలోకి అనువదించి ప్రధాని మోదీకి పంపారు. ప్రభుత్వం ఆ దండం ఎక్కడ ఉందా అని ఆరాతీయగా.. అది అలహాబాద్‌లోని నెహ్రూ మ్యూజియంలో ఉన్నట్టు తేలింది. అక్కడ దీన్ని.. నెహ్రూ తన నడకకు ఊతంగా ఉపయోగించే బంగారు చేతికర్రగా పేర్కొనడం గమనార్హం. ఈ విషయాన్ని గుర్తించిన మోదీ సర్కారు.. వెంటనే దాన్ని అక్కడనుంచి తెప్పించి నూతన పార్లమెంటు భవనంలో ప్రతిష్ఠించాలని నిర్ణయించింది.

Updated Date - 2023-05-26T04:21:44+05:30 IST