3రకాల వందేభారత్ రైళ్లు
ABN , First Publish Date - 2023-05-26T04:32:52+05:30 IST
వచ్చే ఏడాది మార్చిలోగా మూడు రకాల(వందే చైర్ కార్, వందే మెట్రో, వందే స్లీపర్) వందేభారత్ రైళ్లను నడుపుతామని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.

వచ్చే మార్చిలోగా నడుపుతామన్న కేంద్ర రైల్వే మంత్రి
న్యూఢిల్లీ-డెహ్రాడూన్ మధ్య వందేభారత్ రైలు ప్రారంభం
దెహ్రాదూన్, మే 25: వచ్చే ఏడాది మార్చిలోగా మూడు రకాల(వందే చైర్ కార్, వందే మెట్రో, వందే స్లీపర్) వందేభారత్ రైళ్లను నడుపుతామని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న శతాబ్ది, రాజధాని, లోకల్ రైళ్ల స్థానంలో వీటిని తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ సెమీ హైస్పీడ్ రైళ్లు చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో తయారవుతున్నాయని చెప్పారు. గురువారం దెహ్రాదూన్‌లో ఢిల్లీ-దెహ్రాదూన్ వందేభారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం ఓ ఇంటర్వ్యూలో మంత్రి మాట్లాడారు. వంద కిలోమీటర్లలోపు వందే మెట్రో, 100-550 కిలోమీటర్ల మధ్య వందే చైర్ కార్, 550 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణానికి వందే స్లీపర్ రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. జూన్ మధ్యకల్లా ప్రతి రాష్ట్రానికి ఓ వందేభారత్ రైలును అందిస్తామని చెప్పారు. ఫ్యాక్టరీలో ప్రతి ఎనిమిది, తొమ్మిది రోజుల్లోగా ఓ కొత్త ట్రైన్ తయారవుతోందని, మరో రెండు ఫ్యాక్టరీల్లోనూ ఉత్పత్తి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిచేలా ఈ వందేభారత్ రైళ్లను తయారు చేస్తున్నామని, కానీ ట్రాక్ సామర్థ్యం మేరకు వాటిని 130 కిలోమీటర్ల వేగంతోనే నడుపుతున్నామని చెప్పారు. 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో మాత్రవే రైళ్లను నడిపేలా పాత ట్రాక్‌లను తయారు చేశారని, గంటకు 110 కిలోమీటర్లు, 130 కిలోమీటర్లు, 160 కిలోమీటర్ల వేగంతో రైళ్లను నడిపేలా దాదాపు 35 వేల కిలోమీటర్ల ట్రాక్‌ను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. వచ్చే మూడు, నాలుగేళ్లలో ఈ పనులు పూర్తవుతాయన్నారు.
వంశ రాజకీయాల నుంచి వారు ఇంకా బయటపడలేదు
ఎన్నో ఏళ్లు దేశాన్ని పాలించిన పార్టీలు వంశపారంపర్య రాజకీయ అవరోధాల నుంచి బయటపడలేకపోయాయని ప్రధాని మోదీ అన్నారు. గురువారం ఢిల్లీ-డెహ్రాడూన్ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రె్‌సను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మాట్లాడారు. ‘‘21వ శతాబ్దపు భారత దేశం మౌలిక సదుపాయాలను ఆధునికీకరించుకోవడం ద్వారా మరింత వేగంగా అభివృద్ధి చెందగలదు. ఇంతకు ముందు చాలాకాలం అధికారంలో ఉన్న పార్టీలు దీన్ని గుర్తించలేదు. వారి దృష్టంతా స్కామ్‌లు, అవినీతిలో మునిగిపోవడంపై ఉంది’’ అని మోదీ అన్నారు. ప్రధాని మూడు దేశాల పర్యటన గురించి ప్రస్తావిస్తూ.. ప్రపంచం భారత్ వైపు గొప్ప ఆశతో చూస్తోందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన తీరు, కొవిడ్ విసిరిన సవాళ్లను ఎదుర్కొన్న విధానం భారత్‌పై ప్రపంచ విశ్వాసాన్ని పెంచిందన్నారు.