బ్రిటన్ విద్యార్థి వీసా ఇక కఠినం
ABN , First Publish Date - 2023-05-26T04:29:25+05:30 IST
విదేశీ విద్యార్థులతోపాటు వారి కుటుంబ సభ్యులనూ దేశంలోకి అనుమతిస్తున్న స్టూడెంట్ వీసా విధానానికి బ్రిటన్ ప్రభుత్వం ముగింపు పలికింది.

లండన్, మే 25: విదేశీ విద్యార్థులతోపాటు వారి కుటుంబ సభ్యులనూ దేశంలోకి అనుమతిస్తున్న స్టూడెంట్ వీసా విధానానికి బ్రిటన్ ప్రభుత్వం ముగింపు పలికింది. పరిశోధనేతర పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఇకపై తమ కుటుంబ సభ్యుల (డిపెండెంట్ల)ను బ్రిటన్‌కు తీసుకొచ్చే వీలు లేకుండా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. అలాగే బ్రిటన్‌లో చదువుతున్న విదేశీ విద్యార్థులు ఇకపై తన చదువు పూర్తయ్యేవరకు ఉద్యోగం చేయడానికి వీలులేకుండా నిబంధనల్లో మార్పు చేసింది. వచ్చే ఏడాది జనవరి నుంచి అమలయ్యే ఈ కొత్త నిబంధనలు భారతీయులపై ఎక్కువ ప్రభావం చూపనున్నాయి. ‘కుటుంబ సభ్యులను తీసుకొచ్చే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడంతో ప్రభుత్వ సేవలపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతోంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయం వల్ల వలసలు తగ్గుతాయి’ అని బ్రిటన్ విద్యాశాఖ మంత్రి సుయెల్లా బ్రేవర్మన్ తెలిపారు. పరిశోధనలు చేసే విదేశీ విద్యార్థులకు మాత్రమే తమ కుటుంబ సభ్యులను తీసుకొచ్చుకునే వెసులుబాటు ఉందని ఆమె పేర్కొన్నారు.