Narendra Modi : ప్రధాని మోదీపై అనర్హత తథ్యం

ABN , First Publish Date - 2023-04-03T01:55:11+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీపై అనర్హత వేటు తథ్యమని ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ఉద్ఘాటించింది. అంతేకాదు.. ఆయన భవిష్యత్తు

 Narendra Modi : ప్రధాని మోదీపై అనర్హత తథ్యం

ఆయనది ముమ్మాటికీ ఫేక్‌ డిగ్రీయే..

అందులో విశ్వవిద్యాలయాన్ని

‘యూనిబర్సిటీ’ అని పేర్కొన్నారు

గుజరాత్‌ ఎన్నికల టైంలో తాను

స్కూల్‌ తర్వాత చదువుకోలేదన్నారు

డిగ్రీ ఫేక్‌ అని తేలితే అనర్హతే

ఆప్‌ నేతలు సంజయ్‌, సౌరభ్‌

‘విద్యావంతుడై’న ప్రధాని కావాలి: కేజ్రీ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 2: ప్రధాని నరేంద్ర మోదీపై అనర్హత వేటు తథ్యమని ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ఉద్ఘాటించింది. అంతేకాదు.. ఆయన భవిష్యత్తు ఎన్నికల్లో పోటీకి కూడా అనర్హుడవుతారని స్పష్టం చేసింది. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆప్‌ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌సింగ్‌, ప్రధాన అధికార ప్రతినిధి సౌరభ్‌ భరద్వాజ్‌ ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ సర్టిఫికెట్‌ ఫేక్‌ అని పలు ఘటనలు చెబుతున్నాయి. అదే నిజమని తేలితే.. కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) నిబంధనల ప్రకారం ఆయన తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోతారు. అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు.. భవిష్యత్‌ ఎన్నికల్లో కూడా పోటీకి అనర్హుడవుతారు’’ అని సంజయ్‌ సింగ్‌ అన్నారు. సౌరభ్‌ భరద్వాజ్‌ మాట్లాడుతూ.. ఫేక్‌ డిగ్రీతో ప్రధాని నరేంద్ర మోదీ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం, సీఎం, ఎంపీ, ప్రధానమంత్రి పదవులను చేపట్టారని ఆరోపించారు.

‘‘2016లో నరేంద్ర మోదీ డిగ్రీపై ఆరోపణలు రాగా.. అప్పటి బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా, అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీలు గుజరాత్‌ విశ్వవిద్యాలయం నుంచి ‘ఎంటైర్‌ పొలిటికల్‌ సైన్స్‌’ సబ్జెక్టులో ఎంఏ పూర్తిచేసినట్లు సర్టిఫికెట్‌ను చూపించారు. ఇప్పుడు ఈ సర్టిఫికెట్‌(విలేకరులకు చూపుతూ) అప్పటి కాపీ నకలే. ఇందులో యూనివర్సిటీ స్పెల్లింగ్‌ తప్పుగా ఉంది. గుజరాత్‌ యూనిబర్సిటీ అని పేర్కొన్నారు. ఈ సర్టిఫికెట్‌లో ‘మాస్టర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌’ అని పేర్కొన్న ఫాంట్‌ 1992లో ఉనికిలోకి వచ్చింది. 1983 నాటి సర్టిఫికెట్‌లో ఆ ఫాంట్‌ ఎలా వచ్చింది? దీన్ని బట్టి ఇది ఫేక్‌ డాక్యుమెంట్‌ అని స్పష్టమవుతోంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ ప్రధాని కాకమునుపు.. గుజరాత్‌లో జరిగిన ఎన్నికల సమయంలో ఆయన తాను పాఠశాల తర్వాత విద్యను కొనసాగించలేదని చెప్పినట్లు గుర్తుచేశారు. ‘‘2005లో ఆ వ్యాఖ్యతో సెంటిమెంట్‌గా సీఎం అయ్యారు. అలాంటిది ఆయన 1979లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి బీఏ, 1983లో గుజరాత్‌ వర్సిటీ నుంచి ఎంఏ ఎలా పూర్తిచేయగలిగారు?’’ అని సౌరభ్‌ నిలదీశారు. ఈ ఆధారాలన్నీ ప్రధాని నరేంద్ర మోదీది ఫేక్‌ డిగ్రీ సర్టిఫికెట్‌ అని నిరూపిస్తున్నాయని, ఆయనపై అనర్హత వేటు తథ్యమని వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-04-03T01:55:18+05:30 IST