బీజేపీ పాత్ర లేకపోవచ్చు
ABN , First Publish Date - 2023-09-18T01:59:28+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ లేకపోవచ్చునని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లొకేశ్ అభిప్రాయపడ్డారు. ..

చంద్రబాబు అరెస్టుపై ఢిల్లీలో మీడియాతో లోకేశ్
పోరాటాన్ని ఉధృతం చేస్తామని స్పష్టీకరణ
న్యూఢిల్లీ, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ లేకపోవచ్చునని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లొకేశ్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు అరెస్టు తర్వాత బీజేపీ లేదా కేంద్ర ప్రభుత్వ పెద్దలు తమను సంప్రదించలేదని, వారితో చర్చలు జరపడానికి తాను ఢిల్లీ రాలేదని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. జాతీయ స్థాయిలో పొత్తులపై చంద్రబాబు నిర్ణయిస్తారని చెప్పారు. ‘ఇండియా’ కూటమిలోని పార్టీల నాయకులు చంద్రబాబుతో ఉన్న వ్యక్తిగత సంబంధాల వల్ల సంఘీభావం ప్రకటించారని చెప్పారు. చంద్రబాబు అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. స్కిల్ డెవల్‌పమెంట్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన అజేయ కల్లం రెడ్డి, ప్రేమచంద్రా రెడ్డి ఇవాళ బయట ఉన్నారని, వారిని సీఐడీ ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 150 మంది వైసీపీ నేతలకు చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు. రోజురోజుకూ తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. జైలులో చంద్రబాబు ధైర్యంగా ఉన్నారన్నారు. న్యాయస్థానాలపై తమకు పూర్తి నమ్మకముందన్నారు. సీఐడీ చీఫ్ విలేకరుల సమావేశాలు నిర్వహించడం సర్వీసు నిబంధనలకు వ్యతిరేకమని లోకేశ్ అన్నారు.