మహువాపై అనర్హత వేటు వద్దు
ABN , First Publish Date - 2023-12-03T03:06:30+05:30 IST
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై అనర్హత వేటు వేయొద్దని స్పీకర్ ఓంబిర్లాను కాంగ్రెస్ లోక్‌సభ పక్ష నేత అధీర్
స్పీకర్‌కు ఎంపీ అధీర్ లేఖ
న్యూఢిల్లీ, డిసెంబరు 2: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై అనర్హత వేటు వేయొద్దని స్పీకర్ ఓంబిర్లాను కాంగ్రెస్ లోక్‌సభ పక్ష నేత అధీర్ రంజన్ చౌధురీ కోరారు. ఒక ఎంపీని సస్పెండ్ చేయడం అతి తీవ్రమైన దండన అవుతుందన్నారు. అలాంటి నిర్ణయం ఎన్నో పరిణామాలకు దారితీసే అవకాశం ఉం టుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్‌కు అధీర్ లేఖ రాశారు. లేఖలోని అంశాలు తన వ్యక్తిగత అభిప్రాయాలని, తమ పార్టీకి వీటితో సంబంధంలేదని స్పష్టం చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. లోక్‌సభలో ప్రశ్నలు వేసేందుకు తన లాగిన్‌ను వేరేవారితో పంచుకున్న వ్యవహారంలో మహువాపై ఈ సమావేశాల్లోనే క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆమెను అనర్హురాలిగా ప్రకటించాలని ఎథిక్స్ కమిటీ సభాపతికి సిఫారసు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పీకర్‌కు అధీర్ లేఖ రాశారు. సభాసంఘాల నిబంధనలు, విధివిధానాలపై పునరాలోచన అవసరమని లేఖలో పేర్కొన్నారు.