మోదీ పాలన అద్భుతం
ABN , First Publish Date - 2023-06-26T01:28:52+05:30 IST
ఈజిప్ట్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఆ దేశ గ్రాండ్ ముఫ్తీ డాక్టర్ షాకీ ఇబ్రహిం అబ్దుల్ కరీం అల్లామ్‌తో భేటీ అయ్యారు. ఉగ్రవాద నిరోధక చర్యలతోపాటు సామాజిక సామరస్యం, ర్యాడికలిజం,
అభివృద్ధి దిశగా భారత్ అడుగులు..
కొనియాడిన ఈజిప్ట్ గ్రాండ్ ముఫ్తీ
మోదీకి ఈజిప్ట్ అత్యున్నత పౌరపురస్కారం
కైరో, జూన్ 25: ఈజిప్ట్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఆ దేశ గ్రాండ్ ముఫ్తీ డాక్టర్ షాకీ ఇబ్రహిం అబ్దుల్ కరీం అల్లామ్‌తో భేటీ అయ్యారు. ఉగ్రవాద నిరోధక చర్యలతోపాటు సామాజిక సామరస్యం, ర్యాడికలిజం, పలు అంశాల్లో పరస్పర సహకారం వంటి కీలక విషయాలపై చర్చించారు. ఈజిప్ట్ సామాజిక న్యాయశాఖ ఆధర్యంలో ఇస్లామిక్ న్యాయ పరిశోధన కోసం దార్-అల్-ఇఫ్తాలో భారతదేశం ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఐటీ’ ఏర్పాటు చేస్తుందని మోదీ ఈ సందర్భంగా వెల్లడించారు. భారతదేశంలో మోదీ పాలన అద్భుతంగా ఉందని, భారత దేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతోందని అల్లామ్ వ్యాఖ్యానించారు. భారత దేశానికి గొప్ప సంస్కృతి ఉందని, ఇటీవల తాను భారత్‌లో పర్యటించినప్పుడు ప్రత్యక్షంగా చూశానని చెప్పారు. ‘‘అల్లామ్‌ను కలుసుకోవడం అత్యంత గౌరవంగా భావిస్తున్నా. భారత్-ఈజి్‌ప్ట దేశాల మధ్య సంబంధాలపై లోతైన చర్చలు జరిపాం. ముఖ్యంగా సంస్కృతి, ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న సంబంధాలపై చర్చించాం’’ అని మోదీ ట్వీట్ చేశారు. అదేవిధంగా మోదీతో భేటీ కావడం తనకెంతో సంతోషంగా ఉందని అల్లామ్ పేర్కొన్నారు. కాగా, గత నెలలో గ్రాండ్ ముఫ్తీ భారత్‌లో పర్యటించారు.
పలు ఒప్పందాలపై సంతకాలు
ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫత్తాహ్ ఎల్-సిసితో ప్రధాని మోదీ ఆదివారం భేటీ అయ్యారు. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం, ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, రక్షణ వంటి అంశాలపై చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంపొందించుకునే వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు చేశారు. శనివారం మధ్యాహ్నం కైరో చేరుకున్న మోదీ ముందుగా ఈజిప్ట్ ప్రధాని మొస్తాఫా మద్‌బౌలీతో భేటీ అయ్యారు. అనంతరం అధ్యక్షుడిని కలుసుకున్నారు. ఈ ఏడాది జరిగిన భారత గణతంత్ర వేడుకలకు ఎల్-సిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీని ఈజి్‌ప్టకు ఆహ్వానించారు. ఈ ఆహ్వానం మేరకు మోదీ ఈజి్‌ప్టలో పర్యటించారు. ఈజిప్ట్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆ దేశ మేధావులతో భేటీ అయ్యారు. ప్రముఖ మేధావి, పెట్రోలియం వ్యూహకర్త టారెక్ హెగ్గీతో ప్రపంచ రాజకీయాలు, ఇంధన భద్రత వంటి అంశాలపై మోదీ చర్చించారు. ఈజి్‌ప్టలో అతి పెద్ద కంపెనీ హస్సన్ అల్లామ్ హోల్డింగ్ కంపెనీ సీఈవో హస్సన్ అల్లామ్‌తోనూ మోదీ భేటీ అయ్యారు.
మీరే భారత హీరో
ఈజిప్ట్ పర్యటనలో ప్రధాని మోదీ కైరోలోని ఓ హోటల్‌లో భారత సంతతి వ్యక్తులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘మీరే భారత హీరో’ అంటూ బిగ్గరగా నినదించారు. అనంతరం.. గుజరాత్‌కు చెందిన బొహ్రా కమ్యూనిటీ ప్రజలతోనూ మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈజి్‌ప్టకు చెందిన మహిళ జెనా భారతీయ సంప్రదాయ వస్త్ర ధారణతో ప్రధానికి స్వాగతం పలికారు. ‘షోలే’ సినిమాలోని ‘యహ్ దోస్తీ హమ్ నహీ తోడేంగే’ గీతాన్ని ఆలపించారు.
మోదీకి అరుదైన గౌరవం
ఈజిప్ట్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం లభించింది. ఆ దేశ అత్యున్నత పౌరపురస్కారం ‘ఆర్డర్ ఆఫ్‌ది నైల్’ను ఈజిప్ట్ అధ్యక్షుడు ఎల్-సిసి అందించి ఘనంగా సత్కరించారు. కాగా, గత తొమ్మిదేళ్లలో ప్రధాని మోదీ వివిధ దేశాల నుంచి అందుకున్న అత్యున్నత పౌరపురస్కారాల్లో ఇది 13వ పురస్కారం కావడం విశేషం.
మోదీ పర్యటనలో మరిన్ని విశేషాలు
దావూదీ బొహ్రా కమ్యూనిటీ సహకారంతో పునరుద్ధరించిన 11వ శతాబ్దంనాటి 13,560 చదరపు మీటర్లలో విస్తరించిన అల్-హకిం మసీదును మోదీ సందర్శించారు.
మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఈజిప్టు, పాలస్తీనాల్లో ఉండి పోరాడి అమరులైన భారతీయ సైనికులకు మోదీ నివాళులర్పించారు. కైరోలోని హెలియోపోలిస్ వార్ సెమెటరీని ఆయన సందర్శించారు. 3,799 మంది భారతీయ సైనికుల త్యాగాలకు గుర్తుగా దీన్ని కామన్‌వెల్త్ నిర్మించింది.
ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన గ్రేట్ పిరమిడ్స్ ఆఫ్ గిజాను ప్రధాని మోదీ సందర్శించారు. ఆయన వెంట ఈజిప్ట్ ప్రధాని మద్‌బౌలీ ఉన్నారు. గిజా పిరమిడ్‌కు సంబంధించిన విషయాలను మోదీ అడిగి తెలుసుకున్నారు.