Prime Minister Modi : మోదీ పద్మ వ్యూహం

ABN , First Publish Date - 2023-01-27T02:50:20+05:30 IST

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం ములాయం సింగ్‌ యాదవ్‌కు మరణానంతరం పద్మవిభూషణ్‌ ప్రకటించడం ప్రధాని మోదీ ప్రభుత్వ మాస్టర్‌ స్ర్టోక్‌గా రాజకీయ

Prime Minister Modi : మోదీ పద్మ వ్యూహం

ములాయంకు పద్మ విభూషణ్‌ అఖిలేశ్‌ను ఏకాకిని చేసేందుకే!

న్యూఢిల్లీ, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం ములాయం సింగ్‌ యాదవ్‌కు మరణానంతరం పద్మవిభూషణ్‌ ప్రకటించడం ప్రధాని మోదీ ప్రభుత్వ మాస్టర్‌ స్ర్టోక్‌గా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. యాదవుల్లో ఉన్నతస్థాయి నేతగా గుర్తింపు చెందిన ములాయంకు మద్దతిచ్చిన అనేక మంది యాదవ వర్గాలు, బీసీలు ఆయన కుమారుడు అఖిలేశ్‌ యాదవ్‌కు పూర్తిగా మద్దతివ్వడం లేదని, వారిని తమ వైపు తిప్పుకునేందుకే మోదీ ఈ వ్యూహం పన్నారని ఈ వర్గాలు భావిస్తున్నాయి.. అఖిలేశ్‌ను ఏకాకి చేసేందుకే మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని, దీని వల్ల సార్వత్రిక ఎన్నికల్లో ములాయం అభిమానుల్లో అనేకమంది మోదీవైపు మొగ్గు చూపుతారని ఈ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి మోదీని ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో బీసీ నేతగా బీజేపీ గత ఎనిమిదేళ్లుగా చిత్రీకరించడం మూలంగా పలు యాదవేతర బీసీలు బీజేపీ వైపు మొగ్గు చూపారని, ఇప్పుడు యాదవులు కూడా పునరాలోచన చేస్తారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే మోదీ నిర్ణయంలోని రాజకీయ వ్యూహం అర్థం చేసుకోలేని కొన్ని సంఘ్‌ పరివార్‌, బీజేపీ వర్గాలు మాత్రం ఇది తమ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకమని వ్యాఖ్యానిస్తున్నాయి. నిజానికి రామజన్మభూమి ఉద్యమం జరిగినప్పుడు అయోధ్యలో 1990 నవంబరు 2న వేలాది మంది కరసేవకులపై కాల్పులు జరిపించి, అనేకమంది మరణానికి కారకుడైన ములాయంకు పద్మవిభూషణ్‌ ప్రదానం చేయడంపై సంఘ్‌ పరివార్‌లో అనేకమంది పెదవి విరుస్తున్నారు.

అఖిలేశ్‌ వర్గం.. ఆచితూచి!

ములాయం సింగ్‌ యాదవ్‌కు పద్మవిభూషణ్‌ ఇవ్వడం సమాజ్‌వాదీ పార్టీ వర్గాల్లో హర్షాతిరేకం కలిగిస్తే అఖిలేశ్‌ యాదవ్‌ మద్దతుదారులు మాత్రం ఆచితూచి స్పందిస్తున్నారు. ములాయంవంటి ఉన్నత స్థాయి నేతకు భారతరత్న ప్రదానం చేయాల్సి ఉన్నదని, పద్మవిభూషణ్‌ ఆయన స్థాయికి తక్కువేనని అఖిలేశ్‌ సతీమణి డింపుల్‌ యాదవ్‌, సమాజ్‌వాదీ పార్టీ నేత స్వామిప్రసాద్‌ మౌర్య తదితరులు స్పష్టం చేస్తున్నారు.

Updated Date - 2023-01-27T02:50:22+05:30 IST