Share News

టికెట్ల కోసం ఢిల్లీలో నేతల పడిగాపులు

ABN , First Publish Date - 2023-11-06T04:32:56+05:30 IST

అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్‌ వేసేందుకు మరో ఐదు రోజులే మిగిలి ఉంది. ఇప్పటికే టికెట్లు వచ్చిన నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు.

టికెట్ల కోసం ఢిల్లీలో నేతల పడిగాపులు

తుది జాబితా ఎప్పుడు వస్తుందోనని..కాంగ్రెస్‌, బీజేపీ ఆశావహుల్లో ఆందోళన

ఖర్చులు భారమవుతున్నాయని ఆవేదన

న్యూఢిల్లీ, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్‌ వేసేందుకు మరో ఐదు రోజులే మిగిలి ఉంది. ఇప్పటికే టికెట్లు వచ్చిన నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే, జాతీయ పార్టీల నుంచి బీ ఫాంల కోసం ఎదురుచూస్తున్న నేతల్లో మాత్రం తీవ్ర ఆందోళన నెలకొంది. ఇప్పటికే కాంగ్రెస్‌ రెండు జాబితాలు, బీజేపీ మూడు జాబితాలతో అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ 31 స్థానాల్లో, కాంగ్రెస్‌ 19 చోట్ల అభ్యర్థులను నిర్ణయించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయా స్థానాల్లో అధిష్ఠానాలు ప్రకటించనున్న జాబితా కోసం ఆశావహులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తమ భవితవ్యం తేలాకే హైదరాబాద్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్న కొంత మంది నేతలు ఢిల్లీలో జాతీయ పార్టీల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఓవైపు ఎలక్షన్లు, మరోవైపు టూరిస్టుల సీజన్‌ కావడంతో ప్రధాన హోటళ్లలో అద్దెలు రెండింతలు పెరిగాయి. మొదటి లిస్టులోనే తమ పేరు ఉంటుందని భావించి అనుచరులతో ఢిల్లీకి చేరారు కొందరు నేతలు. వారం రోజులు ఖరీదైన హోటళ్లలో బస చేసి.. ఇప్పుడు మకాం మర్చారు. ఖర్చు తడిసిమోపెడు కావడంతో అనుచరులను ఇంటికి పంపించేశారు. ఖర్చు తగ్గించుకునేందుకు సాధారణ హోటళ్లలో అద్దెకు ఉంటున్నారు. లిస్టు ఎప్పుడు వస్తుంది..? వస్తే తమ పేరు ఉంటుందా..? లేదా..? అనే ఉత్కంఠ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మరి కొందరు ఢిల్లీలో ఖర్చులు భరించలేక హైదరాబాద్‌ నుంచే ఫోన్లు చేసి లిస్ట్‌ ఎప్పుడు వస్తుందని ఆరా తీస్తున్నారు.

Updated Date - 2023-11-06T04:33:13+05:30 IST