Kosovo Parliament : కొసావో పార్లమెంటులో కొట్లాట.. పిడిగుద్దులతో తలపడిన ఆడ, మగ సభ్యులు..

ABN , First Publish Date - 2023-07-14T10:54:49+05:30 IST

దేశ ప్రజలను శాంతి, సామరస్యాలతో వర్ధిల్లేలా నడిపించవలసిన చట్టసభ సభ్యులు నాగరికతను మరచి కొట్టుకున్నారు. సాక్షాత్తూ దేశ ప్రధాన మంత్రి సభలో మాట్లాడుతుండగా, ప్రతిపక్ష సభ్యుడు వాటర్ బాటిల్‌తో వచ్చి, ఆయనపై నీళ్లు పోశాడు. అంతలోనే మరో సభ్యుడు ఆత్రుతగా వచ్చి, నీళ్లు పోసిన వ్యక్తిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.

Kosovo Parliament : కొసావో పార్లమెంటులో కొట్లాట.. పిడిగుద్దులతో తలపడిన ఆడ, మగ సభ్యులు..
Kosovo Parliament

న్యూఢిల్లీ : దేశ ప్రజలను శాంతి, సామరస్యాలతో వర్ధిల్లేలా నడిపించవలసిన చట్టసభ సభ్యులు నాగరికతను మరచి కొట్టుకున్నారు. సాక్షాత్తూ దేశ ప్రధాన మంత్రి సభలో మాట్లాడుతుండగా, ప్రతిపక్ష సభ్యుడు వాటర్ బాటిల్‌తో వచ్చి, ఆయనపై నీళ్లు పోశాడు. అంతలోనే మరో సభ్యుడు ఆత్రుతగా వచ్చి, నీళ్లు పోసిన వ్యక్తిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మరో సభ్యురాలు దూసుకొచ్చి, నీళ్లు పోసిన వ్యక్తిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మరుక్షణంలోనే మిగిలిన సభ్యులంతా అదే చోటుకు చేరుకుని పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఈ సంఘటన కొసావో పార్లమెంటులో గురువారం జరిగింది.

ప్రధాన మంత్రి అల్బిన్ కుర్టి గురువారం కొసావో పార్లమెంటులో మాట్లాడుతూ, స్థానిక సెర్బుల కారణంగా ఎదురవుతున్న ఉద్రిక్తతలను సడలించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలోనే ప్రతిపక్ష డెమొక్రాటిక్ పార్టీ సభ్యుడు మెర్గిమ్ లుష్టాకు నడుస్తూ వచ్చి, తన చేతిలోని వాటర్ బాటిల్‌లో ఉన్న నీటిని ప్రధాన మంత్రిపైకి విసిరారు. మరికొన్ని నీళ్లను ఆ పక్కనే ఉన్న మరో సభ్యునిపైకి విసిరారు. దీనిని గమనించిన మరో సభ్యుడు వేగంగా వచ్చి, ఆ సభ్యుడిని ఆపేందుకు ప్రయత్నించారు. మరో సభ్యురాలు వెనువెంటనే అక్కడికొచ్చి, ఘర్షణను ఆపేందుకు తన వంతు ప్రయత్నం చేశారు. తోపులాటలో ఆమె కాస్త పక్కకు పడిపోయినంత పని అయింది. ఈ పరిణామాలను గమనించిన మరికొందరు సభ్యులు వేగంగా వచ్చి, ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ ఘర్షణ ప్రారంభమైన తర్వాత భద్రతా సిబ్బంది కుర్టీని సభ వెలుపలకు సురక్షితంగా తీసుకెళ్లారు.

ప్రధాన మంత్రి కుర్టి విధానాల వల్ల పాశ్చాత్య మిత్ర దేశాలతో కొసావో సంబంధాలను దెబ్బతీశాయని ప్రతిపక్ష సభ్యులు ఆరోపించారు. కొసావో ఉత్తర ప్రాంతంలో సహజసిద్ధ స్థానికులైన సెర్బులు అత్యధిక సంఖ్యలో ఉంటారు. వీరు మేయర్ ఎన్నికలను బహిష్కరించారు. అయితే ఎన్నికల్లో గెలిచిన అల్బేనియన్ మేయర్లు పోలీసు భద్రత నడుమ ప్రమాణ స్వీకారాలు చేశారు. దీంతో పెద్ద ఎత్తున హింసాకాండ జరిగింది. సెర్బులు-పోలీసుల మధ్య ఘర్షణలో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. 1998-99లో జరిగిన ఘర్షణల్లో 10 వేల మందికిపైగా మరణించిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ, ఇప్పుడు కూడా పరిస్థితి చేజారుతుందేమోనని చాలా మంది ఆందోళనకు గురయ్యారు. ఈ పరిస్థితి సద్దుమణిగేలా చేయాలని కొసావో ప్రధాన మంత్రిని అమెరికా, యూరోపియన్ యూనియన్ కోరాయి.

పీఎం కుర్టీ బుధవారం మాట్లాడుతూ, సెర్బులు అధికంగా గల నాలుగు పట్టణాల్లో మేయర్ ఎన్నికలను మరోసారి నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ పట్టణాల్లోని మునిసిపల్ కార్యాలయాల వద్ద స్పెషల్ పోలీస్ అధికారుల సంఖ్యను తగ్గిస్తామని చెప్పారు.

నాలుగు గంటల తర్వాత సభ మళ్లీ ప్రారంభమైంది. అయితే అధికార పక్ష సభ్యులు తమ తమ సీట్లలో కూర్చోవడానికి ప్రతిపక్ష సభ్యులు అవకాశం ఇవ్వలేదు. కుర్టీతోపాటు మరొకరిని ఎగతాళి చేస్తూ పోస్టర్లను ప్రదర్శించారు. దీంతో మరోసారి జగడం ప్రారంభమైంది. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ గార్డులు ఘర్షణను నివారించగలిగారు.

అధికార పక్షం సెల్ఫ్ డిటర్మినేషన్ మువ్‌మెంట్ పార్టీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా ఇదే విధంగా ప్రవర్తించింది. ఈ పార్టీ సభ్యులు బాష్పవాయువును ప్రయోగించడంతోపాటు హింసాత్మక చర్యలకు పాల్పడి సభ సమావేశాలను అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి :

PM MODI: యువతే మా సంపద!

Modi France Visit : ఫ్రాన్స్‌లో భారతీయ కరెన్సీలో యూపీఐ చెల్లింపులు.. పోస్ట్ స్టడీ వర్క్ వీసాలు.. : మోదీ

Updated Date - 2023-07-14T10:54:49+05:30 IST