Minister Kiren Rijiju: ప్రతి వ్యవస్థకూ లక్ష్మణ రేఖ!
ABN , First Publish Date - 2023-03-19T01:31:35+05:30 IST
ఎన్నికల సంఘం సహా ఇతర కీలకమైన పోస్టుల నియామకాల్లో న్యాయవ్యవస్థ జోక్యాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు పరోక్షంగా తప్పుబట్టారు.

ఈసీ నియామకాల్లో న్యాయవ్యవస్థ జోక్యం ఎందుకు: కిరెన్ రిజిజు
న్యూఢిల్లీ, మార్చి 18: ఎన్నికల సంఘం సహా ఇతర కీలకమైన పోస్టుల నియామకాల్లో న్యాయవ్యవస్థ జోక్యాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు పరోక్షంగా తప్పుబట్టారు. ‘‘న్యాయవ్యవస్థ, పరిపాలన, శాసన వ్యవస్థ.. ఇలా ప్రతి వ్యవస్థ కూడా ఒకదానిలో ఒకటి జోక్యం చేసుకోకుండా.. రాజ్యాంగం లక్ష్మణ రేఖలు గీసింది. అయితే..ఇటీవలకాలంలో న్యాయవ్యవస్థ పాలనాపరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటోంది. అలాగైతే. వారు చేయాల్సిన న్యాయపరమైన విధులు ఎవరు చేస్తారు?’’ అని రిజిజు ప్రశ్నించారు. శనివారం ఇండియా టుడే కాంక్లేవ్‌లో కిరెన్ రిజిజు మాట్లాడారు. ‘‘న్యాయమూర్తులు ప్రాథమికంగా వారి పనిని చేస్తే న్యాయం కోసం అర్థించే ప్రజలకు న్యాయం జరుగుతుంది’’ అన్నారు. ‘‘దేశంలో అనేక పాలనాపరమైన అంశాలు, సమస్యలు ఉన్నాయి. అన్నింటిలోనూ వారి జోక్యం కుదురుతుందా?’’ అని రిజిజు ప్రశ్నించారు. న్యాయవ్యవస్థ విపక్ష పాత్ర పోషించాలని.. కొంతమంది రిటైర్డ్ జడ్జిలు, కొందరు ఉద్యమకారులు కోరుకుంటున్నారని రిజిజు దుయ్యబట్టారు. అయితే, అది ఎట్టిపరిస్థితిలోనూ సాధ్యంకాదని స్పష్టం చేశారు. న్యాయమూర్తులు రాజకీయాల్లో భాగం కాదన్నారు.