నేడు కురుక్షేత్రలో నిర్ణయం ప్రకటిస్తాం

ABN , First Publish Date - 2023-06-02T02:54:30+05:30 IST

భారత రెజ్లింగ్‌ సమాఖ్య(డబ్ల్యూఎ్‌ఫఐ) మాజీ చీఫ్‌, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ తమను లైంగికంగా వేధించారంటూ ఆందోళన చేపట్టిన రెజ్లర్లకు న్యాయం....

నేడు కురుక్షేత్రలో నిర్ణయం ప్రకటిస్తాం

రెజ్లర్లకు మద్దతుగా ఆందోళనలపై ఖాప్‌ పంచాయతీలు

న్యూఢిల్లీ/ముంబై/లఖ్‌నవూ, జూన్‌ 1: భారత రెజ్లింగ్‌ సమాఖ్య(డబ్ల్యూఎ్‌ఫఐ) మాజీ చీఫ్‌, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ తమను లైంగికంగా వేధించారంటూ ఆందోళన చేపట్టిన రెజ్లర్లకు న్యాయం జరిగేదాకా తాము పోరాటం సాగిస్తామని ఖాప్‌ పంచాయతీల పెద్దలు నిర్ణయించారు. రెజ్లర్లకు మద్దతుగా గురువారం ముజఫర్‌నగర్‌లో జరిగిన మహాపంచాయత్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మహాపంచాయత్‌లో పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌కు చెందిన ఖాప్‌ పంచాయత్‌ల నేతలు పాల్గొన్నారు. మహాపంచాయత్‌కు నేతృత్వం వహించిన బల్యాన్‌ ఖాప్‌కు చెందిన భారత్‌ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) నేత నరేశ్‌ తికాయత్‌ విలేకరులతో మాట్లాడుతూ.. తాము తీసుకున్న నిర్ణయాలను శుక్రవారం కురుక్షేత్రలో జరగనున్న సమావేశంలో ప్రకటిస్తామన్నారు. ‘‘రెజ్లర్ల ఆందోళన అంశంపై మంగళవారమే కేంద్రానికి ఐదు రోజుల అల్టిమేటం ఇచ్చాం.

శుక్రవారం మా కార్యాచరణను ప్రకటిస్తాం’’ అని ఆయన వివరించారు. రాకేశ్‌ టికాయత్‌ మాట్లాడుతూ మహిళా రెజ్లర్లకు న్యాయం జరిగేదాకా పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. ఇదిలా ఉండగా, మహిళా రెజ్లర్లు ఎప్పటికప్పుడు తమ డిమాండ్లను మారుస్తున్నారని బ్రిజ్‌భూషణ్‌ ఆరోపించారు. నేరం రుజువైతే ఉరేసుకుంటాననే మాటకు తాను కట్టుబడి ఉంటానని వ్యాఖ్యానించారు. బ్రిజ్‌భూషణ్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు కపిల్‌ సిబ్బల్‌ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ‘‘అంటే నేరం రుజువైతే ఆత్మహత్య చేసుకోవడమే పరిష్కారమా? నోట్ల రద్దు సమయంలో ప్రధాని మోదీ కూడా ఇలాగే మాట్లాడారు. కానీ ఎలాంటి చర్యలు లేవు కదా’’ అంటూ ట్వీట్‌ చేశారు. కాగా.. టీఎంసీ అధినేత్రి మమత కూడా రెజ్లర్లకు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం కోల్‌కతాలో రెజ్లర్లకు మద్దతుగా టీఎంసీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శనను నిర్వహించారు.

Updated Date - 2023-06-02T02:54:30+05:30 IST