Share News

కరువు కోసం రైతుల ఎదురుచూపు!

ABN , Publish Date - Dec 26 , 2023 | 01:02 AM

కరువు రావాలని రైతులు ఎదురు చూస్తారని కర్ణాటక వ్యవసాయ మార్కెటింగ్‌, చక్కెర శాఖల మంత్రి శివానంద పాటిల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బెళగావి జిల్లా అథణి తాలూకా సుట్టట్టి గ్రామంలో సహకార సంఘాల 75వ వార్షికోత్సవంలో ఆదివారం

కరువు కోసం రైతుల ఎదురుచూపు!

వ్యవసాయ రుణాలు మాఫీ అవుతాయనే

పరిహారం వల్ల రైతుల ఆత్మహత్యలు పెరిగాయి!

కర్ణాటక మంత్రి శివానందపాటిల్‌ వ్యాఖ్యలు

బెంగళూరు, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): కరువు రావాలని రైతులు ఎదురు చూస్తారని కర్ణాటక వ్యవసాయ మార్కెటింగ్‌, చక్కెర శాఖల మంత్రి శివానంద పాటిల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బెళగావి జిల్లా అథణి తాలూకా సుట్టట్టి గ్రామంలో సహకార సంఘాల 75వ వార్షికోత్సవంలో ఆదివారం మంత్రి మాట్లాడుతూ కరువు రావాలని రైతులు ఆశపడతారని, అందుకు కారణం గతంలో ప్రభుత్వాలు కరువు సమయంలో రుణమాఫీ చేయడమేనని అన్నారు. ప్రభుత్వం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉందని, రుణమాఫీ అసాధ్యమని చెప్పారు. వీటిని దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల సాగు చేయాలని కోరారు. గతంలో పలువురు ముఖ్యమంత్రులు విత్తనాలు, ఎరువులు కూడా ఉచితంగా ఇచ్చారని తెలిపారు. రైతులు తాగి మృతి చెందినా, గుండెపోటు వచ్చినా ఆత్మహత్యగా ఫిర్యాదు చేస్తారని, తద్వారా పరిహారం వస్తుందని భావించారని వ్యాఖ్యానించారు. 2015లో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ.5లక్షల పరిహారం ప్రారంభించామని, అప్పటి నుంచే ఆత్మహత్యలు పెరిగాయని చెప్పారు. 2014, 2015లలో ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారో పరిశీలించుకోవచ్చన్నారు. శివానంద పాటిల్‌ అన్నదాతలను అవమానించారని బీజేపీ నాయకులు మండిపడ్డారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నేతలు ఆందోళనలు నిర్వహించారు. శివానంద పాటిల్‌ను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర డిమాండ్‌ చేశారు. అయితే, లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాల కోసమే తన వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి శివానందపాటిల్‌ వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను బీజేపీ తప్పుగా ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

Updated Date - Dec 26 , 2023 | 01:02 AM