కన్నడ బోర్డులు ఏర్పాటు చేయాలని బెంగళూరులో కరవే నిరసన
ABN , Publish Date - Dec 28 , 2023 | 03:20 AM
కర్ణాటకలో అధికార భాష కన్నడ బోర్డులు లేకుండానే వ్యాపారాలు చేయడంపై కర్ణాటక రక్షణ వేదిక (కరవే) తీవ్ర
బెంగళూరు, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో అధికార భాష కన్నడ బోర్డులు లేకుండానే వ్యాపారాలు చేయడంపై కర్ణాటక రక్షణ వేదిక (కరవే) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నెల రోజులుగా ప్రచారం చేసిన కరవే.. బుధవారం భారీ ర్యాలీ నిర్వహించింది. ఎయిర్‌పోర్ట్ సమీపాన ఉండే సాదహళ్లి టోల్‌గేట్ నుంచి నగరంలోకి కరవే నేతలు ర్యాలీగా బయల్దేరారు. పలు చోట్ల ఆంగ్లంలో ఉన్న బోర్డులను ధ్వంసం చేశారు. కరవే అధ్యక్షుడు నారాయణగౌడ నిరసనకు సిద్ధమవుతుండగా కబ్బన్‌పార్క్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారిక భాష కన్నడను రాష్ట్రంలో బలహీనపరిచే కుట్ర సాగుతోందని విమర్శించారు. కార్పొరేట్ కంపెనీలు, పరిశ్రమలు కన్నడ బోర్డులను విస్మరించాయన్నారు. నిబంధనల ప్రకారం 60ు సైన్‌బోర్డులు కన్నడలోనే ఉండాలన్నారు. భాష, నేల, నీరు, విషయంలో కరవే పోరాడుతుందని తెలిపారు. కాగా, కన్నడ నేమ్ బోర్డు, కన్నడ బోధనలపై టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తామని సాంస్కృతిక శాఖ మంత్రి శివరాజ్ ప్రకటించారు. జనవరి ప్రారంభంలోనే సభ జరుపుతామని, 60ు బోర్డులు లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.