Kanum Pongal: ఉల్లాసంగా.. ఉత్సాహంగా!
ABN , First Publish Date - 2023-01-18T07:31:31+05:30 IST
కొత్త ఏడాదిలో మొదటి పండుగలో భాగమైన ‘కానుం పొంగల్’(Kanum Pongal) సందడిగా ముగిసింది. ఈ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర
- సందడిగా ముగిసిన ‘కానుం పొంగల్’
ప్యారీస్(చెన్నై), జనవరి 17: కొత్త ఏడాదిలో మొదటి పండుగలో భాగమైన ‘కానుం పొంగల్’(Kanum Pongal) సందడిగా ముగిసింది. ఈ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పర్యాటక ప్రాంతాలకు వెళ్లి ఉల్లాసంగా గడిపారు. దీంతో సంక్రాంతి పండుగలో చివరిరోజైన కానుంపొంగల్ రాష్ట్రానికి కొత్త శోభ తీసుకొచ్చింది. మంగళవారం ఉదయం నుంచి ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, పార్కులు జనంతో క్రిక్కిరిసి కనిపించాయి. మెరీనాతీరం తదితర ప్రాంతాలు జనంతో కళకళలాడాయి. నీలగిరి జిల్లాలోని ఊటీ, కున్నూర్, దిండుగల్ జిల్లాలోని కొడైకెనాల్, సేలం జిల్లాలోని ఏర్కాడు, తిరునల్వేలి జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు, కుట్రాలం జలపాతాల ప్రాంతాల్లో సందర్శకుల సందడి నెలకొంది. కోయంబత్తూర్ జిల్లాలో ఉక్కడం, పోరూర్ ప్రాంతాల్లోని పార్క్‌లు, పర్యాటక కేంద్రాలు రద్దీగా కనిపించాయి. ట్రాఫిక్ పోలీసులు సందర్శకులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రధాన మార్గాల్లో వాహనాల రాకపోకలు నిషేధించారు. కాగా, తేని, మదురై, ఈరోడ్, పెరంబలూర్, కన్నియాకుమారి, విల్లుపురం, తిరుచ్చి తదితర జిల్లాల్లో కానుం పొంగల్‌ను ప్రజలు కోలాహలంగా జరుపుకున్నారు.