New Delhi: హోలీ వేడుకల్లో వేధింపులకు గురై.. దేశాన్ని విడిచిపెట్టిన జపాన్ యువతి

ABN , First Publish Date - 2023-03-11T14:09:10+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో హోలీ వేడుకల సందర్భంగా వేధింపులకు గురైన జపాన్ టూరిస్టు దేశాన్ని విడిచిపెట్టి..

New  Delhi: హోలీ వేడుకల్లో వేధింపులకు గురై.. దేశాన్ని విడిచిపెట్టిన జపాన్ యువతి

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో హోలీ (Holi) వేడుకల సందర్భంగా వేధింపులకు గురైన జపాన్ టూరిస్టు (Japan Tourist) దేశాన్ని విడిచిపెట్టి బంగ్లాదేశ్ వెళ్లిపోయింది. ఈ ఘటనకు బాధ్యులైన ఒక జువనైల్‌ సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. పవర్ గంజ్ ప్రాతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు గుర్తించారు. కాగా, ఫారినర్‌పై అనుచితంగా ప్రవర్తించినట్టు పహర్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, క్షేత్రస్థాయిలో ఈ విషయంపై విచారణ చేస్తున్నామని, వీడియోను విశ్లేషిస్తున్నామని డీసీపీ సంజయ్ కుమార్ సైన్ తెలిపారు. ముఖం నిండా రంగులు ఉన్న కారణంగా జపాన్ అమ్మాయి ముఖాన్ని గుర్తుపట్టలేకుండా ఉన్నామని, అమ్మాయి గురించిన సమాచారం ఉంటే సహకరించాల్సిందిగా జపాన్ ఎంబసీని కోరుతూ ఇ-మెయిల్ పంపామని చెప్పారు.

సంచలనం సృష్టించిన వీడియో..

ఢిల్లీలో 'హోలీ హై' అని అరుస్తూ కొందరు యువకులు జపాన్‌కు చెందిన అమ్మాయిని చుట్టుముట్టి రంగులు పూశారు. ఒక అబ్బాయి ఆమె తలపై కోడిగుట్టు కొట్టగా, వారి నుంచి ఆమె తప్పించుకునే ప్రయత్నం చేసినా వారు వదల్లేదు. బైబై అని చెప్పినా కూడా ఆమెను తిరిగి పట్టుకుని అభ్యంతకరంగా ప్రవర్తించారు. చివరకు అక్కడి నుంచి ఆమె తప్పించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో ఒక్కసారిగా వైరల్ అయింది. యువకులపై చర్య తీసుకోవాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి.

ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమన్ (డీసీడబ్ల్యూ) చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ఈ ఘటనను ఖండిస్తూ ఢిల్లీ పోలీసులకు నోటీసులు పంపారు. వీడియోను పరిశీలించి ఇందుకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆ నోటీసులో ఆమె పేర్కొన్నారు. విదేశీయులపై హోలీ రోజు లైంగిక వేధింపులకు పాల్పడినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియా చూసి చాలా బాధ కలిగింది. వీడియాలు పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు నోటీసు పంపాను. ఇది పూర్తిగా సిగ్గుచేటైన ప్రవర్తన'' అని స్వాతి మలివాల్ ట్వీ్ట్ చేశారు. నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జాతీయ మహిళా కమిషన్ ఢిల్లీ పోలీసులను ఆదేశించింది.

Updated Date - 2023-03-11T14:09:10+05:30 IST