Supreme Court: ‘ఉరి’కి ప్రత్యామ్నాయం లేదా?

ABN , First Publish Date - 2023-03-22T02:23:34+05:30 IST

‘మరణ దండన అమలులో భాగంగా ఖైదీలకు ఉరి వేసే చంపాలా? నొప్పి లేకుండా మరణించే ప్రత్యామ్నాయ పద్ధతులు లేవా? ఈ విషయంపై దృష్టి సారించండి’ అని సుప్రీంకోర్టు కేంద్రప్రభుత్వానికి సూచించింది.

Supreme Court: ‘ఉరి’కి ప్రత్యామ్నాయం లేదా?

నొప్పి లేకుండా చంపే పద్ధతులపై దృష్టి సారించండి.. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన

న్యూఢిల్లీ, మార్చి 21: ‘మరణ దండన అమలులో భాగంగా ఖైదీలకు ఉరి వేసే చంపాలా? నొప్పి లేకుండా మరణించే ప్రత్యామ్నాయ పద్ధతులు లేవా? ఈ విషయంపై దృష్టి సారించండి’ అని సుప్రీంకోర్టు కేంద్రప్రభుత్వానికి సూచించింది. మెడకు ఉరితాడు బిగించి చంపేసే క్రూరమైన పద్ధతి కాకుండా తక్కువ నొప్పితో మరణ శిక్షను అమలు చేసే ఇతర విధానాలపై చర్చించి, సమాచారాన్ని సేకరించాలని ఆదేశించింది. మరణ శిక్ష పడ్డ దోషులకు నొప్పి లేకుండా చనిపోయే అవకాశం కల్పించాలంటూ న్యాయవాది రిషి మల్హోత్ర దాఖలు చేసిన పిల్‌పై విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహల ధర్మాసనం మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది. తుపాకీతో కాల్చడం, విషపు ఇంజెక్షన్‌ ఇవ్వడం, విద్యుదాఘాతం లేదా గ్యాస్‌ చాంబర్‌ ద్వారా చంపే విధానాలను పరిశీలించవచ్చన్న న్యాయ కమిషన్‌ నివేదికను మల్హోత్ర ప్రస్తావించారు.

ఇతర దేశాల్లో ఉరి వేసి చంపడాన్ని క్రమంగా నిలిపివేస్తున్నారని గుర్తుచేశారు. స్పందించిన ధర్మాసనం.. మరణ శిక్షలో గౌరవం, తక్కువ నొప్పి అనేవి ఇక్కడ ప్రశ్నలు కావని.. సైన్స్‌ ఏం చెబుతోందన్నదే ప్రశ్న అని పేర్కొంది. విషపు ఇంజెక్షన్‌ ఇవ్వమంటోందా అంటే అదీ కాదని, అమెరికాలో కూడా ఇది సరైన ప్రక్రియ కాదని తేల్చారని వ్యాఖ్యానించింది. విషపు ఇంజెక్షన్ల వల్ల కూడా చాలా బాధను అనుభవించే చనిపోతారని జస్టిస్‌ చంద్రచూడ్‌ అన్నారు. కాల్చి చంపడం కూడా క్రూరమైన చర్యేనని చెప్పారు. ఫలానా పద్ధతిని అనుసరించాలని తాము ప్రభుత్వాలకు చెప్పలేమని స్పష్టం చేశారు. అయితే ఉరి వేసి చంపడం వల్ల కలిగే ప్రభావాలపై ఏదైనా అధ్యయనం ఉంటే తీసుకొని రావాలని అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణిని సీజేఐ ఆదేశించారు. ‘‘ఈ అంశంపై నిపుణుల కమిటీ ఏర్పాటును పరిశీలిస్తాం’’ అని జస్టిస్‌ చంద్రచూడ్‌ అన్నారు. విచారణను మే 2కు వాయిదా వేశారు.

Updated Date - 2023-03-22T09:20:46+05:30 IST