Indonesia : ఇండోనేషియా కొత్త రాజధాని నిర్మాణం కోసం అదనపు నిధుల కేటాయింపు

ABN , First Publish Date - 2023-06-09T15:22:52+05:30 IST

ఇండోనేషియా నూతన రాజధాని నుసంటర (Nusantara) నిర్మాణానికి అదనంగా 1.01 బిలియన్ డాలర్లను మంజూరు చేసేందుకు ఆ దేశ పార్లమెంటరీ బడ్జెట్ కమిటీ ఆమోదం తెలిపింది.

Indonesia : ఇండోనేషియా కొత్త రాజధాని నిర్మాణం కోసం అదనపు నిధుల కేటాయింపు
Joko Widodo

న్యూఢిల్లీ : ఇండోనేషియా నూతన రాజధాని నుసంటర (Nusantara) నిర్మాణానికి అదనంగా 1.01 బిలియన్ డాలర్లను మంజూరు చేసేందుకు ఆ దేశ పార్లమెంటరీ బడ్జెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఈ నిర్మాణాన్ని మరింత వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఈ వివరాలను ఈ కమిటీ చైర్‌పర్సన్ సయ్యద్ అబ్దుల్లా శుక్రవారం తెలిపారు.

బోర్నియో ద్వీపంలో నుసంటర నగరాన్ని నిర్మిస్తున్నారు. అంతకుముందు కేటాయించిన నిధులకు అదనంగా మరో 1.01 బిలియన్ డాలర్లను కేటాయిస్తున్నట్లు సయ్యద్ అబ్దుల్లా సీనియర్ మంత్రులకు చెప్పారు. ఈ నగర నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని, 2024లో దేశాధ్యక్షుడు జోకో విడోడో (President Joko Widodo) ఈ నగరంలో కార్యకలాపాలు నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.

నుసంటరలో ప్రధాన పరిపాలన కార్యాలయాల కోసం భవనాలను 2024 జూన్ నాటికి పూర్తి చేయాలని ఇండోనేషియా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో ప్రెసిడెన్షియల్ ప్యాలెస్, ప్రధాన మంత్రిత్వ శాఖల భవనాలు కూడా ఉన్నాయి. దాదాపు 16 వేల మంది ఉద్యోగులు, సైన్యం, పోలీసులను తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

నుసంటర నగర నిర్మాణానికి 32 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని అంచనా. దీనిలో 20 శాతం మాత్రమే ప్రభుత్వం ఖర్చు చేస్తుందని, మిగిలిన సొమ్మును ప్రైవేటు రంగం నుంచి సేకరిస్తామని దేశాధ్యక్షుడు జోకో విడోడో చెప్పారు.

ఇవి కూడా చదవండి :

America : డొనాల్డ్ ట్రంప్‌పై ఏడు ఆరోపణలతో కేసు నమోదు

Nirmala Sitharaman : కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ కుమార్తె వివాహం అత్యంత నిరాడంబరంగా!

Updated Date - 2023-06-09T15:22:52+05:30 IST