Share News

Thailand Visa: భారతీయులకు శుభవార్త చెప్పిన థాయ్‌లాండ్.. వీసా లేకుండానే ఎంట్రీ ఫ్రీ.. కానీ ఓ చిన్న మెలిక!

ABN , First Publish Date - 2023-10-31T19:33:45+05:30 IST

మన భారతీయులు విహారయాత్రకు ఎక్కువగా వెళ్లే టూరిస్ట్ స్పాట్‌లలో థాయ్‌లాండ్ ఒకటి. ప్రకృతి అందాల్ని ఆస్వాదించడం కోసం, ప్రపంచ సమస్యల్ని మర్చిపోయి కొంతకాలం పాటు సరదాగా కాలక్షేపం చేయడం కోసం..

Thailand Visa: భారతీయులకు శుభవార్త చెప్పిన థాయ్‌లాండ్.. వీసా లేకుండానే ఎంట్రీ ఫ్రీ.. కానీ ఓ చిన్న మెలిక!

మన భారతీయులు విహారయాత్రకు ఎక్కువగా వెళ్లే టూరిస్ట్ స్పాట్‌లలో థాయ్‌లాండ్ ఒకటి. ప్రకృతి అందాల్ని ఆస్వాదించడం కోసం, ప్రపంచ సమస్యల్ని మర్చిపోయి కొంతకాలం పాటు సరదాగా కాలక్షేపం చేయడం కోసం.. అక్కడికి వెళ్తుంటారు. పైగా.. ఇతర టూరిస్ట్ ప్రాంతాలతో పోలిస్తే థాయ్‌లాండ్‌లో ఖర్చులు కూడా తక్కువే! అందుకే.. భారతీయులు ఎంపిక చేసుకునే టూరిస్ట్ స్పాట్‌లలో థాయ్‌లాండ్ ప్రధాన స్థానంలో ఉంటుంది. అలాంటి పర్యాటకుల కోసం ఇప్పుడు థాయ్‌లాండ్ ఒక శుభవార్త తెలిపింది. భారత్‌‌తో పాటు తైవాన్‌ నుంచి వచ్చే వారికి.. వీసా అవసరం లేకుండానే తమ దేశంలో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని థాయ్ ప్రభుత్వం నిర్ణయించింది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.


అయితే.. ఇది లైఫ్‌టైమ్ ఆఫర్ కాదు, కేవలం పరిమిత కాలం. ఈ ఏడాది నవంబరు 10వ తేదీ నుంచి వచ్చే ఏడాది మే 10వ తేదీ వరకు ఈ సడలింపు (వీసా లేకుండా ఫ్రీ ఎంట్రీ) అమల్లో ఉంటుందని థాయ్ అధికారులు వెల్లడించారు. అంటే.. ఈ మధ్యకాలంలో మన భారతీయులు అక్కడికి వీసా లేకుండా వెళ్లి, నెల రోజుల పాటు నచ్చిన ప్రదేశాల్ని సందర్శించవచ్చు. గతంలో పోలిస్తే.. ఈమధ్య పర్యాటకుల సంఖ్య తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో, పర్యాటకుల్ని ఆకర్షించేందుకు గాను థాయ్‌లాండ్ కేబినెట్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు థాయ్‌ ప్రధాని శ్రేత్తా తవిసిన్‌ స్పష్టం చేశారు. ఇదే సమయంలో.. ‘‘భారత్‌, తైవాన్‌ నుంచి వచ్చే పర్యాటకులు.. వీసా లేకుండానే 30 రోజులపాటు థాయ్‌లాండ్‌లో పర్యటించవచ్చు’’ అని థాయ్‌ అధికార ప్రతినిధి చాయ్‌ వచరొంకే కూడా క్లారిటీ ఇచ్చారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఎవరైతే థాయ్‌లాండ్‌కి వెళ్లాలని కలలు కన్నారో, వెంటనే బ్యాగ్ ప్యాక్ చేసుకొని అక్కడికి వెళ్లిపోండి, మీ స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయండి.

ఇదిలావుండగా.. సరిగ్గా ఇలాంటి ఆఫర్‌నే థాయ్‌లాండ్ ప్రభుత్వం గత నెలలో చైనా నుంచి వచ్చే పర్యాటకులకు కూడా ఇచ్చింది. మలేసియా, చైనా, దక్షిణ కొరియా తర్వాత భారత్‌ నుంచే ఎక్కువ మంది పర్యాటకులు థాయ్‌లాండ్‌కు వెళ్తుంటారు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబరు వరకు సుమారు 2.2 కోట్ల మంది థాయ్‌లో పర్యటించారని.. వీరి వల్ల 25.67 బిలియన్‌ డాలర్ల ఆదాయం లభించిందని థాయ్‌ పర్యాటకశాఖ గణాంకాలు తెలిపాయి. అందుకే.. థాయ్‌లాండ్ భారతీయ పర్యాటకులకు ఈ బంపరాఫర్ ప్రకటించింది. కాగా.. థాయ్‌లాండ్‌లో బ్యాంకాక్‌, క్రబి, ఫుకెట్‌, ఫిఫీ దీవులు వంటివి చూడదగ్గ ప్రదేశాలు. బ్యాంకాక్‌కు మన యువతకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

Updated Date - 2023-10-31T19:34:12+05:30 IST