Income Tax : ఆదాయ పన్ను.. గారడీ!

ABN , First Publish Date - 2023-02-02T02:06:15+05:30 IST

ఆదాయ పన్ను పరిమితిని ఈసారైనా పెంచకపోతారా అని వేతన జీవులంతా వేయికళ్లతో ఆశగా ఎదురుచూస్తున్న

Income Tax : ఆదాయ పన్ను.. గారడీ!

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ఆదాయ పన్ను పరిమితిని ఈసారైనా పెంచకపోతారా అని వేతన జీవులంతా వేయికళ్లతో ఆశగా ఎదురుచూస్తున్న బడ్జెట్‌ వచ్చేసింది! ఆ పరిమితిని పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు కూడా!! కానీ.. ఆ పెంపునకు షరతులు వర్తిస్తాయి! అదేంటంటే.. ఇప్పటిదాకా పాత పన్ను విధానంలోనూ, 2020లో ప్రకటించిన కొత్త పన్ను విధానంలోనూ రూ.5 లక్షల దాకా ఎలాంటి పన్నూ కట్టక్కర్లేని సంగతి తెలిసిందే. ఆ పరిమితిని కొత్త పన్ను విధానంలో మాత్రమే రూ.7 లక్షలకు పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. పాత పన్ను విధానానికి మాత్రం ఎలాంటి మార్పులూ చేయలేదు. అంటే, ఇంకా పాత పన్ను విధానంలో కొనసాగుతున్నవారు ఆ రూ.5 లక్షల పరిమితితోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల.. అతి కొద్ది మందికి మాత్రమే ప్రయోజనమని, కొత్త విధానాన్ని ఎంచుకున్నా రూ.15 లక్షలకు పైబడి ఆదాయం ఉండి, ఎలాంటి సేవింగ్స్‌ లేనివారికి మాత్రమే ఉపయోగమని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక మాంద్యంతో పలు అగ్రదేశాలు కుంగిపోయిన సమయాల్లో కూడా భారత్‌ను కాపాడింది ప్రజల పొదుపు మంత్రమేనని, అలాంటి పొదుపు(సేవింగ్స్‌)ను కాదని భారత ఆర్థిక వ్యవస్థను ఖర్చుపెట్టే (స్పెండింగ్‌) ఎకానమీగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వారు పేర్కొంటున్నారు.

శ్లాబుల కుదింపు..

ప్రభుత్వం 2020లో ప్రవేశపెట్టిన కొత్త పన్ను విధానానికి అంతగా ఆదరణ లేకపోవడం, మెజారిటీ పన్ను చెల్లింపుదారులు ఇంకా పాత విధానంలోనే కొనసాగుతుండడంతో.. మరింత మందిని కొత్త పన్ను విధానంవైపు ఆకర్షించడం కోసం పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచారు. అలాగే, కొత్త విధానంలో ఉన్న శ్లాబులను ఐదుకు కుదించారు. ఈ ‘సరి’కొత్త పన్ను శ్లాబుల ప్రకారం.. రూ.9 లక్షల వరకూ ఆదాయం ఉన్నవారిపై పన్ను భారం 25 శాతం మేర, రూ.15 లక్షల దాకా ఆదాయం ఉన్నవారిపై 20ు మేర తగ్గుతుందని ఆర్థిక మంత్రి వివరించారు. అలాగే.. రూ.15.5 లక్షకు మించి ఆదాయం ఉన్నవారికి రూ.52,500 మేర ప్రామాణిక తగ్గింపు వర్తిస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు. అత్యధిక ఆదాయం ఉన్నవారిపై ప్రస్తుతం విధిస్తున్న గరిష్ఠ సర్‌చార్జీ రేటును ప్రస్తుతం ఉన్న 37 శాతం నుంచి 25 శాతానికి తగ్గిస్తున్నామని ప్రకటించారు. దీంతో వారిపై ఉన్న గరిష్ఠ పన్ను రేటు 42.74 శాతం (ఇది ప్రపంచంలోనే అత్యధికం) నుంచి 39 శాతానికి తగ్గుతుందని వివరించారు. ఆదాయపన్నుకు సంబంధించి నిర్మల చేసిన చివరి ప్రతిపాదన.. ప్రైవేటు ఉద్యోగులు పదవీ విరమణ చేసే సమయంలో లీవ్‌ ఎన్‌క్యా్‌షమెంట్‌ (సెలవులను నగదు చేసుకోవడం)పై పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.3 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచడం. ఇది వారికి భారీగా ఊరటనిచ్చేదే. ఎప్పుడో 2002లో అప్పటి ప్రభుత్వం ప్రైవేటు ఉద్యోగుల మూల వేతనం రూ.30 వేలు ఉన్నప్పుడు ఈ పరిమితిని విధించిందని, దాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తాము పెంచుతున్నామని నిర్మల వివరించారు. అలాగే, కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసే సమయంలో కొత్త పన్ను విధానమే డీఫాల్ట్‌ ఆప్షన్‌గా ఉంటుందని వెల్లడించారు.పాత పన్ను విధానంలో కొనసాగాలనుకునేవారు ఆ ప్రత్యామ్నాయాన్నే ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఆదాయపన్నుకు సంబంధించి చేసిన ఈ కొత్త ప్రతిపాదనల వల్ల ప్రభుత్వ నికర పన్ను ఆదాయంలో రూ.35 వేల కోట్లు నష్టపోతున్నట్టు నిర్మల పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌ విషయంలో టీడీఎస్‌ (మూలం వద్ద పన్ను కోత) వర్తింపునకు విధించిన పదివేల పరిమితిని తొలగించారు. ఇకపై ఒక ఆర్థిక సంవత్సరంలో ఆన్‌లైన్‌ గేమింగ్‌ ద్వారా వచ్చిన గెలుచుకున్న నికర ఆదాయంపై 30 శాతం టీడీఎస్‌ విధించనున్నట్టు బడ్జెట్‌లో ప్రతిపాదించారు.

పాత విధానమే మెరుగు..

ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో ఎంతో ఘనంగా ఏకరువు పెట్టిన ప్రయోజనాలన్నీ గత ఏడాదే కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నవారికి మాత్రమే వర్తిస్తాయి. కొత్త పన్ను విధానాల్లోని శ్లాబులను మాత్రమే సవరించడం ఇందుకు కారణం. అయితే, పాత పన్ను విధానంలో ఉన్నవారు మినహాయింపులన్నీ వాడుకుంటే.. రూ.9 లక్షల దాకా ఎలాంటి పన్నూ పడదని ఆర్థిక నిపుణులు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడే ఉద్యోగంలో చేరి.. ఎలాంటి బాదరబందీలూ, సేవింగ్స్‌ లేనివారికి మాత్రమే కొత్త విధానం ప్రయోజనకరం తప్ప.. గృహ రుణాలు, పిల్లల స్కూలు ఫీజులు, బీమా చెల్లింపులు జరిపేవారికి పాత పద్ధతే సరైనదని వారు స్పష్టం చేస్తున్నారు. సాక్షాత్తూ కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన సీనియర్‌ అధికారి సైతం.. ఆదాయపన్ను మినహాయింపులు, తగ్గింపులు అన్నీ కలిపి రూ.3.75 లక్షలకు మించి ఉండే వారు పాత పన్ను విధానంలోనే కొనసాగాలని, ఆలోపు ఉన్నవారు మాత్రం (అంటే పెద్దగా సేవింగ్స్‌ లేనివారు) కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటే మేలని ఆయన సూచించారు. టాక్స్‌ ఫైలింగ్‌కి సంబంధించిన డేటాను పరిశీలించిన అనంతరమే ఈ సూచన చేస్తున్నట్టు వెల్లడించారు. అలాగే, కొత్త పన్ను విధానాన్ని మారుతున్నవారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2023-02-02T08:11:14+05:30 IST