జోడోయాత్రలో కాంగ్రెస్ ఎంపీ మృతి
ABN , First Publish Date - 2023-01-15T02:43:35+05:30 IST
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో శనివారం విషాదం చోటుచేసుకుంది.
పాదయాత్రలో గుండెపోటు
కుప్పకూలిన సంతోఖ్ సింగ్
ప్రధాని, రాహుల్ సంతాపం
చండీగఢ్, జనవరి 14: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో శనివారం విషాదం చోటుచేసుకుంది. ఈ యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేత, జలంధర్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌధరి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గుండెపోటు కారణంగా ఆయన హఠాన్మరణం చెందారని తెలుస్తోంది. పంజాబ్‌లోని ఫిలౌర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. శనివారం ఉదయం సంతోఖ్ సింగ్ ఉత్సాహంగా జోడోయాత్రలో పాల్గన్నారు. రాహుల్‌తో మాట్లాడుతూ ముందుకు సాగారు. అలా మాట్లాడుతూ.. ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను లూధియానాలోని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందారని వైద్యులు ధ్రువీకరించారు. ఆ వార్త తెలియగానే రాహుల్ గాంధీ తన యాత్రను నిలిపివేసి, ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జోడో యాత్రలో సంతోఖ్‌తో కలిసి నడిచిన ఫొటోలను ట్విటర్‌లో షేర్ చేస్తూ.. ‘‘సంతోఖ్ మరణం దిగ్ర్భాంతికి గురిచేసింది. ఆయన కష్టపడి పనిచేసే నాయకుడు. తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశారు. ఈ శోక సమయంలో ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సంతోఖ్ భార్య కమల్‌జీత్ కౌర్‌కు సంతాప లేఖను రాశారు. ‘‘సంతోఖ్ మృతి తీరని లోటు’’ అని అందులో పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా సంతోఖ్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. 1946 జూన్ 18న జలంధర్‌లోని ధలివాల్ ప్రాంతంలో సంతోఖ్ సింగ్ జన్మించారు.