Imam Murder : గురుగ్రామ్‌లో ఇమామ్‌ హత్య

ABN , First Publish Date - 2023-08-02T04:19:50+05:30 IST

ఓవైపు మణిపూర్‌లో జరిగిన దారుణాలపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతుండగా.. మరోవైపు హరియాణాలో మత ఘర్షణలు చెలరేగాయి. మణిపూర్‌పై పార్లమెంటులో చర్చ, ప్రధాని మోదీ ప్రకటనకు ..

Imam Murder  : గురుగ్రామ్‌లో ఇమామ్‌ హత్య

ఢిల్లీ శివారుకు పాకిన హరియాణా మత ఘర్షణలు

సోమవారం అర్ధరాత్రి ప్రార్థనా మందిరానికి నిప్పు

రెండు చోట్ల అల్లర్లలో ఐదుకు పెరిగిన మరణాలు

గో రక్షక్‌ మోనూ మనేసర్‌ వీడియోతోనే హింస!!

అతను పాల్గొంటున్నాడనే యాత్రపై దాడికి ప్లాన్‌

సమీప కొండలపై దాక్కుని రాళ్లు విసిరి, కాల్పులు

నూహ్‌ ఆలయంలో గంటల పాటు 2,500 మంది

వారు బయటకు రాకుండా వాహనాల దహనం

గురుగ్రామ్‌, ఆగస్టు 1: ఓవైపు మణిపూర్‌లో జరిగిన దారుణాలపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతుండగా.. మరోవైపు హరియాణాలో మత ఘర్షణలు చెలరేగాయి. మణిపూర్‌పై పార్లమెంటులో చర్చ, ప్రధాని మోదీ ప్రకటనకు ప్రతిపక్షాలు పట్టుబడుతుండగానే.. ఢిల్లీ పొరుగునే ఉన్న హరియాణాలో అల్లర్లు మొదలయ్యాయి. సోమవారం సాయంత్రం వీహెచ్‌పీ చేపట్టిన బ్రిజ్‌ మండల్‌ జలాభిషేక యాత్ర నూహ్‌ జిల్లా నంద్‌ గ్రామం వద్దకు చేరుకోగానే ఓ వర్గం వారు దాడికి దిగడం.. పరస్పరం రాళ్లు రువ్వుకోడం.. కాల్పులు.. వాహనాల దహనం.. ఇద్దరు హోంగార్డుల మృతి తదితర పరిణామాల ఉద్రిక్తత మంగళవారం కూడా కొనసాగింది. అల్లర్లు ఢిల్లీ శివారు గురుగ్రామ్‌కూ పాకడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. కాగా, సోమవారం అర్ధరాత్రి గురుగ్రామ్‌ సెక్టార్‌ 57లోని అంజుమన్‌ మసీదుపై దాడికి దిగిన మూకలోని కొందరు కాల్పులు జరపడంతో నాయబ్‌ ఇమామ్‌ మౌలానా సాద్‌ (26) మృతిచెందాడని పోలీసులు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన ఇతడిది బిహార్‌ రాష్ట్రమని పేర్కొన్నారు. కాల్పుల్లో మరో వ్యక్తి కూడా గాయపడ్డాడని, ప్రార్థనా మందిరానికి మూక నిప్పు పెట్టిందని పోలీసులు చెప్పారు. మరోవైపు నూహ్‌ జిల్లాలో కర్ఫ్యూ విధించారు. ఇక్కడ అల్లర్లలో గాయపడ్డవారిలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. హోంగార్డులు గురుసేవక్‌, నీరజ్‌ సోమవారమే చనిపోగా.. భదాస్‌ గ్రామానికి చెందిన శక్తి, మరో గుర్తుతెలియని వ్యక్తి మంగళవారం మృతిచెందారు. పోలీసులు 11 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. 27 మందిని అరెస్టు చేశారు. 120 వాహనాలను ధ్వంసం చేశారని, 8 పోలీసు వాహనాలు 50 వాహనాలకు నిప్పుపెట్టారని చెప్పారు. మొత్తం 70 మందికి గాయాలయ్యాయని, 80 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.

పెద్ద కుట్రే ఉంది..: సీఎం ఖట్టర్‌

నూహ్‌ అల్లర్ల వెనుక పెద్ద కట్రే ఉందని హరియాణ సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ అన్నారు. హోం మంత్రి అనిల్‌ విజ్‌ సైతం.. పక్కా పథకం ప్రకారమే అల్లర్లకు పాల్పడ్డారని ఆరోపించారు. కాగా, నూహ్‌లో ముస్లింల సంఖ్య ఎక్కువ. అక్కడ జరిగినదానిని తెలుసుకున్న కొందరు 17 కిలోమీటర్ల సమీపంలో ఉన్న సొహ్నలో ముస్లింలకు చెందిన 4 వాహనాలు, దుకాణానికి నిప్పుపెట్టారు. ఈ రెండు చోట్లా పరిస్థితి ఉద్రిక్తంగానే ఉన్నా.. హింస జరగలేదు. నూహ్‌ జిల్లాకు 13 కంపెనీల కేంద్ర భద్రతా దళాలు చేరుకున్నాయి. మరో ఆరు కంపెనీల బలగాలు రానున్నాయి. ఇవి వారం పాటు రాష్ట్రంలో ఉండనున్నాయి. ఇక నూహ్‌లో ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు. అన్ని ప్రార్థనా మందిరాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. నూహ్‌, ఫరీదాబాద్‌ జిల్లాల్లో బుధవారం వరకు మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు.

గురుగ్రామ్‌లో రెస్టారెంట్‌కు నిప్పు

నూహ్‌కు సమీపంలో ఉండే గురుగ్రామ్‌ సెక్టార్‌ 70లో మంగళవారం సాయంత్రం రెస్టారెంట్‌కు కొందరు నిప్పుపెట్టారు. పక్కనున్న దుకాణాలను ధ్వంసం చేశారు. మధ్యాహ్నం 200 మంది బాద్‌షాపూర్‌లో కర్రలు, రాళ్లతో పలు దుకాణాలపై దాడి చేశారు. మాంసం దుకాణాలను లక్ష్యం చేసుకున్నారు. ఓ ప్రార్థనా మందిరం ఎదుట జై శ్రీరామ్‌ నినాదాలు చేశారు. పోలీసులు రావడంతో వారంతా పారిపోయారు. బాద్‌షాపూర్‌ మార్కెట్‌ను మూసివేశారు. కాగా, నూహ్‌లో వీహెచ్‌పీ యాత్ర నల్హర్‌ మహదేశ్‌ ఆలయానికి చేరాల్సి ఉంది. దీనికిముందే గుడి పక్కన ఉన్న కొండలపై పెద్దసంఖ్యలో గుమిగూడిన ఓ వర్గం వారు రాళ్లు రువ్వి, కాల్పులకు పాల్పడ్డారు. బయట వాహనాలకు నిప్పుపెట్టడంతో.. గుడిలోని వారు ఎటూ వెళ్లలేని పరిస్థితి. కొన్ని గంటల పాటు 2,500 మంది భయంభయంగా గడిపారు. భద్రతా దళాలు వచ్చి బయటకు తెచ్చాయి.

మోనూ వీడియోనే కారణం!

హరియాణ అల్లర్లకు మోనూ మనేసర్‌ అలియాస్‌ మోనూ యాదవ్‌ (30) విడుదల చేసిన వీడియోనే కారణమని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరీయన అంటే.. మనేసర్‌ భజరంగ్‌దళ్‌ నాయకుడు. గోరక్షక్‌ కూడా. ఫిబ్రవరిలో ఆవులను తరలిస్తున్న ఇద్దరు రాజస్థాన్‌ ముస్లిం యువకుల కిడ్నాప్‌, హత్య కేసులో నిందితుడు. పశువుల వ్యాపారం చేసే ఈ యువకులు భివానీలో ఓ కారులో సజీవ దహనమై కనిపించారు. ఇక ‘‘నూహ్‌లో జరగబోయే యాత్రలో పాల్గొనబోతున్నా. మద్దతుదారులారా రండి’’ అంటూ రెచ్చగొట్టేలా కొద్దిరోజుల కిందట మనేసర్‌ వీడియో విడుదల చేశాడు. వీహెచ్‌పీ వారించడంతో పాల్గొనలేదు. కానీ, అతడు వస్తాడనే అంచనాతో ఓ వర్గం దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-08-02T04:19:50+05:30 IST