BJP: కేంద్రం తటస్థంగా ఉంటే.. జగన్‌కు ఓటమే!
ABN , First Publish Date - 2023-05-26T02:57:37+05:30 IST
దేశంలోనే తమది క్రమశిక్షణ కలిగిన పార్టీ అని బీజేపీ నాయకులు చెప్పుకొంటారు! పార్టీకి వ్యతిరేకంగా ఎవ్వరూ, ఎక్కడా బహిరంగంగా స్పందించరు! కానీ, తెలంగాణ బీజేపీలోని కొంతమంది నాయకులు ఇప్పుడు ట్రెండ్ మార్చారు!

పథకాలతో గెలుపు సాధ్యం కాదు
రాష్ట్రం వెనుకబడిపోయింది
వైసీపీకి వ్యతిరేకంగా పవనాలు
తెలంగాణలో బీజేపీకి మూడో స్థానమే
టీ-బీజేపీ జాతీయ నేత ‘చిట్‌చాట్’
న్యూఢిల్లీ, మే 25 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే తమది క్రమశిక్షణ కలిగిన పార్టీ అని బీజేపీ నాయకులు చెప్పుకొంటారు! పార్టీకి వ్యతిరేకంగా ఎవ్వరూ, ఎక్కడా బహిరంగంగా స్పందించరు! కానీ, తెలంగాణ బీజేపీలోని కొంతమంది నాయకులు ఇప్పుడు ట్రెండ్ మార్చారు! ఢిల్లీలోనో, హైదరాబాద్‌లోనో విలేకరులతో చిట్‌చాట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా, ఇతర రాష్ట్రాల వ్యవహారాలు చూసే తెలంగాణకు చెందిన బీజేపీ జాతీయ నాయకుడొకరు గురువారం ఢిల్లీలో విలేకరులతో ‘చిట్‌చాట్’ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌కు వ్యతిరేకంగా ప్రజా పవనాలు వీస్తున్నాయని ఆయన చెప్పారు. బీజేపీ తటస్థ పాత్ర వహిస్తే వైసీపీ ఓటమి ఖాయమని తేల్చి చెప్పారు. తెలుగుదేశం- జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని అన్నారు. సంక్షేమ పథకాల వల్ల జగన్ గెలుస్తారన్నది భ్రమ అని, అభివృద్ధిలో రాష్ట్రం ఎంతో వెనుకబడిందని అభిప్రాయపడ్డారు. కేంద్రం తటస్థంగా ఉంటే జగన్ వ్యతిరేకులు బయటకు వస్తారని, వారికి భయం పోతుందని చెప్పారు. ఇక... తెలంగాణకు సంబంధించి ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని బట్టి చూస్తే బీజేపీకి మూడో స్థానమే లభిస్తుందని ఆ నాయకుడు చెప్పారు. కాంగ్రెస్ నుంచి 30-40 మంది నేతలు వచ్చి చేరితే తప్ప పరిస్థితిలో మార్పు ఉండదన్నారు.
ప్రస్తుతం బీఆర్‌ఎ్‌సకు పరిస్థితి సాఫీగా ఉందని, ఓట్ల శాతం తగ్గినా సీట్లు పెరుగుతాయని ఆయన అంచనా వేశారు. కాంగ్రెస్ సారథ్యంలో ప్రాంతీయ పార్టీలు ఏకమయ్యే అవకాశాలు లేవని, పార్లమెంట్‌లో కలిసి పని చేసినంత మాత్రాన దేశంలో కలిసి పని చేయడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒక్కటవుతాయా అని ఆయన ప్రశ్నించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హిందువుల నాయకుడుగా చిత్రించుకోవడం వల్ల విస్తృతంగా ప్రజల అభిప్రాయం బీజేపీకి అనుకూలంగా మారదని ఆ పార్టీ జాతీయ నేత అభిప్రాయపడ్డారు. తెలంగాణలో హిందూ రాజకీయాలు నడవవని చెప్పారు.