Share News

Henry : హెన్రీ కిసింజర్‌ కన్నుమూత

ABN , First Publish Date - 2023-12-01T04:10:26+05:30 IST

అగ్ర రాజ్యం అమెరికా విదేశాంగ విధానంలో తనదైన ముద్ర వేసిన హెన్రీ కిసింజర్‌ కన్నుమూశారు. ఆ దేశానికి రెండుసార్లు విదేశాంగ మంత్రిగా పనిచేసిన ఆయన..

 Henry : హెన్రీ కిసింజర్‌ కన్నుమూత

రెండుసార్లు అమెరికా విదేశాంగ మంత్రిగా సేవలు..!

వందేళ్ల వయసులో తుదిశ్వాస.. నోబెల్‌ ప్రైజ్‌ గ్రహీత

1971 నాటి యుద్ధ సమయంలో భారత్‌ వ్యతిరేక వైఖరి

వాషింగ్టన్‌, నవంబరు 30: అగ్ర రాజ్యం అమెరికా విదేశాంగ విధానంలో తనదైన ముద్ర వేసిన హెన్రీ కిసింజర్‌ కన్నుమూశారు. ఆ దేశానికి రెండుసార్లు విదేశాంగ మంత్రిగా పనిచేసిన ఆయన.. వందేళ్ల వయసులో బుధవారం కెంటకీలో తుదిశ్వాస విడిచారు. కిసింజర్‌ 1923 మే 23న జర్మనీలోని ఫ్యూర్త్‌లో జన్మించారు. అసలు పేరు హీంజ్‌ ఆల్ర్ఫెడ్‌ కిసింజర్‌. ఈయనకు 15 ఏళ్ల వయసున్నపుడు కుటుంబం అమెరికాకు వెళ్లి మాన్‌హట్టన్‌లో స్థిరపడింది. ప్రఖ్యాత హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో చదువుకున్న కిసింజర్‌.. ఆ విద్యాసంస్థలోనే ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. రిచర్డ్‌ నిక్సన్‌, గెరాల్డ్‌ ఫోర్డ్‌ అమెరికా అధ్యక్షులుగా ఉన్న సమయంలో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. 1971 భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధం సమయంలో పాకిస్థాన్‌ పక్షం వహించేలా నిక్సన్‌ను ప్రభావితం చేశారు. యూదు జాతీయుడు అయిన కిసింజర్‌.. 1973లో అరబ్‌- ఇజ్రాయెల్‌ ఘర్షణల వేళ అత్యంత కీలక పాత్ర పోషించి ఉద్రిక్తతలను చల్లార్చారు. నాటి సోవియట్‌ యూనియన్‌తో సన్నిహితంగా ఉంటున్న చైనాను అమెరికా వైపు చూసేలా చేయడంలో కిసింజర్‌ సఫలీకృతులయ్యారు. 1973లో చైనా వెళ్లి మావోతో భేటీ అయ్యారు. అదే ఏడాది వియత్నాంతో అమెరికా యుద్ధం ముగింపులోనూ ఈయన పాలుపంచుకున్నారు. వియాత్నాం జనరల్‌ లే డక్‌ థోతో కలిసి 1973లో నోబెల్‌ శాంతి పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ ఏడాది మే నెలలో చైనాలో పర్యటించి.. అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు. జూలై నెలలో భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా జరిగిన సదస్సులో కిసింజర్‌ కనిపించారు.

Updated Date - 2023-12-01T04:10:27+05:30 IST