Supreme Court: గుజరాత్ హైకోర్టులో ఏం జరుగుతోంది?
ABN , First Publish Date - 2023-08-22T02:48:34+05:30 IST
గుజరాత్ హైకోర్టు వ్యవహారశైలిని సోమవారం సుప్రీంకోర్టు మరోసారి తీవ్రస్థాయిలో తప్పుపట్టింది. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన రూలింగ్‌లకు వ్యతిరేకంగా ఉత్తర్వులు జారీ చేసే అధికారం ఏ ఇతర కోర్టులకు కూడా లేదని స్పష్టం చేసింది.
గర్భస్రావంపై సుప్రీం విచారణ..
అదే సమయంలో అదే పిటిషన్‌పై గుజరాత్ హైకోర్టు ఆదేశాలు
మా రూలింగ్‌ను కాదని ఉత్తర్వులా?
అది రాజ్యాంగ ధర్మానికే విరుద్ధం
సుప్రీం ధర్మాసనం ఆగ్రహం
న్యూఢిల్లీ, ఆగస్టు 21: గుజరాత్ హైకోర్టు వ్యవహారశైలిని సోమవారం సుప్రీంకోర్టు మరోసారి తీవ్రస్థాయిలో తప్పుపట్టింది. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన రూలింగ్‌లకు వ్యతిరేకంగా ఉత్తర్వులు జారీ చేసే అధికారం ఏ ఇతర కోర్టులకు కూడా లేదని స్పష్టం చేసింది. అలా చేస్తే అధి రాజ్యాంగ ధర్మానికే విరుద్ధమవుతుందని తెలిపింది. ఓ కేసు ఇక్కడ విచారణలో ఉండగా, అక్కడ ఉత్తర్వులు ఇవ్వడం తగదని పేర్కొంది. గర్భస్రావం చేయించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ అత్యాచారానికి గురైన మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్య చేసింది. ఆ మహిళ తొలుత హైకోర్టులో పిటిషన్ వేయగా అత్యవసరంగా విచారణ జరపాల్సిన కేసును 12 రోజుల పాటు వాయిదా వేసింది. గర్భం 27 వారాలది కావడం, విచ్ఛిత్తికి సమయం మించిపోతుందన్న కారణంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించగా శనివారం జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ల ధర్మాసనం ‘స్పెషల్ సిట్టింగ్’ నిర్వహించి విచారణ జరిపింది. సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగానే గర్భస్రావానికి అనుమతించేది లేదంటూ గుజరాత్ హైకోర్టు శనివారమే ఆదేశాలు ఇచ్చింది. ఈ ఉత్తర్వుల వివరాలను సోమవారం విచారణ ప్రారంభించిన ధర్మాసనం దృష్టికి న్యాయవాదులు తీసుకువచ్చారు. దాంతో ‘‘గుజరాత్ హైకోర్టులో ఏమి జరుగుతోంద’’ని ధర్మాసనం ప్రశ్నించింది. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను కింది కోర్టులు కాదనలేవని తెలిపింది. గుజరాత్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమాధానం ఇస్తూ అంతకుముందు ఇచ్చిన ఉత్తర్వుల రాతలో తప్పు (క్లరికల్ మిస్టేక్) దొర్లడంతో దాన్ని సరిదిద్దడానికే హైకోర్టు శనివారం ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు.
అపార్థం కారణంగా ఆ తప్పు జరిగిందని చెప్పారు. మరోవైపు వైద్యులు ఇచ్చిన తాజా నివేదికను పరిశీలించిన ధర్మాసనం మంగళవారమే ఆస్పత్రికి వెళ్లి గర్భస్రావం చేయించుకోవాలని ఆ మహిళను ఆదేశించింది. గర్భస్రావాన్ని తిరస్కరించడం ద్వారా గుజరాత్ హైకోర్టు సరైన నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. ఈ సందర్భంగా గర్భధారణపై కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘వివాహ వ్యవస్థ ద్వారా గర్భం ధరిస్తే అది కుటుంబంలో పండగ వాతావరణం కలిగిస్తుంది. అదే వివాహేతర బంధం ద్వారా కలిగితే బాధాకరంగా ఉంటుంది. అదీ అత్యాచారం ద్వారా కలిగితే ఆ మహిళ శారీరకంగా, మానసికంగా కుంగిపోతుంది. మహిళపై జరిగే లైంగికదాడే భరించరానిది. గర్భం ధరిస్తే అది మరింత గాయంగా మారుతుంది. ఎందుకంటే అది ఇష్టపూర్వకంగా జరిగినది కాదు కాబట్టి. ఇలాంటి సందర్భాల్లో గర్భస్రావానికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది’’ అని తెలిపింది.
కారణాలు చెప్పాల్సిందే
బిహార్‌లో చేపట్టిన కులాల సర్వేకు వ్యతిరేకంగా ప్రాథమికంగానైనా కారణాలు చెప్పకుంటే ఆ ప్రక్రియపై స్టే ఇవ్వలేమని సోమవారం సుప్రీంకోర్టు తెలిపింది. కులాల సర్వేకు అనుకూలంగా పట్నా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాల విచారణ సందర్భంగా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ‘‘ సర్వే వల్ల కలిగే ఇబ్బంది ఏమిటో, కేసు ఏమిటో చెప్పకుంటే స్టే ఇవ్వలేం’’ అని స్పష్టం చేసింది. సర్వే డాటాను ప్రచురించబోమని బిహార్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేసింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.
మణిపూర్‌పై సుప్రీంకు మూడు నివేదికలు
మణిపూర్ అల్లర్ల బాధితులకు అందుతున్న సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు నియమించిన జస్టిస్ గీతా మిట్టల్ నేతృత్వంలోని ముగ్గురు రిటైర్డ్ మహిళా న్యాయమూర్తుల కమిటీ తన నివేదికలను సుప్రీంకోర్టుకు అందజేసింది. బాధితులు ఆధార్‌కార్డులు సహా కీలక పత్రాలను కోల్పోవడంతో వాటిని తిరిగి జారీ చేయాల్సిన ఆవశ్యకత, బాధితులకు సహాయ, పునరావాస ప్యాకేజీని అప్‌గ్రేడ్ చేయాల్సిన ఆవశ్యకత, అలాగే, కమిటీ పనిని సులభతరం చేసేందుకు అవసరమైన నిపుణుల నియామకాలకు సంబంధించి మొత్తం మూడు నివేదికలను కమిటీ సోమవారం అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించింది. ఈ నివేదికలను పరిగణనలోకి తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం.. ఈనెల 25న నిర్దిష్టమైన మార్గదర్శకాలు జారీ చేస్తామని ప్రకటించింది. నివేదికల కాపీలను సంబంధిత న్యాయవాదులందరికీ అందజేయాలని కూడా సుప్రీంకోర్టు సూచించింది.