Governor: గవర్నర్‌కు లభించని మోదీ, అమిత్‌షా అపాయింట్‌మెంట్
ABN , First Publish Date - 2023-01-15T08:44:31+05:30 IST
రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్ళిన రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి(Governor RN Ravi) ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోంశాఖ
- ప్రధాని కార్యాలయ అధికారులతో గవర్నర్ భేటీ
- అసెంబ్లీ ఘటనపై వివరణ
- కేంద్ర హోంశాఖకు స్టాలిన్ లేఖ
చెన్నై, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్ళిన రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి(Governor RN Ravi) ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాలను కలుసుకోకుండానే నగరానికి బయలుదేరారు. శాసనసభలో తన ప్రసంగానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి స్టాలిన్ ఖండన తీర్మానం ప్రవేశపెట్టడం, ఆ నేపథ్యంలో తాను వాకౌట్ చేయడం వంటి సంఘటనలపై తన తరఫు వాదనలను కేంద్ర ప్రభుత్వానికి వివరించేందుకు గవర్నర్ రవి గురువారం ఉదయం ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. ఢిల్లీలో తమిళనాడు హౌస్‌లో రాత్రి బసచేశారు.
శుక్రవారం ఉదయం ఆయన ప్రధాని మోదీని, హోంమంత్రి అమిత్‌షాను కలుసుకుంటారని వార్తలు వెలువడ్డాయి. కానీ ఆ ఇరువురిని గవర్నర్ కలుసుకోలేకపోయారు. చివరకు ఢిల్లీ సౌత్ బ్లాక్‌లోని ప్రధాని కార్యాలయానికి గవర్నర్ వెళ్ళి అక్కడి ఉన్నతాధికారులను కలుసుకున్నారు. ఈ నెల 9న శాసనసభలో చోటు చేసుకున్న ఘటనలను ఆయన సమగ్రంగా వివరించారు. అటు పిమ్మటి హోం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులను కూడా ఆయన కలుసుకుని తన వాదనలను తెలియజేశారు. శుక్రవారం సాయంత్రం మళ్లీ మరికొంత మంది ఉన్నతాధికారులను కలుసుకున్నారు.
స్టాలిన్ లేఖను హోంశాఖకు పంపిన రాష్ట్రపతి
రాష్ట్ర శాసనసభలో మంత్రివర్గం రూపొందించిన ప్రసంగ పాఠంలో మార్పులు చేర్పులు చేసి గవర్నర్ ఆర్‌ఎన్ రవి ప్రసంగించిన వ్యవహారంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పంపిన లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిశీలనకు పంపారు. శాసనసభలో గవర్నర్ వ్యవహరించిన తీరుపై డీఎంకే ఎంపీల బృందం ఇటీవల రాష్ట్రపతిని కలుసుకుని వినతిపత్రం సమర్పించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో స్టాలిన్ పంపిన సీల్డ్‌కవర్ లేఖను కూడా ఆమెకు అందించారు. రాజ్యాంగ ధర్మాసనానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ గవర్నర్ అనుసరిస్తున్న తీరుకు కళ్లెం వేయాలని, తమిళ సంస్కృతి సంప్రదాయాలను కాపాడేలా వ్యవహరించాలని గవర్నర్‌కు సూచించాలని ఆ లేఖలో స్టాలిన్ కోరారు. ఆ లేఖను క్షుణ్ణంగా పరిశీలించిన రాష్ట్రపతి దానిని హోంమంత్రిత్వ శాఖకు పంపారు. స్టాలిన్ లేఖపై చర్యలు చేపట్టాలంటూ రాష్ట్రపతి ఆ లేఖపై నోట్ పెట్టారని తెలుస్తోంది.