భారత్‌ పట్ల విధేయతపై అఫిడవిట్‌ ఇవ్వండి

ABN , First Publish Date - 2023-09-05T02:16:53+05:30 IST

నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఎంపీ మహమ్మద్‌ అక్బర్‌ లోనే తాను భారత రాజ్యాంగానికి విధేయుడినై ఉంటానని పేర్కొంటూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేకాదు....

భారత్‌ పట్ల విధేయతపై అఫిడవిట్‌ ఇవ్వండి

నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఎంపీకి సుప్రీంకోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 4: నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఎంపీ మహమ్మద్‌ అక్బర్‌ లోనే తాను భారత రాజ్యాంగానికి విధేయుడినై ఉంటానని పేర్కొంటూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేకాదు.. జమ్మూకశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగం అని బేషరతుగా అంగీకరించాలని, భారత సార్వభౌమత్వాన్ని గౌరవిస్తానని ఆ అఫిడవిట్‌లో పేర్కొనాలని సూచించింది. 2018లో జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీలో ‘పాకిస్థాన్‌ జిందాబాద్‌’ అంటూ నినాదాలిచ్చినందుకు క్షమాపణలు చెప్పాలని పేర్కొంది. 2018లో జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీలో అక్బర్‌ లోనే పాకిస్థాన్‌ అనుకూల నినాదాలు చేశారు. అక్బర్‌.. పాక్‌ అనుకూల నినాదాలు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన కశ్మీరీ పండిట్లకు చెందిన ‘రూట్స్‌ ఇన్‌ కశ్మీర్‌’ అనే స్వచ్ఛంద సంస్థ మేనేజింగ్‌ ట్రస్టీ, జమ్మూకశ్మీర్‌ మాజీ ఎమ్మెల్యే(2002-18) అమిత్‌ రైనా, మరికొందరు కశ్మీరీ పండిట్లు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ వ్యాజ్యంపై సుప్రీం ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వం తరఫున సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలను వినిపించారు. అసెంబ్లీలో పాక్‌ అనుకూల నినాదాలు చేసినందుకు అక్బర్‌ బేషరతుగా క్షమాపణలు చెప్పేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. అక్బర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబ్బల్‌ వాదలను వినిపిస్తూ.. అక్బర్‌ భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి, ఎంపీగా బాధ్యతలు స్వీకరించారని గుర్తుచేశారు. అక్బర్‌తో తాను అఫిడవిట్‌ వేయిస్తానని, ఒకవేళ అతను అందుకు అనుకూలంగా లేకుంటే.. తాను అతని తరఫున వాదనలను వినిపించబోనని వివరించారు.

Updated Date - 2023-09-05T02:16:53+05:30 IST