PM Narendra Modi: ఎన్నికల్లో మోదీపై పోటీ చేసే దమ్ముందా.. బీజేపీ నేత సవాల్
ABN , Publish Date - Dec 18 , 2023 | 04:59 PM
2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమికి కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఒక సవాల్ విసిరారు. ఇండియా కూటమిలోని ఏ నాయకుడికైనా ధైర్యం ఉంటే..
PM Narendra Modi: 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమికి కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఒక సవాల్ విసిరారు. ఇండియా కూటమిలోని ఏ నాయకుడికైనా ధైర్యం ఉంటే.. మోదీపై వారణాసి నుంచి ఎన్నికల్లో పోటీ చేసి చూపించాలని ఛాలెంజ్ చేశారు. బీహార్ రాజధాని పాట్నాలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఎవరికైనా ధైర్యం ఉంటే బనారస్‌లో మోదీపై ఎన్నికల్లో పోటీ చేయండి. నేను నితీష్ కుమార్‌కి, అలాగే ఇండియా కూటమికి సవాల్ చేస్తున్నాను. చెప్పండి.. పోటీ చేసే దమ్ముందా?’’ అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకులు తమ సొంత ప్రయోజనాల కోసం, తమ నేరాలను దాచుకోవడం కోసమే ఒక కూటమిగా ఏర్పడ్డారని ఆరోపించారు.
కాగా.. కేంద్రమంత్రి గిరిరాజ్ వివాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల ఆయన హలాల్, ఝట్కా మాంసంలపై ఓ సంచలన ప్రకటన చేశారు. “సనాతన ధర్మంలో బలి ఇచ్చే సంప్రదాయం ఉంది. ఈ బలి అనేది ఒక్క స్ట్రోక్‌లోనే చేయబడుతుంది. అందుకే.. హిందువులు మాంసాహారం తింటే, ఝట్కా మాంసాన్నే తినాలి. హలాల్ మాంసం తినడం మానేయండి. హలాల్ మాంసాన్ని తింటూ తమ మతాన్ని భ్రష్టు పట్టించబోమని హిందువులు ఇప్పటినుంచే ప్రతిజ్ఞ చేయాలి’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఇదే సమయంలో ఆయన ముస్లింలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు ఎలాగైతే తమ మతానికి కట్టుబడి ఉన్నారో, హిందువులు కూడా అలాగే ఉండాలని పిలుపునిచ్చారు.
“ముస్లింలు తమ మతానికి కట్టుబడి ఉన్నారు. ఇందుకు నేను వాళ్లని గౌరవిస్తాను. ఈ విషయాన్ని హిందువులు కూడా అర్థం చేసుకోవాలి. ఎలాగైతే ముస్లింలు హలాల్ మాంసాన్ని మాత్రమే తినాలని నిర్ణయించుకున్నారో.. అలాగే హిందువులు కూడా ఝట్కా మాంసం మాత్రమే తినాలి. ఒకవేళ ఝట్కా మాంసం అందుబాటులో లేకపోతే.. మరేదీ తినకూడదని డిసైడ్ అవ్వాలి’’ అని మంత్రి గిరిరాజ్ చెప్పుకొచ్చారు. అలాగే.. హిందూ యువకులకు కూడా ఒక విజ్ఞప్తి చేశారు. మన హిందువుల గుర్తింపు తిలకం అని, యువకులందరూ తిలకం ధరించాలని తాను విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.