రాజుల కోటలో ఉచితాల జల్లు
ABN , First Publish Date - 2023-11-20T04:04:24+05:30 IST
ధనిక రాష్ట్రం.. ఎడారి ప్రాంతం.. పలు రాజవంశాలకు నిలయమైన రాజస్థాన్‌లో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు ఓటర్లపై ఉచిత హామీల వర్షం కురిపిస్తున్నాయి.

ఎడాపెడా కాంగ్రెస్, బీజేపీ వరాలు.. మహిళలు, యువతే లక్ష్యంగా మ్యానిఫెస్టోలు
ధనిక రాష్ట్రం.. ఎడారి ప్రాంతం.. పలు రాజవంశాలకు నిలయమైన రాజస్థాన్‌లో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు ఓటర్లపై ఉచిత హామీల వర్షం కురిపిస్తున్నాయి. మహిళలు, యువత, విద్యార్థులను ఆకట్టుకునేందుకు తక్కువ ధరకే వంట గ్యాస్ సిలిండర్, బాలికలకు నగదు సాయం నుంచి స్కూటీల వరకు అనేక వాగ్దానాలు చేస్తున్నాయి. ప్రధాన వర్గాలను సంతృప్తిపరిచే ప్రయత్నం చేస్తు న్నాయి. అరచేతిలో వైకుంఠం చూపుతున్నాయు. వీటి అమలు గురించి అడిగినా.. నిధులు ఎలా వస్తాయన్నా.. దాటవేస్తున్నాయి. సంపద పెంచి ప్రజలకు పంచుతామని చెబుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీలోని 200 స్థానాలకు ఈ నెల 25న ఒకేసారి పోలింగ్ జరగనుంది. డిసెంబరు 3న మధ్యప్రదేశ్, ఛత్తీ్‌సగఢ్, మిజోరాం, తెలంగాణ అసెంబ్లీలతో పాటే ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రెండు వారాలపాటు అభ్యర్థుల ఎంపిక, ఖరారుతో సతమతమైన రెండు పార్టీలు.. ఇప్పుడు హామీలతో హోరెత్తిస్తున్నాయి. అశోక్ గహ్లోత్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాం లో గత ఐదేళ్లలో మహిళలు, దళితులపై జరిగిన దాడులు, అత్యాచారాలను బీజేపీ ప్రధానాస్త్రంగా మలచుకుంది. వారి భద్రతకు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నించింది. ప్రభుత్వ ఉద్యోగులను మచ్చిక చేసుకునేందుకు కాంగ్రెస్.. పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)పై చట్టం తెస్తామని ప్రకటించింది. ఇద్దరి హామీల్లో ప్రజలను ఏవి ఆకట్టుకుంటున్నా యో కూడా రెండు పార్టీలు నిఘా వేశాయి. వాటిని అదనంగా తమ వాగ్దానాల్లో చేర్చాలని నేతల నుంచి డిమాం డ్లు ఊపందుకోవడం గమనార్హం.
- సెంట్రల్ డెస్క్
బీజేపీ హామీల్లో కొన్ని..
పోలీసు బలగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్. ప్రతి జిల్లాలో ఓ మహిళా పోలీసు స్టేషన్ ఏర్పాటు. రాజస్థాన్ సాయుధ బలగాల (ఆర్‌ఏసీ) పరిధిలో మూడు మహిళా బెటాలియన్లు.
పేద బాలికలకు కేజీ టు పీజీ ఉచిత విద్య.
ప్రతిభావంతులైన పన్నెండో తరగతి అమ్మాయిలకు ఉచితంగా స్కూటీల పంపిణీ
లాడో ప్రోత్సాహన్ యోజన కింద ప్రతి బాలికకు రూ.2 లక్షల సేవింగ్స్ బాండ్ ఇస్తారు. ఇందులో బాలిక ఆరో తరగతికి వచ్చాక రూ.6 వేలు, 9వ తరగతిలో రూ.9 వేలు, పదో తరగతిలో 10 వేలు, 11వ తరగతిలో 12 వేలు, పన్నెండో తరగతిలో 14 వేలు, ప్రొఫెషనల్ కోర్సు చదివేటప్పుడు రూ.50 వేలు, 21 ఏళ్లు రాగానే రూ.లక్ష అందజేస్తారు.
ప్రభుత్వ రంగంలోవచ్చే ఐదేళ్లలో 2.5 లక్షల ఉద్యోగాలు.
ఉజ్వల పథకం కింద వంట గ్యాస్ సిలిండర్ రూ.400కే.
ప్రధానమంత్రి ముద్ర యోజన కింద అందే సొమ్ము రూ.4 వేల నుంచి రూ.8 వేలకు పెంపు.
ఐదేళ్ల కాంగ్రెస్ హయాంలో జరిగిన వివిధ స్కాంలపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు.
ప్రతి రెవెన్యూ డివిజన్‌లో ఎయిమ్స్, ఐఐటీ తరహాలో రాజస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రాజస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏర్పాటు.
రూ.40 వేల కోట్లతో భామాషా ఆరోగ్య మౌలిక వసతుల మిషన్. ప్రతి జిల్లాలో ఓ వైద్య కళాశాల
గోధుమ మద్దతు ధర క్వింటాలు రూ.2,700కి పెంపు.
5 లక్షల మంది యువతకు పర్యాటక నైపుణ్య శిక్షణ కోసం రూ.2 వేల కోట్లతో నిధి.
కాంగ్రెస్ 7 గ్యారెంటీలు
కాలేజీ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టా్‌పలు, ట్యాబ్‌ల పంపిణీ.
ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన
పేదలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ (ఇప్పటికే ఇస్తుండగా లబ్ధిదారుల సంఖ్య ను 1.05 కోట్లకు పెంచుతామంటున్నారు)
ప్రతి మహిళా కుటుంబ పెద్దకు ఏటా రూ.10వేల నగదు సాయం
ప్రకృతి వైపరీత్యాల బాధితులకు రూ.15 లక్షల వరకు ఉచిత బీమా. రూ.25 లక్షలతో చిరంజీవి ఆరోగ్య బీమా.
ఆవుపేడ కిలో రూ.2కే కొనుగోలు
ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీఎస్ అమలుకు చట్టం.