రాహుల్‌పై వేటుకు.. ‘అదానీ’ కారణం కాదు

ABN , First Publish Date - 2023-03-26T00:59:15+05:30 IST

పార్లమెంటులో గౌతమ్‌ అదానీపై తాను ప్రశ్నించడంతో ప్రధాని మోదీ భయపడ్డారని.. మళ్లీ గొంతెత్తకుండా తనపై వేటు వేశారంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యల..

రాహుల్‌పై వేటుకు.. ‘అదానీ’ కారణం కాదు

దాని ద్వారా వచ్చేది పోయేది ఏమీ లేదు: రవిశంకర్‌

పట్నా, న్యూఢిల్లీ, మార్చి 25: పార్లమెంటులో గౌతమ్‌ అదానీపై తాను ప్రశ్నించడంతో ప్రధాని మోదీ భయపడ్డారని.. మళ్లీ గొంతెత్తకుండా తనపై వేటు వేశారంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యల మీద బీజేపీ దీటుగా స్పందించింది. అదానీ ఉదంతంతో వచ్చేది పోయేది ఏమీలేదని.. అనర్హతకు కారణం అదానీ వ్యవహారం కాదని తెలిపింది. రాహుల్‌ ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించిన గంట వ్యవధిలో కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ పట్నాలో మీడియాతో మాట్లాడారు. రాహుల్‌వి తప్పుడు, నిరాధార ఆరోపణలన్నారు. మోదీ పేరును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కేవలం విమర్శనాత్మకంగా చేసినవికాదని.. దూషించడమేనని తెలిపారు. తద్వారా ఓబీసీలను ఆయన అవమానించారని,దీన్ని బీజేపీ తీవ్రంగా పరిగణిస్తోందని తెలిపారు. మరోవైపు కాంగ్రె్‌సకు అత్యున్నత లాయర్లు ఉన్నారని, కానీ సూరత్‌ కోర్టు నుంచి స్టే ఎందుకు తెచ్చుకోలేదని నిలదీశారు. అధికార ప్రతినిధి పవన్‌ ఖేరా ఉదంతంతో కేవలం గంటలోనే కోర్టుకువెళ్లి స్టే తెచ్చుకున్న కాంగ్రెస్‌.. రాహుల్‌ విషయంలో హైకోర్టు, సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. రాహుల్‌ను పదవిని త్యజించిన త్యాగమూర్తిగా చూపి కర్ణాటక ఎన్నిక ల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్‌ నాటకాలు ఆడుతోందని ధ్వజమెత్తారు.

Updated Date - 2023-03-26T00:59:15+05:30 IST