Former Minister: రాసలీల వివాదం సీబీఐకి అప్పగించాలి

ABN , First Publish Date - 2023-01-31T11:52:51+05:30 IST

యువతిని అడ్డం పెట్టుకుని సాగించిన రాసలీలల వివాదాన్ని సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని మాజీ మంత్రి రమేష్‌ జార్కిహొళి

Former Minister: రాసలీల వివాదం సీబీఐకి అప్పగించాలి

- మాజీ మంత్రి రమేష్‌ జార్కిహొళి

బెంగళూరు, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): యువతిని అడ్డం పెట్టుకుని సాగించిన రాసలీలల వివాదాన్ని సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని మాజీ మంత్రి రమేష్‌ జార్కిహొళి(Former Minister Ramesh Jarkiholi) డిమాండ్‌ చేశారు. సోమవారం బెళగావిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాజకీయాలలో కొనసాగేందుకు డీకే శివకుమార్‌ అనర్హుడని మండిపడ్డారు. తాను, డీకే శివకుమార్‌ ఇద్దరం కాంగ్రెస్‏లో ఉన్నప్పుడు అన్నదమ్ములుగా బాగానే ఉన్నామని, బెళగావి జిల్లాకే చెందిన ఓ మహిళ ద్వారానే విబేధాలు వచ్చాయంటూ లక్ష్మీహెబ్బాళ్కర్‌ పేరు ప్రస్తావించకుండానే పేర్కొన్నారు. తనపై రాసలీల సీడీ వివాదం కోసం ఎందరో పనిచేశారని ఆరోపించారు. 128 సాక్ష్యాలు ఉన్నాయని, అన్నింటినీ సీబీఐకి ఇస్తానని వారి ద్వారానే విచారణ సాగించాలని కోరారు. యువతితో పాటు నరేష్‌ సహా ఆరుగురిని అరెస్టు చేసి సీబీఐకి అప్పగించాలన్నారు. రాసలీలల వివాదంతో రెండేళ్లపాటు తన ప్రశాంత జీవనానికి భంగం కలిగించారని తెలిపారు. ఓ మహిళ ద్వారా తనను అవమానించారని, అనివార్యంగా తప్పు అంగీకరించాల్సి వచ్చిందన్నారు. డీకే శివకుమార్‌(DK Shivakumar) ప్రస్తుతం శ్రీమంతుడని, తాము చూసినప్పుడు సామాన్యుడన్నారు. 1985లో కలిసి ఎన్నికల బరిలో నిలిచామని, తర్వాత పరిశ్రమల రూపంలో తాను సంపాదించానని, కానీ డీకే శివకుమార్‌ లూఠీ చేసి కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు. డీకే శివకుమార్‌ ఆసుపత్రిలో ఉన్నప్పుడు పరామర్శించేందుకు వెళ్లానని, అప్పుడు ఆయన భార్య ఉషా కాంగ్రె్‌సను వీడరాదంటూ వేడుకున్నారన్నారు. తాను మాట్లాడిన ఒక బూతు పదాన్ని ఎడిట్‌ చేసి కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ఆడియోలో డీకే శివకుమార్‌కు లండన్‌, దుబాయ్‌లోను నివాసాలు ఉన్నాయని, వేలకోట్లు ఆస్తి ఉందని మాట్లాడారని రూ.40 కోట్ల డీల్‌కు సంబంధించిన అంశం కూడా అందులో ఉందని పదేపదే తనపేరు ప్రస్తావించారని సదరు ఆడియో ఉందంటూ ప్రకటించారు. సీడీ లేడీని అరెస్టు చేస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని, డీకే శివకుమార్‌ నేతృత్వంలోనే బెంగళూరుకు చెందిన కాంగ్రెస్‌ పదాధికారి నివాసంలో ఆమె ఉన్నారని తెలిపారు. రానున్న ఎన్నికల తర్వాత పోటీ చేసేది లేదని, డీకే శివకుమార్‌ వంటి వారు ఉంటే రాజకీయాలు చేయలేమన్నారు.

Updated Date - 2023-01-31T11:52:53+05:30 IST