ప్రార్థనా సమావేశంలో పేలుళ్లు
ABN , First Publish Date - 2023-10-30T03:53:57+05:30 IST
ఆ విశాలమైన హాలులో దాదాపు 2వేల మంది దేవున్ని ప్రార్థించటానికి కళ్లు మూసుకున్నారు.. ఇంతలోనే చెవులు పగిలిపోయే శబ్దం..
ఇద్దరి మృతి, 51 మందికి గాయాలు.. కేరళలోని కోచి సమీపంలో ఘటన
క్రైస్తవ సంస్థ ఆధ్వర్యంలో ప్రార్థనలు.. కళ్లు మూసుకోగానే బాంబు పేలుళ్లు
తన పనేనంటూ అదే సంస్థ సభ్యుడి లొంగుబాటు.. ఉగ్రదాడా అన్నది చెప్పలేమన్న డీజీపీ
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో రాష్ట్రంలో పాలస్తీనా సంఘీభావ ర్యాలీలు, సభలు
ఈ నేపథ్యంలోనే దాడి జరిగిందా అన్న సందేహాలు
కోచి, అక్టోబరు 29: ఆ విశాలమైన హాలులో దాదాపు 2వేల మంది దేవున్ని ప్రార్థించటానికి కళ్లు మూసుకున్నారు.. ఇంతలోనే చెవులు పగిలిపోయే శబ్దం.. కళ్లు తెరిచి చూసేసరికి.. హాలంతా మంటలు, విరిగి ముక్కలైన కుర్చీలు.. రక్తమోడుతూ, ప్రాణాలు రక్షించుకోవటానికి ఒకర్నొకరు తోసుకుంటూ పరిగెడుతున్న జనం.. కేరళలో ఆదివారం ఓ క్రైస్తవ ప్రార్థనా సమావేశంలో బాంబు పేలుళ్లతో ఆవిష్కృతమైన బీభత్స దృశ్యమిది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు చనిపోగా, 51మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. పేలుళ్లు తానే జరిపానంటూ డొమినిక్ మార్టిన్ అనే ఓ వ్యక్తి పోలీసుల ముందు లొంగిపోయాడు. జెహోవా’స్ విట్‌నెసెస్ గ్రూపునకు చెందినవాడిగా తన గురించి చెప్పుకొన్నాడని పోలీసులు తెలిపారు.
మూడు బాంబు పేలుళ్లు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాంబు పేలుళ్ల ఘటన కోచి సమీపంలోని కలామస్సెరీలో ఉన్న ‘జమ్రా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్’లో జరిగింది. జెహోవా’స్ విట్‌నెసెస్ అనే క్రైస్తవ గ్రూపు ఆధ్వర్యంలో ఆ సెంటర్‌లో మూడు రోజులుగా ప్రార్థనా సమావేశాలు నిర్వహిస్తున్నారు. చివరిరోజైన ఆదివారం దాదాపు 2 వేల మంది సమావేశమయ్యారు. ఉదయం 9.40 గంటలకు అంద రూ ప్రార్థనకు ఉపక్రమించిన వెంటనే పేలుడు సంభవించింది. పెద్ద చప్పుడు వినిపించగానే కళ్లు తెరిచి చూస్తే ఎదురుగా మంటలు కనిపించాయని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. కాగా, మొత్తం 3 బాంబులు పేలాయని, వాటిలో రెండు శక్తిమంతమైనవని, ఒకటి తక్కువ తీవ్రత కలిగినదని పోలీసువర్గాలు వెల్లడించాయి. ఘటనపై కేరళ ఉగ్రవాద నిరోధకదళంతోపాటు ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తున్నాయి. జరిగింది ఉగ్రవాద దాడా అన్నది ఇప్పుడే చెప్పలేమని, దర్యాప్తు అనంతరమే స్పష్టత వస్తుందని రాష్ట్ర డీజీపీ షేక్ దర్వేష్ సాహెబ్ తెలిపారు. పేలుడులో ఐఈడీని ఉపయోగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసిందన్నారు.
బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. ప్రజలు సంయమనం పాటించాలని, సోషల్ మీడియాలో విద్వేషపూరిత సందేశాలను వ్యాపింపజేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పేలుళ్లపై రాష్ట్ర గవర్నర్ మహమ్మద్ ఆరి్‌ఫఖాన్ దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. జరిగిన ఘటన అత్యంత దురదృష్టకరమని సీఎం పినరాయి విజయన్ పేర్కొన్నారు. సోమవారం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. కాగా కేరళ పేలుళ్ల నేపథ్యంలో ఢిల్లీ, ముంబైలో హైఅలర్ట్ ప్రకటించారు. ఇదిలా ఉండగా, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పలువురు అజ్ఞాత వ్యక్తులపై కేసు నమోదు చేశారు. వారిపై ఉపా కింద కూడా కేసులు పెట్టారు.
యుద్ధం నేపథ్యమే కారణమా?
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం దృష్ట్యా కేరళలో పలుప్రాంతాల్లో పాలస్తీనా సంఘీభావ ర్యాలీలు, ప్రదర్శనలు, సభలు జరుగుతున్నాయి. నిషేధిత జమాత్ ఏ ఇస్లామీ అనుబంధ సంఘం ‘సాలిడారిటీ యూత్ మూవ్‌మెంట్’ శుక్రవారం మలప్పురంలో జరిపిన సమావేశంలో హమాస్ నాయకుడు ఖాలేద్ మార్షల్ వర్చువల్‌గా ప్రసంగించారు. ఈ సభలు, సమావేశాల నేపథ్యంలో పాలస్తీనా అనుకూల, ఇజ్రాయెల్ వ్యతిరేక భావోద్వేగాలు పెరిగిపోయాయి. కాగా, కోచి ప్రాంతంలో యూదుల సంఖ్య అధికం. జెహోవా’స్ విట్‌నెసెస్ సమావేశం యూదులది అని భావించి దాడి జరిపారా? ఇజ్రాయెల్‌కు అనుకూలంగా ఉంటున్నారని భావించి దాడి చేశారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అందుకే ఈ పని చేశా!
బాంబు పేలుళ్లకు తానే పాల్పడినట్లు చెప్పి పోలీసులకు లొంగిపోయిన డొమినిక్ మార్టిన్.. అంతకుముందు యూట్యూబ్‌లో ఓ వీడియో పోస్టు చేశాడు. ‘గత 16 ఏళ్లుగా జెహోవాస్ విట్‌నెసె్‌సలో నేను సభ్యుడిగా ఉన్నా. వారు దేశద్రోహ భావజాలంతో ఉండటంతో మార్చటానికి ప్రయత్నించా. కానీ మార్పు లేకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నా. వారిది తప్పుడు సిద్ధాంతం. పిల్లల మెదళ్లలో విషం నింపుతున్నారు. జాతీయగీతం ఆలపించొద్దని, సైన్యంలో చేరొద్దని చెబుతుంటారు’ అని ఆ వీడియోలో మార్టిన్ పేర్కొన్నాడు.