Rs.2 thousand notes : తొలి రోజే రచ్చరచ్చ

ABN , First Publish Date - 2023-05-24T04:51:19+05:30 IST

రూ.2 వేల నోట్ల మార్పిడి మొదటి రోజైన మంగళవారమే గందరగోళంగా తయారైంది. నోట్లు మార్చడం కాకుండా బ్యాంకులు సొమ్ము డిపాజిట్‌

Rs.2 thousand notes : తొలి రోజే రచ్చరచ్చ

రూ.2,000 నోట్ల మార్పిడిలో గందరగోళం

న్యూఢిల్లీ, మే 23: రూ.2 వేల నోట్ల మార్పిడి మొదటి రోజైన మంగళవారమే గందరగోళంగా తయారైంది. నోట్లు మార్చడం కాకుండా బ్యాంకులు సొమ్ము డిపాజిట్‌ చేయాలని ఒత్తిడి చేస్తున్నాయని కొందరు ఫిర్యాదు చేశారు. నోట్ల మార్పిడికి గుర్తింపు కార్డులు చూపనక్కర్లేదని ఆర్‌బీఐతోపాటు ఎస్‌బీఐ ఇదివరకే స్పష్టం చేసినా.. బ్యాంకులు గుర్తింపు కార్డులు అడుగుతున్నాయని ఆక్షేపించారు. రూ.2వేల నోటును చలామణీ నుంచి ఉపసంహరిస్తున్నామ ని, మంగళవారం నుంచి బ్యాంకుల్లో నోట్లను మార్చుకోవాలని ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో తొలి రోజే బ్యాంకుల వద్ద జనం బారులు తీరారు. నోట్లు చెల్లవన్న ఆందోళన ఖాతాదారుల్లో ముఖ్యంగా వృద్ధుల్లో కనిపించింది. మండుటెండల్లోనూ క్యూలలో నిలబడ్డారు. మరోవైపు.. ఏటీఎంలు 2 వేల నోట్ల డిపాజిట్‌ను స్వీకరిస్తున్నా... పెట్రోలు బంకులు చాలా చోట్ల తీసుకోవడం లేదు.

కోర్టుల జోక్యం తగదు: ఆర్‌బీఐ

ఐడీ కార్డులు చూపక్కర్లేదనడం ఏకపక్ష నిర్ణయమని.. ఇది అవినీతి నిరోధక చట్టాలకు వ్యతిరేకమని పేర్కొంటూ న్యాయవాది అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మంగళవారం చీఫ్‌ జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్‌ సుబ్రమణ్యం ప్రసాద్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఆర్‌బీఐ తరఫున సీనియర్‌ న్యాయవాది పరాగ్‌ పి.త్రిపాఠి వాదనలు వినిపించారు. ఇది నోట్ల రద్దు కాదని.. నోట్ల మార్పిడి మాత్రమేనని.. ఇది చట్టబద్ధమైన ప్రక్రియని పేర్కొన్నారు. ఈ వ్యవహారాల్లో కోర్టుల జోక్యం తగదని తెలిపారు. తాను 2 వేల నోట్ల ఉపసంహరణను సవాల్‌ చేయడం లేదని ఉపాధ్యాయ్‌ పేర్కొన్నారు.

Updated Date - 2023-05-24T04:51:19+05:30 IST