చెప్తే చాలు.. వీడియో రెడీ!
ABN , First Publish Date - 2023-04-03T01:52:10+05:30 IST
కృత్రిమ మేధ అనగానే ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి గుర్తొస్తున్న పేరు చాట్‌జీపీటీ. అయితే కృత్రిమ మేధలో చాలా రకాలున్నాయి. చాట్‌జీపీటీ వాటిలో ఒకరకం మాత్రమే. అది ‘జనరేటివ్ ఏఐ’కి ఉదాహరణ. జనరేటివ్ ఏఐ అంటేఉత్పాదక కృత్రిమ మేధ అని అర్థం.
‘టెక్ట్స్ టు వీడియో’లను రూపొందిస్తున్న కృత్రిమ మేధ
కీబోర్డు కమాండ్ ఇస్తే చాలు.. కావాల్సిన వీడియోలు సిద్ధం
అమెరికన్ స్టార్టప్ ‘రన్‌వే’ ఏఐ మోడల్ ‘జెన్-2’ అద్భుతం
అలాంటివే మెటా ‘మేక్ ఏ వీడియో’గూగుల్ ‘ఇమాజెన్ వీడియో’
భవిష్యత్తులో వీడియో, సినిమా మేకింగ్ సులువు
‘అవతార్’ సినిమాలో పాత్రధారులు అలా నీలిరంగులో కనిపించడం కోసం.. వారి శరీరాలకు రకరకాల వైర్లను తగిలించి, గ్రీన్ మ్యాట్లు వేయాల్సి వచ్చింది! మరికొన్ని షాట్ల కోసమైతే కొత్త టెక్నాలజీలనే సృష్టించాల్సి వచ్చింది! కానీ.. కొత్తపుంతలు తొక్కుతున్న కృత్రిమ మేధ మున్ముందు దాన్ని మరింత సులభం చేయనుంది! కొన్ని టెక్స్ట్ కమాండ్లను, నమూనా చిత్రాలను కీబోర్డు ద్వారా ఇన్‌పుట్‌గా ఇచ్చి మనకేం కావాలో చెబితే చాలు.. దానంతట అదే వీడియోలను తయారుచేసే ఏఐ మోడళ్లు వస్తున్నాయి! ప్రస్తుతానికి ఈ తరహా ‘టెక్స్ట్ టు వీడియో’ ఏఐ మోడళ్లన్నీ ప్రాథమిక దశలో ఉన్నాయి. అవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. సినిమా ‘తీయక్కర్లేదు’.. జస్ట్ చెబితే చాలు.. సినిమా తయారైపోతుందన్నమాట!
(సెంట్రల్ డెస్క్)
కృత్రిమ మేధ అనగానే ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి గుర్తొస్తున్న పేరు చాట్‌జీపీటీ. అయితే కృత్రిమ మేధలో చాలా రకాలున్నాయి. చాట్‌జీపీటీ వాటిలో ఒకరకం మాత్రమే. అది ‘జనరేటివ్ ఏఐ’కి ఉదాహరణ. జనరేటివ్ ఏఐ అంటేఉత్పాదక కృత్రిమ మేధ అని అర్థం. ఉదాహరణకు మీ భార్య కోసమో, గర్ల్‌ఫ్రెండ్ కోసమో చక్కటి ఇంగ్లిష్ కవిత కావాలని అడిగితే చాట్‌జీపీటీ చటుక్కున రాసిచ్చేస్తుంది. ‘సి’ లాంగ్వేజ్‌లో కంప్యూటర్ ప్రోగ్రామ్ రాయమంటే రాసిపెడుతుంది. జనరేటివ్ ఏఐ తెలివితేటలు దీనికిమాత్రమే పరిమితంకావట్లేదు. నానాటికీ కొత్తపుంతలు తొక్కుతున్నాయి. కవితలు, కంప్యూటర్ ప్రోగ్రాములు రాయడమంటే కేవలం ‘టెక్స్ట్’ మాత్రమే. జనరేటివ్ ఏఐలో తదుపరి దశ.. టెక్స్ట్ టు ఇమేజ్. అంటే మనం కొన్ని ముఖకవళికలు చెప్పి వాటి ఆధారంగా ఒక చిత్రాన్ని రూపొందించమంటే రూపొందించగలిగే దశ ఇది. దాన్ని కూడా దాటేసి మనం ఇచ్చే టెక్స్ట్ ఇన్‌పుట్స్ ఆధారంగా వీడియోలు (టెక్స్ట్ టు వీడియో) రూపొందించే దశకు జనరేటివ్ ఏఐ చేరుకుందంటే అతిశయోక్తి కాదు. అమెరికాకు చెందిన ‘రన్‌వే’ అనే స్టార్టప్ రూపొందించిన జెన్-2 మోడల్ ఏఐ ఈ ‘టెక్ట్స్ టు వీడియో’ అద్భుతాన్ని సాధించింది. ‘‘బ్యాక్‌ప్యాక్‌తో అడవిలో నడిచే వృద్ధుడు’’ అని కీబోర్డుతో ఈ ఏఐకి ఇన్‌పుట్ ఇస్తే అలాంటి ఒక వీడియోని క్షణాల్లో రూపొందిస్తుందది! చాట్‌జీపీటీ సృష్టికర్తలే అభివృద్ధి చేసిన ‘డాల్-ఈ’ కూడా ఇంచుమించుగా ఇదే పని చేయగలదు. 2022 సెప్టెంబరులోనే ‘మెటా’ కూడా ‘మేక్ ఏ వీడియో’ అనే ఒక టూల్‌ని అందుబాటులోకి తెచ్చింది. ఇది కూడా మనమిచ్చే టెక్స్ట్ ఇన్‌పుట్‌తో వీడియోలను తయారుచేస్తుంది. అయితే దీంట్లో ఎలాంటి శబ్దాలూ ఉండవు. శబ్దాలను తర్వాత జోడించుకోవచ్చు. మెటా సంస్థ ఈ టూల్‌ను విడుదల చేసిన వారం రోజుల్లోనే గూగుల్ కూడా ‘ఇమాజెన్ వీడియో’ పేరుతో ఓ టెక్స్ట్ టు వీడియో ఏఐ మోడల్‌ను ప్రకటించింది. ఇప్పటిదాకా చెప్పుకొన్న ఏఐ మోడళ్లన్నీ 10 నిమిషాల్లోపు నిడివిగల వీడియోలను టెక్స్ట్ ద్వారా రూపొందించేవే. అంతకు మించిన నిడివిగల వీడియోలను రూపొందించే ‘ఫెనాకీ’ అనే మరో ఏఐ మోడల్‌ను కూడా గూగుల్ అభివృద్ధి చేసింది.
ఆ కష్టాలుండవు..
ఒక యానిమేషన్ వీడియో తయారుచేయాలంటే బొమ్మలు గీసి వాటి కదలికలను నిర్దేశించి, పూర్తిస్థాయి వీడియోగా మార్చడానికి కొన్ని గంటలు.. రోజులు.. వారాలు కూడా పడుతుంది! చిలీలోని ఆండెస్ పర్వతాల డ్రోన్‌షాట్ కావాలంటే మామూలు పద్ధతిలో అక్కడికి వెళ్లి, డ్రోన్‌తో ఆ షాట్ తీయాల్సి వస్తుంది. కానీ టెక్స్ట్ టు వీడియో కాన్సె్‌ప్టలో ఆ కష్టాలేవీ ఉండవు. ‘చిలీలోని ఆండెస్ పర్వతాల డ్రోన్ షాట్’ అని ఇన్‌పుట్ ఇవ్వగానే ఏఐ మోడల్ ఆ వీడియోను రూపొందించి ఇచ్చేస్తుంది. దాన్ని ఎలా వాడుకుంటారన్నది మీ ఇష్టం. కేవలం టెక్స్ట్ టు వీడియోనే కాదు.. ఇమేజ్ టు వీడియో (అంటే మనం మెగాస్టార్ చిరంజీవి ఫొటో ఏఐకి ఇన్‌పుట్‌గా ఇచ్చి ఆయన న్యూయార్క్ వీధుల్లో, నియాన్ లైట్ల నేపథ్యంలో నడుస్తున్న దృశ్యం తయారు చేయమంటే చేసిస్తుంది), వీడియో టు వీడియో (మనం ఇచ్చిన వీడియోని వాడుకునికావాల్సిన విధంగా మార్చే విధానం) వంటి సేవలను ‘రన్‌వే’ ఏఐ మోడల్ జెన్-2 అందిస్తోంది.
ఎంత కచ్చితంగా చెప్తే..
టెక్స్ట్ టు వీడియో ఏఐ మోడళ్లకు ఇలా కమాండ్లు ఇచ్చి అలా కావాల్సిన వీడియోను రూపొందించుకోవచ్చనుకుంటే పొరబాటే. దీంట్లో చాలా సమస్యలున్నాయి. మనం ఇచ్చే కమాండ్లు చాలా కచ్చితంగా ఉండాలి. ఉదాహరణకు.. ఇక్కడ ప్రస్తావించిన వీడియోనే తీసుకుంటే ‘బ్యాక్‌ప్యాక్‌తో అడవిలో నడిచే వృద్ధుడు’ అంటే అది అస్పష్టమైన కమాండ్. ‘బ్యాక్‌ప్యాక్‌తో అడవిలో నడిచే 60 ఏళ్ల అమెరికన్/ఇండియన్’ ఇలా మన ఇన్‌పుట్లు ఎంత కచ్చితత్వంతో ఉంటే అంత కచ్చితమైన అవుట్‌పుట్‌ను ఈ ఏఐ మోడళ్లు అభివృద్ధి చేయగలవన్నమాట. అలాగే ఈ కమాండ్ల ద్వారా పోర్న్ వీడియోలు చేయకుండా ఏఐని నియంత్రించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఏ పేరున్న హాలీవుడ్ నటి పేరునో ప్రస్తావించి ఆమెతో ఒక పోర్న్ వీడియో చేయాలని కమాండ్ ఇస్తే ఏఐ దాన్ని తిరస్కరించాలి. ఆత్మహత్యలకు, నేరాలకు పురిగొల్పే తరహా వీడియోలను రూపొందించకుండా శిక్షణ ఇవ్వాలి.