Earth Day : వాతావరణ మార్పులపై అవగాహన పెంచేందుకు భారీ కార్యక్రమం

ABN , First Publish Date - 2023-04-22T13:52:14+05:30 IST

ధరిత్రి దినోత్సవం సందర్భంగా వాతావరణ మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎనర్జీ స్వరాజ్ ఫౌండేషన్

Earth Day : వాతావరణ మార్పులపై అవగాహన పెంచేందుకు భారీ కార్యక్రమం
Global Climate Event

న్యూఢిల్లీ : ధరిత్రి దినోత్సవం సందర్భంగా వాతావరణ మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎనర్జీ స్వరాజ్ ఫౌండేషన్ (Energy Swaraj Foundation) భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. వాతావరణ మార్పులను ఎదుర్కొనడం కోసం అవగాహన కలిగిన పౌరుల సారథ్యంలో సామూహిక ఉద్యమాన్ని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం లక్ష్యం. దీని కోసం అనేక సంస్థల సహకారాన్ని తీసుకుంటోంది. ప్రపంచంలోని అతి పెద్ద గ్లోబల్ క్లైమేట్ క్లాక్ అసెంబ్లీని శనివారం నిర్వహిస్తోంది. ఇది ప్రపంచ స్థాయిలో రికార్డు సృష్టిస్తుందని చెప్తోంది.

ప్రపంచం నేడు అసమానతలతో కూడిన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటోంది. తరచూ ప్రక‌‌ృతి సంబంధిత విపత్తులు సంభవిస్తున్నాయి. దీనికి కారణం మానవ ప్రేరేపిత వాతావరణ మార్పులే. వాతావరణ మార్పుల వల్ల అనుబంధ ప్రభావాలు తీవ్ర స్థాయిలో ఉంటాయి. కాబట్టి ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదలను పరిమితికి లోబడి ఉండేలా చేయడం చాలా ముఖ్యం.

భారత దేశం ఈ ఏడాది జీ20 అధ్యక్ష బాధ్యతలను నిర్వహిస్తోంది. వాతావరణానికి అనుకూలమైన ప్రవర్తన కలిగి ఉండేలా అవగాహన కల్పించేందుకు, అటువంటి ప్రవర్తనను ప్రోత్సహించేందుకు మిషన్ లైఫ్ వంటి అనేక కార్యక్రమాలను భారత ప్రభుత్వం అమలు చేస్తోంది. వాతావరణానికి సంబంధించిన చర్చల్లో అభివృద్ధి చెందుతున్న, తక్కువ అభివృద్ధి చెందిన దేశాలకు ప్రాతినిధ్యం వహించడంలో భారత దేశం కీలక పాత్ర పోషిస్తోంది. ఈ కృషిలో భాగంగానే ఎనర్జీ స్వరాజ్ ఫౌండేషన్ (Energy Swaraj Foundation) వివిధ సంస్థల సహకారంతో ప్రపంచంలోనే అతి పెద్ద గ్లోబల్ క్లైమేట్ క్లాక్ అసెంబ్లీ, డిస్‌ప్లే ఈవెంట్‌ను శనివారం న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తోంది. వాతావరణ మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం.

సౌర విద్యుత్తు మేలు

ప్రొఫెసర్ చేతన్ ఎస్ సోలంకి మాట్లాడుతూ, కార్బన్ ఆధారిత ఇంధనాన్ని వినియోగించడమే ఈ సమస్యకు ప్రధాన కారణమని చెప్పారు. సోలార్ ఎనర్జీకి మారడమే దీనికి పరిష్కారమని చెప్పారు.

రికార్డు సృష్టించే అవకాశం

ఈ భారీ కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కల్పించవచ్చునని నిర్వాహకులు భావిస్తున్నారు. విద్య, కార్పొరేట్, ప్రభుత్వ తదితర రంగాలకు చెందిన సుమారు 2,000 సంస్థలకు చెందిన దాదాపు 3,000 మందికిపైగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆన్‌లైన్ ద్వారా మరో 10,000 మంది పాల్గొంటారని అంచనా. ఈ కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదవుతుందని నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు.

క్లైమేట్ క్లాక్‌పై శిక్షణ

వాతావరణ గడియారం (Climate Clock)ను ఎలా తయారు చేయాలో ఈ కార్యక్రమంలో నేర్పుతారు. దాదాపు 7,000 మంది ఈ గడియారాన్ని తయారు చేయడం నేర్చుకుని, తమ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. తద్వారా వాతావరణ మార్పుల గురించి, ప్రభుత్వాలు, ప్రజలు అమలు చేయవలసిన చర్యల గురించి వివరిస్తారు. వాతావరణ గడియారాలను ఈ ఫౌండేషన్ ఉచితంగా కొందరికి ఇచ్చింది. కొన్ని సంస్థలు వీటిని కొనుగోలు చేశాయి. http://es-pal.org/climate-clock-event/training-materials లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో శిక్షణ పొందవచ్చు.

ఇవి కూడా చదవండి :

Mamata Banerjee : ప్రాణ త్యాగానికైనా సిద్ధం.. ఈద్ సందర్భంగా మమత బెనర్జీ..

Eid prayers : ముస్లిం సోదరులకు మోదీ ఈద్ శుభాకాంక్షలు

Updated Date - 2023-04-22T13:52:14+05:30 IST