Dr. Indira Dutt: సమైక్యతకు ప్రతీక సంక్రాంతి

ABN , First Publish Date - 2023-01-12T07:53:20+05:30 IST

‘సంక్రాంతి పండుగ సమైక్యతకు ప్రతీక .. తెలుగు వారికి పెద్ద పండుగ ’ అని ప్రపంచ తెలుగు సమాఖ్య (డబ్ల్యూటీఎఫ్‌) అధ్యక్షురాలు డా.వీఎల్‌ ఇందిరాదత్‌

Dr. Indira Dutt: సమైక్యతకు ప్రతీక సంక్రాంతి

- డబ్ల్యూటీఎఫ్‌ అధ్యక్షురాలు డాక్టర్‌ ఇందిరాదత్‌

ప్యారీస్‌(చెన్నై), జనవరి 11: ‘సంక్రాంతి పండుగ సమైక్యతకు ప్రతీక .. తెలుగు వారికి పెద్ద పండుగ ’ అని ప్రపంచ తెలుగు సమాఖ్య (డబ్ల్యూటీఎఫ్‌) అధ్యక్షురాలు డా.వీఎల్‌ ఇందిరాదత్‌(Dr. Indira Dutt) పేర్కొన్నారు. స్థానిక టి.నగర్‌ అంకూర్‌ ప్లాజా డబ్ల్యూటీఎఫ్‌ కార్యాలయంలో బుధవారం సాయంత్రం 4 గంటలకు ఇందిరాదత్‌ అధ్యక్షతన ప్రారంభమైన సంక్రాంతి వేడుకలు రెండు గంటల పాటు కొనసాగాయి. ముందుగా ఇందిరాదత్‌ మాట్లాడుతూ తమ సంస్థ తరపున ఈ నెల 8న హైదరాబాదులో సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా జరిపినట్లు తెలిపారు. అదే విధంగా మహానగరం చెన్నైలో కూడా తెలుగు వారి మధ్య పండుగ జరుపుకోవడం మహదానందంగా ఉందన్నారు. ఇంటిల్లిపాది సంతోషంగా జరుపుకొనే సంక్రాంతి పండుగ సమైక్యతకు ప్రతీక అని, గంగిరెద్దులు, హరిదాసులు, పందేలా జోరుతో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఆంధ్రులు నివసించే ప్రాంతాల్లో కూడా సందడి నెలకొంటుందన్నారు. సరళామృతం బృందం సభ్యులు తాడేపల్లి జయశ్రీ, రమాదేవి పొత్తూరు భక్తిగీతాలు ఆలపించారు. అలాగే, అరుణశ్రీ త్యాగయ్య కీర్తనలు ఆలపించారు. సంస్థ సభ్యుడు గోటేటి వెంకటేశ్వరరావు నిర్వహించిన క్విజ్‌లో సభకు హాజరైన పలువురు ఉత్సాహంగా పాలుపంచుకొని బహుమతులు సొంతం చేసుకున్నారు. అలాగే, కార్యదర్శి లక్ష్మి మోహనరావు నిర్వహించి ‘హౌసి...హౌసి’, లక్కీ డీప్‌ తదితర కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో డబ్ల్యూటీఎఫ్‌ సెక్రటరీ జనరల్‌ డా.ఏవీ శివరామప్రసాద్‌, డా.స్వర్ణకుమారి, ప్రమీల ఆనంద్‌, జేఎం నాయుడు, సీవీ సుబ్బారావు, బేతిరెడ్డి శ్రీనివాస్‌, కేఎన్‌ సురేష్ కుమార్‌ తదితర తెలుగు ప్రముఖులు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు.

Updated Date - 2023-01-12T07:53:21+05:30 IST