Share News

Dhankhad : ధన్‌ఖడ్‌ చిన్నపిల్లాడిలా ఏడ్చాడు!

ABN , Publish Date - Dec 26 , 2023 | 01:04 AM

ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ను మిమిక్రీతో అనుకరించి అపహాస్యం చేసిన టీఎంసీ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ.. మరోసారి అదే పనిచేశారు. అంతేకాదు.. వెయ్యి సార్లు ఇదే

Dhankhad  : ధన్‌ఖడ్‌ చిన్నపిల్లాడిలా ఏడ్చాడు!

ఉపరాష్ట్రపతిని మళ్లీ పరిహసించిన టీఎంసీ ఎంపీ..

వెయ్యి సార్లు ఇలాగే చేస్తానని స్పష్టీకరణ

కల్యాణ్‌ బెనర్జీపై బీజేపీ ఆగ్రహం

విపక్ష కూటమి హస్తం ఉందని ధ్వజం

కోల్‌కతా, డిసెంబరు 25: ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ను మిమిక్రీతో అనుకరించి అపహాస్యం చేసిన టీఎంసీ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ.. మరోసారి అదే పనిచేశారు. అంతేకాదు.. వెయ్యి సార్లు ఇదే చేస్తానని బెంగాల్లోని సీరంపూర్‌లో ప్రకటించారు. చిన్న విషయానికే ధన్‌ఖడ్‌ చిన్న పిల్లాడిలా ఏడ్చారని ఎద్దేవా చేశారు. గతవారం లోక్‌సభ, రాజ్యసభల నుంచి ప్రతిపక్ష సభ్యులు పలువురు సస్పెండ్‌ అయినప్పుడు.. పార్లమెంటు వెలుపల జరిగిన ఓ ధర్నాలో బెనర్జీ ఉపరాష్ట్రపతి హావభావాలను మిమిక్రీ చేస్తూ మాట్లాడారు. దీనిని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ ఫోన్‌లో వీడియో కూడా తీశారు. దీనిపై తీవ్ర మనస్తాపానికి గురైన ధన్‌ఖడ్‌.. టీఎంసీ ఎంపీ తీరు బాధాకరమని.. తననే గాక ఉపరాష్ట్రపతి పదవిని, పార్లమెంటును కూడా అవమానించారని ధ్వజమెత్తారు. అయితే ఎవరినీ బాధపెట్టడం తన ఉద్దేశం కాదని బెనర్జీ ఆ తర్వాత వివరణ ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు ధన్‌ఖడ్‌ను అపహసించారు. చిన్న విషయానికే ఆయన ఉడుక్కుంటుంటారని వ్యాఖ్యానించారు. ‘మిమిక్రీ చేయడం మొదట పార్లమెంటులో ప్రధాని మోదీ నుంచి, తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నుంచి నేర్చుకున్నాను. మేం వాటిని క్రీడాస్ఫూర్తితో తీసుకున్నాం. జోక్‌ను అర్థం చేసుకోకుండా ధన్‌ఖడ్‌ ఏడ్వడం మొదలుపెడితే నేను చేసేదేమీ లేదు. మిమిక్రీ కొనసాగిస్తాను. అదో కళారూపం. అవసరమైతే వెయ్యి సార్లు చేస్తాను. నా భావాలను వ్యక్తీకరించే అన్ని ప్రాథమిక హక్కులూ నాకున్నాయి. కావాలంటే నన్ను జైల్లో పెట్టుకోవచ్చు. వెనక్కి తగ్గేది లేదు’ అని స్పష్టం చేశారు. దీనిపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. కల్యాణ్‌ బెనర్జీ వెనుక కాంగ్రెస్‌ సారథ్యంలోని ‘ఇండియా’ కూటమి హస్తం ఉందని ఆ పార్టీ అధికార ప్రతినిధి షెహజాద్‌ పూనావాలా ధ్వజమెత్తారు. ‘ఉపరాష్ట్రపతిని అవమానించడం, అపహాస్యం చేయడం తన ప్రాథమిక హక్కట! ధన్‌ఖడ్‌ జాట్‌ సమాజ్‌కు చెందినవారు. రైతుపుత్రుడు. తొలి ఓబీసీ ఉపరాష్ట్రపతి. అలాంటి వ్యక్తిని అవమానించడం విపక్ష కూటమి మానసిక స్థితిని తెలియజేస్తోంది. అణగారిన వర్గాలవారు రాష్ట్రపతి, ప్రధాని, ఉపరాష్ట్రపతి పదవులను అధిరోహిస్తే వారిని దూషించడమే వాటి ఉద్దేశం. బెనర్జీ చర్యను మమతా దీదీ, రాహుల్‌గాంధీ, కూటమి సీనియర్‌ నేతలు స్పష్టంగా ప్రోత్సహిస్తున్నారు’ అని ‘ఎక్స్‌’లో దుయ్యబట్టారు. కాగా, కల్యాణ్‌ బెనర్జీ వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆయన బెంగాల్‌ మాజీ సీఎం బుద్ధదేవ్‌ భట్టాచార్య, ప్రధాని మోదీ ప్రతిష్ఠకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారు. ధన్‌ఖడ్‌ బెంగాల్‌ గవర్నర్‌గా ఉన్నప్పుడు కూడా తీవ్ర విమర్శలు చేశారు.

రాహుల్‌ వీడియో తీయడంలో తప్పేముంది: సిబల్‌

కల్యాణ్‌ బెనర్జీ మిమిక్రీని రాహుల్‌ వీడియో తీయడంలో తప్పేముందని కాంగ్రెస్‌ మాజీ నేత, ఎంపీ కపిల్‌ సిబల్‌ ప్రశ్నించారు. ఆ వీడియోను ఇతరులకు ఫార్వర్డ్‌ చేయలేదని చెప్పారు. అయితే తానే గనుక అక్కడ ఉంటే అలా చేయనని చెప్పారు. మిమిక్రీ చేసిన వ్యక్తి ఒక్కసారి ఆలోచించుకుని ఉండాల్సిందన్నారు. రాజ్యాంగ పదవులను కించపరచడం ఆందోళనకరంగా ఉందన్నారు.

Updated Date - Dec 26 , 2023 | 01:04 AM