DGP: డప్పు కొట్టి నృత్యం చేసిన డీజీపీ
ABN , First Publish Date - 2023-01-15T08:07:55+05:30 IST
స్థానిక ఆవడిలోని రాష్ట్ర ప్రత్యేక దళం పోలీసుల శిక్షణా కేంద్రం మైదానంలో శనివారం ఉదయం జరిగిన పొంగల్ వేడుకల్లో డీజీపీ శైలేంద్రబాబు
- పొంగల్ వేడుకల్లో శైలేంద్రబాబు
చెన్నై, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఆవడిలోని రాష్ట్ర ప్రత్యేక దళం పోలీసుల శిక్షణా కేంద్రం మైదానంలో శనివారం ఉదయం జరిగిన పొంగల్ వేడుకల్లో డీజీపీ శైలేంద్రబాబు(DGP Shailendra Babu) తమిళ సంప్రదాయక దుస్తులైన తెల్లటి పట్టు చొక్కా, పట్టు ధోవతి ధరించి సందడి చేశారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేసిన శైలేంద్రబాబుకు శిక్షణా కేంద్రం డైరెక్టర్ జయరామ్, సాయుధ దళం అధ్యక్షురాలు రాధిక తదితరులు పూర్ణకుంభంతో మంగళవాయిద్యాల నడుమ స్వాగతం పలికారు. మైదానం అంతటా చెరకు గడలు, అరటి చెట్లు తోరణాలతో అందంగా అలంకరించి ఉండటాన్ని చూసి డీజీపీ సంతోషం వ్యక్తం చేశారు. ఆ తర్వాత పొంగలిపెట్టి, కర్పూర హారతినిచ్చారు. అదే సమయంలో జానపద కళాకారులు డప్పు వాయిస్తూ నృత్యం చేస్తుండటాన్ని చూసిన శైలేంద్రబాబు ఆ ప్రాంతానికి వెళ్ళి ఓ కళాకారుడి వద్దనున్న డప్పును తీసుకుని తాను కూడా వాయిస్తూ వారితో వలయాకారంలో కదులుతూ, జతులకు అనుగుణంగా పది నిమిషాలపాటు నృత్యం చేశారు. ఈ దృశ్యాన్ని చూసి పొంగల్ వేడుకల్లో పాల్గొన్న పోలీసు ఉన్నతాధికారులు, వారి కుటుంబ సభ్యులు ఆనంద పరవశులయ్యారు.