PM MODI: ప్రజాస్వామ్యం వల్ల కొందరికి నొప్పి!
ABN , First Publish Date - 2023-03-19T01:42:12+05:30 IST
గ్రెస్ నేత రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ, దేశంలోని సంస్థల వల్ల కొందరికి నొప్పి కలుగుతోందని, అందుకే విమర్శలు చేస్తున్నారని రాహుల్ పేరెత్తకుండానే విమర్శించారు.

అందుకే విమర్శలు చేస్తున్నారు
రాహుల్‌పై మోదీ పరోక్ష విమర్శలు
న్యూఢిల్లీ, మార్చి 18: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ, దేశంలోని సంస్థల వల్ల కొందరికి నొప్పి కలుగుతోందని, అందుకే విమర్శలు చేస్తున్నారని రాహుల్ పేరెత్తకుండానే విమర్శించారు. ఇటీవల లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ భారత్‌లో మొత్తంగా ప్రజాస్వామ్య స్వరూపమే ప్రమాదంలో పడిందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఇండియా టుడే కాంక్లేవ్‌లో ప్రసంగించిన మోదీ, రాహులే లక్ష్యంగా విమర్శలు చేశారు. దేశం ఆత్మవిశ్వాసంతో ముందుకెళుతున్న తరుణంలో.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మేధావులంతా భారత్ వైపే ఆశావాహ దృక్పథంతో చూస్తున్న సమయంలో కొందరు దేశ నైతికత దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. శుభ సమయాల్లో దిష్టి తగలకుండా ఉండేందుకు నల్ల (కాటుక) చుక్క పెట్టే సంప్రదాయం మన దగ్గర ఉందని, కొందరు ఇప్పుడు ఆ దిష్టి చుక్క పెట్టే పనిలో ఉన్నారని రాహుల్‌ను ఎద్దేవా చేశారు. మునుపు అవినితీకి పాల్పడటం ద్వారా కొందరు వార్తల్లో నిలిచేవారని, ఇప్పుడు ఆ తరహా వ్యక్తులు తమపై దాడులు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారని విపక్ష నేతలను ఉద్దేశించి అన్నారు.
భక్షకుడే రక్షకుడిగా పోజిస్తున్నాడు
దేశ సమగ్రతను దెబ్బతీసే కథనాలకు చోటివ్వద్దని, ఈ విషయంలో అప్రమత్తతతో వ్యవహరించాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు సూచించారు. ఇక్కడ నుంచి లేదా విదేశాల నుంచి ఇష్టానుసారం చెబుతున్న నిరాధార, అహేతుక అభిప్రాయాలు మన దేశ ప్రజాస్వామ్య స్వభావాన్ని ధ్వంసం చేయలేవన్నారు. ప్రముఖ మలయాళ దినపత్రిక ‘మాతృభూమి’ శత వార్షికోత్సవంలో ఠాకూర్ మాట్లాడారు. తెలుపురంగు టీ-షర్ట్ ధరించిన ‘భక్షకుడు’... తానే ప్రజాస్వామ్య ‘రక్షకుడి’గా చెప్పుకోవాలని ప్రయత్నించడం ఆశ్చర్యం కలిగిస్తోందని రాహుల్‌ను ఉద్దేశించి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేసి, 93 రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసిందన్నారు. కొత్త టెక్నాలజీ వల్ల ప్రయోజనాలతో పాటు డిజిటల్ వలసవాదం ముప్పు కూడా పొంచి ఉందని చెప్పారు.
లండన్‌లో రాహుల్ ఏమన్నాడంటే..
‘‘మోదీ పాలనలో దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు నిర్వీర్యం అవుతుండడమన్నది భారత్ అంతర్గత సమస్యే. దీనికి పరిష్కారం కూడా అంతర్గతంగానే కనుగొంటాం. కానీ, భారత్‌లో ప్రజాస్వామ్య మనుగడ అనేది ప్రపంచంలోని ప్రజలందరి ప్రయోజనాలతో కూడి ఉన్నది. దీని ప్రభావం భారతదేశ సరిహద్దులు దాటి ఉంటుంది. ఒకవేళ భారత్‌లో ప్రజాస్వామ్యం కూలిపోతే.. ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. అందుకే ఇది మాకు (భారతీయులకు) మాత్రమే కాకుండా మీకు (ప్రపంచ దేశాలకు) కూడా చాలా ముఖ్యమైన అంశం. ఈ సమస్యను మేమే పరిష్కరించుకోగలిగినా.. భారత్‌లో ఏం జరుగుతుందో, ప్రజాస్వామ్యం ఏ విధంగా దాడికి గురవుతుందో మీరు తెలుసుకోవాలి. ఆర్‌ఎ్‌సఎస్ అనే ఒక చాందసవాద, నియంతృత్వ సంస్థ భారత్‌లోని అన్ని వ్యవస్థలనూ చెరబట్టింది. దీంతో దేశంలో ప్రజాస్వామ్య పోటీ స్వభావమే పూర్తిగా మారిపోయింది. యూరప్, అమెరికా.. భారత్ నుంచి వాణిజ్య ప్రయోజనాలు పొందుతూ కూడా భారత్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు తగిన కృషి చేయడంలేదు.’’