ఢిల్లీ మద్యం కుంభకోణం.. ఈడీ కస్టడీకి దినేశ్‌ అరోరా

ABN , First Publish Date - 2023-07-08T01:40:47+05:30 IST

ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐకి అప్రూవర్‌గా మారిన వ్యాపారవేత్త దినేశ్‌ అరోరా అరెస్టు విషయాన్ని ఈడీ శుక్రవారం బయటపెట్టింది.

ఢిల్లీ మద్యం కుంభకోణం.. ఈడీ కస్టడీకి దినేశ్‌ అరోరా

ఢిల్లీ మద్యం కుంభకోణం.. ఈడీ కస్టడీకి దినేశ్‌ అరోరా

న్యూఢిల్లీ, జూలై 7(ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐకి అప్రూవర్‌గా మారిన వ్యాపారవేత్త దినేశ్‌ అరోరా అరెస్టు విషయాన్ని ఈడీ శుక్రవారం బయటపెట్టింది. అతడిని ఢిల్లీ రౌజ్‌ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట ప్రవేశపెట్టింది. ఏడు రోజుల కస్టడీ కోరగా నాలుగు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. దినేశ్‌ విచారణలో కుంభకోణంలో హైదరాబాద్‌తో ఉన్న లింకులపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు అప్రూవర్‌గా మారినప్పటికీ దినేశ్‌ అన్ని విషయాలను చెప్పడం లేదని ఈడీ న్యాయవాదులు కోర్టులో వాదించారు. మద్యం కుంభకోణంలో చేతులు మారిన మొత్తంలో దాదాపు రూ.2.2 కోట్లను దినేశ్‌ అరోరా, ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు అమిత్‌ అరోరాలు ఢిల్లీ మాజీ డిప్యుటీ సీఎం సిసోడియాకు చేరవేశారని వివరించారు. దీనిపై వాట్సప్‌ చాట్‌ రూపంలో ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాగా, నోటీసులిచ్చిన ప్రతిసారీ దినేశ్‌ ఈడీ విచారణకు హాజరై సహకరించారని, అప్రూవర్‌ను అరెస్టు చేస్తే కేసు పూర్తిగా మారుతుందని అతడి తరఫు న్యాయవాదులు వాదించారు. అప్రూవర్‌ నుంచి అన్ని విషయాలు రాబట్టుకుని కూడా అరెస్టు చేయడం సరికాదన్నారు. వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను 11వ తేదీకి వాయిదా వేసింది

నిందితుల ఆస్తులు అటాచ్‌

మద్యం కుంభకోణంలో నిందితులుగా ఉన్న సిసోడియా, చారియట్‌ ప్రొడక్షన్స్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ యజమాని రాజేశ్‌ జోషీ, వ్యాపారవేత్తలు గౌతమ్‌ మల్హోత్రా, అమన్‌దీప్‌సింగ్‌ ధల్‌కు చెందిన రూ.52.14 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేశామని ఈడీ శుక్రవారం వెల్లడించింది. ఇందులో రూ.11.49 లక్షల బ్యాంకు బ్యాలెన్సుతో సహా రూ.7.29 కోట్ల విలువైన ఆస్తులు మనీశ్‌ సిసోడియా, ఆయన భార్య సీమాకు చెందినవని పేర్కొంది.

Updated Date - 2023-07-08T01:40:47+05:30 IST